కలడు ఇందును, కలడు అందును, కలడు ఆ కళకళలాడు ముఖము వాడు. కలడు ఆ... రేకులు విచ్చిన గులాబీ కనులవాడు. కలడు ఆ నేర్పరి చూపులవాడు. కలడు ఆ సంపెంగల వేళ్ళవాడు, సరిగమల మాటలవాడు. కలడు ఆ నీరజ నయనములవాడు, నిర్మల హృదయము గలవాడు. నాలోనే కలడతడు, నా అత్మ లోని చెలికాడు. నా తండ్రి యతడు, నా బిడ్డడతడు.
నా సర్వాంతర్యాముడతడు, నా సర్వేశ్వరుడతడు.
మెరుపుల ననుకరించు కన్నులవాడు, ఉరుముల ననుకరించు స్వరములవాడు, పాల మీద మీగడలా...మెరిసే బుగ్గలవాడు, నవ్విన బుగ్గల్లో చంద్రవంకల వాడు, చంద్రవంకల ఒడిలో ముత్యపు రాశులు గలవాడు. ముద్ద పెదవుల మధ్య చిరునవ్వును సర్దిపెట్టెడి వాడు. కలడా... మోహనాంగుడు కలడు నా యందు, నా అత్మ యందు.
కర్పూర, కదంబ పుష్పముల గుమగుమల దేహము వాడు, కరమున కటిన ఆయుధములను దరియించెటి వాడు. అరవిందాక్షములను అరమూసి, తపస్బంగిమలో తరియించు యోగి పుంగవుడు, కలడు నే చేసేటి పుణ్యమందును, నా పాపముల కోతయందును. కలడతండు ఈ కలికాలపు ప్రతి కర్మ యందును. నన్ను భాదించు ప్రతి దుక్కమందును. నిజమై నుండు తాను నేనందుకునేటి ప్రతి ఫలమునందును.
ముద్దు చందురుడు తోడై తన మోముపై వెన్నెల చిమ్ముతుంటే... కాలి మువ్వలను, గుండెకు కట్టుకుని పరవశించి నేనాడుతుంటే... పెదవులు పాడేటి పదముల జతగా... నా పాదముల సడి ఆగక నే నర్తించినా... ఆ పరవశము పేరే ప్రేమారాధన.
నిన్నందుకోగ జనులు ఎందెందునో వెతికేరు. ఎందులకని, నాయందే నిన్ను వెదకి పట్టినాను. నీ అరచేతులలో నా ముఖముని ఆంచి, అశ్రువులతో అభిషేకించ తలచినాను. కలలోన, ఇలలోన... నిన్నేగ తలచాను, నిన్నేగ కొలిచాను, నన్నేల మరిచావు? నన్నందుకోవయ్య నా స్వామి, కన్నీరు తుడవంగ!
Thank you 🙇🏻♀️,
Bhagyamati ✍️.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి