సెలయేటి గలగల లలో నీ నవ్వును వింటున్నాను, గులక రాళ్లపై పారేటి స్వచ్ఛమైన నీళ్లలో... నీ కళ్ళను చూస్తున్నాను. రెపరెపలాడే తుమ్మెద రెక్కల్లో... నీ కంటి రెప్పలను, రంగుకోక కట్టిన సీతాకోకలో... నీ పెదవి ఎరుపును చూస్తున్నాను. నిగనిగలాడే ముత్యపు ఛాయను నీ నవ్వులో చూస్తున్నాను.
చిగురుటాకుల మధ్య దాగిన చిన్ని పూవులా... నీ పెదవుల మధ్య ఆ చిరునవ్వుని చూస్తున్నాను. నీ చిన్ని అడుగులు తాకిన నేలపై నేను కుంకుమ అద్దుకుంటున్నాను. నీ చేతి వేళ్లపైన చిట్టి వెంట్రుకలను నా శ్వాసతో ఆడుకుంటున్నాను. నీ కోర మీసపు కొనలను నా వేళ్ళతో చుట్టి, సంపెంగ చమురులద్ది సరసమాడుతున్నాను. కొంటె కబురులు చెప్పే నీ మెడ వంపులో నా పెదవులు అద్ది పెట్టుకున్నాను. నీ వొంపులు తిరిగిన బుజముపై, నా చంపలనానించాను. నీ నవ్వుల విరజాజులు, విడివడి, నా జడపై జారి... మరికొన్ని నా మెడలో మాలై... పూల వానై...కురిసి తడిసిపోతుంటే... ఆ గాలివానలో కొట్టుకు పోతూ... సాయం కోసం నీ చేయి నందబోతే, నీ జాడలేదు. ఈ జడివాన ఒక కల్లబొల్లి స్వప్నమేనా! నే మీననై ఈదింది ఈ కలల కొనేటి లోనా...
సాయంత్రపు గాలులొచ్చి నీ పేరు నడిగితే... నా పేరే పెదవులపై పలుకమన్నాను. కొంగుచాటు కనులు దాచుకుని, వేకువొచ్చే దాకా... వేలికొనలతో... ముగ్గులేస్తూ ఉన్నాను. మిణుకు మిణుకుమనే తారలను కునుకు తీయక చూస్తున్నాను. కలువల కన్ను గీటే చందమామను నీ కబురులు అడుగుదామంటే... అసూయ పడతాడని అడగలేదు. చెట్ల నీడలో ఆడుకునే ఎండుటాకుల చప్పుడు మాత్రమే వినిపిస్తోంది. నల్ల కలువల కళ్ళు ఎరుపు నులుము కుంటున్నాయి. నిర్మలమైన ఆకాశం నిట్టూర్పులు వదులుతోంది. చీకటి అలుముకున్న నేలంతా... చిక్కగా నన్ను చుట్టుకుంది. చుక్కలన్నీ చెల్లచదురై నీ నవ్వు కోసం నిక్కి ఏడుస్తున్నాయి.
ఎక్కడయ్యా ? ఓ చక్కనయ్యా... కొంచెం దరికి రావయ్యా. ముక్కలైన భూమిని కొంచం నయం చేయవా? నీ అదరాల దవాఖానాలో కొన్ని మధురాల మందులిచ్చి ఆదుకోవాయ్యా... పాపం, కాస్త పుణ్యం చేసుకొనివ్వు ప్రకృతిని, నీ నవ్వులో కొన్ని ముత్యాలను ఏరుకుని తన సాగర గర్భంలో దాచుకోనివ్వు. నీ నవ్వు, రత్నాల గని కాదా? కొన్ని భూగర్భంలో దాచుకోనివ్వు. పొగరుబోతువేలే... కానీ కొంచెం కరుణ చూపవయ్యా...
Thank you 😊,
Bhagyamati ✍️.
👏
రిప్లయితొలగించండిThank you
తొలగించండి