రాధంటే... ఉత్తదేహం కాదు, ఉత్త మనసే కాదు, రాధంటే ఆత్మ. కృష్ణుని ప్రేమలో లీనమైన ఆత్మ. ప్రపంచానికి అర్థం కాని ఎన్నో విషయాలలో వీరి ఇరువురి ప్రేమ కూడా ఒకటి. వీరి శృంగారం మానసికమే! కానీ ఆత్మసంబంధం. ఏ ప్రేమ కథకైనా వీరే ఆదర్శం. ప్రేమ యొక్క గొప్పతనం పట్టాలంటే... కథలో చిత్రించే పాత్రలను రాధాకృష్ణలను ఊహించే రాయాలి. కృష్ణుని పై ఆశలు రేకెత్తించుకొని మనసును కృంగ దీసుకున్న రాధ ప్రేమ లోంచి విరహం అనే పదం పుట్టుకొచ్చిందేమో?!
ప్రేమంటే మనసంతా కాముఖత్వం పులుముకోవడం కాదు, దేహవసరాలను తీర్చుకోవడం కాదు, ప్రేమంటే విశాలత్వం, దైవత్వం, విరహం, తపన, వేదన, ఎడబాటు, త్యాగం, కృష్ణుని రూపు కోసం పరితపించే రాధ దినచర్య. అందుకే రాధాకృష్ణుల ప్రేమ ఉత్త ప్రబంధ కథగా కాకుండా... యుగాలు చెప్పుకునే గొప్ప ప్రేమగాధ గా మిగిలింది.
ఒక ప్రేమ కథను పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టాలన్నా... ఒక ప్రేమ గీతాన్ని, స్వర్గాన్ని తాకేంత ఆనందంగా ఆలాపించాలన్నా... రాధాకృష్ణుల ప్రేమే ప్రేరణ. ఇంత గొప్పగా మనం ప్రేమించాలంటే రోజు మనసుకి మెదడుకి మధ్య దేవాసుర యుద్ధమే జరుగుతుంది, అయినా నిలబడితేనే ప్రేమ గెలుస్తుంది. ఇక్కడ గెలవడం అంటే ఇద్దరు పెళ్లి చేసుకొని జీవించటం కాదు, జీవించి ఉన్నంతకాలం ప్రేమించుకోవడం.
ఈ ప్రేమ పుట్టిన రోజున, రోజూ నడిచే బాటలో... ఎండు గడ్డి, కమ్మని వాసనను కొత్తగా వెదజల్లుతుంది. చేల పచ్చని రంగు, పిట్టల స్వేచ్చా అరుపులు, రోజు చూసే పువ్వుల్లో... మరిన్ని కొత్త రంగులు, అవే చెట్లకు మళ్లీ వసంతం వచ్చినట్టు నవనవలాడుతుంటాయి. మన చుట్టూ కొత్తగా అల్లుకున్న ఈ అందమైన అల్లికలన్నీ కడదాకా ఉండడమే నిజమైన ప్రేమ. ఈ నిజమైన ప్రేమలో అందమైన ప్రపంచం చేతికందినంత దూరంలో ఉంటుంది. ఇది ప్రేమ పుట్టినరోజు నుంచి మనం చచ్చిన రోజు దాకా... చేతిలోకి దొరకదు. చేతికందే దూరంలో ఉంటుంది కనుకే... దీనికి ఇంత కమ్మదనం.
కనుచూపుని జార్చే ఇరువురి అందం, కలిసి నడిచే వేళ తడబడే అడుగులు, నిమిషానికి పది మార్లు నిష్కారణంగా నవ్వుకుంటూ.... ఇదంతా ఊరికే వీరిలో ప్రవహిస్తున్న సృష్టి ఆనందం. వీళ్ళ నవ్వుకి, కళ్ళలోని వెలుగుకి, విచిత్రమైన చంచలత్వానికి ఈ స్వచ్ఛమైన ప్రేమే కారణం. చెరువున కలువలు చప్పుడు లేకుండా విచ్చినట్టు, చిరునవ్వుతో సగం మూసిన కళ్ళు మౌనంగా జరిపే... ఈ సంభాషణ, ప్రేమ రాయబారం.
అంతలోనే గలగల తూముల్లోంచి పడే నీళ్ళలా... నవ్వులు. ఆనంద ప్రవాహంలో కొట్టుకెళ్లిపోయే ఈ కాలం లో ఏ విచారమైన త్రునాగ్నివలె ఆరిపోతుంది. ప్రేమలో ఉన్నంతకాలం ఈ ప్రేమికులు నూతన యవ్వనంలోని పుష్పాలు, ప్రేమ గానాలు వల్లించే పక్షులు, నిర్మలంగా సెలియేటిలో ప్రవహించే నీళ్లు. ఉండిపోనిద్దాం వీరిని యుగాల తరబడి... అనంత విశ్వంలో ఎగిరే స్వేచ్ఛా విహంగాల లాగా...
Thank you ☺️,
✍️ Bhagyamati.
Excellent
రిప్లయితొలగించండిThank you
తొలగించండి