ఆ పేరు ఎవరు పెట్టారో.. కానీ, కళ్ళు మూసుకుంటే పగటిపూట సూర్యకిరణాలకు మెరిసే... పచ్చ పవిట కప్పుకున్న పైరులా... కనిపిస్తాడు. చల్లగాలి, ఏటి నీటిని తాకి తగిలినట్టు హాయిగా ఉంటాడు. నవ్వితే దాన్నిమ్మకాయ పగిలినట్టు నోటి నిండా ముత్యాల రవ్వలతో కనువిందు చేస్తాడు. మాట మాటను మంచు కప్పి చల్లగా చెబుతాడు. చెవిపై చెక్కిలిగింతలు పెడుతాడు. రూపమేమో తెలియదు నాకు?! అంతగా చూడలేదు.
ఒక్కసారైనా కలవాలని కాలం తొందర పెడుతోంది. కళ్ళతో మాట్లాడుకోవాలని ఆశపడుతోంది. పరిచయమైనది కొంతకాలమైనా... ప్రేమలో అడిగిడి చాలా కాలమైనట్టుంది. ఈ మనసు గందరగోళంలో పడింది, ఆ సుందరవదనుని తలపులు తప్ప ఏ తిండి, నిద్ర వద్దంది. నక్షత్రాలను లెక్కబెడుతూ రాత్రంతా... ఎన్నో క్షణాలను భారంగా గడుపుతున్నాను.
ఎప్పుడూ... మాటలు విని సంతోషపడడమే తప్ప, ఒక్కసారి కలుద్దామా? అని అడిగే ధైర్యము చనువు లేవు. కలిస్తే బాగుండు! ఆ కొన్ని గంటల్ని ఇంకొన్ని జ్ఞాపకాలుగా మలుచుకొని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాను. నేను అనే నా రెండక్షరాలను నీతో కలుపుకోనుగాని, నీలోని కొన్ని క్షణాలను నాలో కలుపుకుంటాను. వెన్నెల వెలుగుల్లో నిన్ను చూసి నాలోని చీకటిని తరిమేసుకుంటాను. నా గుండె నిండా ఉన్న చిక్కుముళ్ళని కొన్నింటిని, నీ పేరు చెప్పి విప్పుకుంటాను.
అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ... నేను ప్రేమ పిపాసినే!. తన కళ్ళలోకి ఏ మూడు సెకండ్లైనా చూడక పోతానా? అని ఎదురుచూస్తూ ఉన్నాను. ఏ రెండు రోజులకో ఒకసారి, తనతో మాట్లాడవచ్చునేమో గాని, నిరంతరం తన గొంతును, నా గుండెలో వింటూనే ఉంటాను. ఆ నవ్వును విన్నాను కానీ... తదేకంగా చూడలేదు. కళ్ళు మూసుకుని అనుభూతి చెందుతుంటాను. ఎప్పుడూ అరవిరిసి నవ్వుతూనే కనిపిస్తుంటాడు. ఏకాంతంలో అతని మాట విన్నప్పుడు అలా... నా కళ్ళు వెలిగిపోతుంటాయి. ఆనందం అలలుగా నా శరీరం అంతా ఆవరించి కళ్ళు తారకలుగా ప్రకాశిస్తాయి.
జీవితం ఎప్పుడూ సముద్రం లాంటిది, వచ్చిపోయే కెరటాలు అనుభవాలు. ఏ కెరటమూ... కన్నీటితో ఘనీభవించి ఆగిపోకూడదు. ఆగిపోయిన సముద్రాన్ని ఎక్కడైనా చూడగలమా? త్యాగం అనేది బలహీనుల మాట. దీనిని ఏ పాత సీసాలోనో కట్టి సముద్రంలోకి విసిరిస్తాను. విఫలమైన పెళ్లిలో ప్రేమ, హింస కన్నా దారుణమైనది. అందుకే కలిసి ఉన్న రెండు గుండెల మధ్య ప్రేమ వైశాల్యమెంతో... తెలియదు నాకు.
నా ఏకాంతాన్ని నేను ప్రశ్నించుకుంటున్నాను. ప్రేమ కొంతకాలమే బాగుంటుందని తెలుసు నాకు. అయినా ప్రేమించే భాగస్వామి, ప్రశాంతమైన జీవితం కావాలి. మరో కొత్త ప్రపంచం నుంచి నన్ను ఉద్ధరించడానికి ఎవరు రానక్కర్లేదు. తాను కొంత సమయమిస్తే... జీవితంలో దేనినైనా అందంగా మలుచుకోగలను. ఈ ఒక్కడినే కలపమని దేవుడిని ప్రార్థిస్తున్నాను.
Thank you 😍,
✍️ Bhagyamati.
ఎవరతడు? అదృష్టవంతుడు
రిప్లయితొలగించండిThank you 🙏
తొలగించండిబాగుంది
రిప్లయితొలగించండిThank you ☺️
తొలగించండి