నా హృదయం భక్తి తో వికసించి, భగవంతుని కోసం వెతకడం ప్రారంబించింది. నా కవితల్లో పుట్టిన స్వామి, నా కలలో ఎదిగిన స్వామి ఎక్కడున్నాడో? నా ఆశలకు అర్థాన్ని వెతుకుతూ... నా జీవితానికి వెలుగును వెతుకుతూ సాగే నా ఈ ప్రయాణంలో... నా అంతరాంతర గర్బాలయంలో కృష్ణడై దొరికాడు. ఆ స్వామి వెతుకులాటలో రాసుకున్న మాటలివి.
దగ దగ దీప్తుల కనుల వాడు,
ధవళ కాంతుల దేహము వాడు,
సింహ గర్జనముల స్వరముల వాడు,
రవి బింబమై వెలిగెటి ముఖము వాడు,
పరమయోగి గుణముల వాడు
నా పద్మనాభుడు ఎక్కడ ఉన్నాడో?
మాధవీలతల మధ్య మన్మదునివోలే...
మయూర పించము తలను పెట్టి,
ఏ మట్టి బొమ్మకు ప్రాణం పోస్తున్నాడో?
ఎన్ని ప్రాణులను తోలుబొమ్మలుగా ఆడిస్తున్నాడో?
దేవతల చెలిమి వీడి, లోకమందు మానవుడైనాడు.
భక్తి దారములతో భందించువాడు,
భక్త లోకమును పాలించువాడు.
భక్తుల హృదయ మందు భాగ్యోన్నతుండు.
నా బంగారు తండ్రి, ఎక్కడున్నాడో ?
నీవే నేను, నేను అనెడి దానిని లేనే లేను. మూతలు పడ్డ నా గుండె కవాటాలు నీకోసమే రక్తం చిందుస్తున్నాయి. నీ రూపము తప్ప వేరొక ఆలాపన లేక బ్రతుకుతున్నాయి, అంటూ... ఇక్కడే నా ఆత్మలో నిదురించే నిన్ను, భక్తి జ్వాలలు వెలిగించి వెదకలేని అసమర్ధురాలినైనాను. ఎన్ని ఆధ్యాత్మిక ఆరోపణలు చేసి వెదకులాడాను. నీ లీలలనే కీర్తిస్తూ... నీ పేరునే నిత్య పారాయణ చేస్తూ...నా కళ్ళు కొన్ని మైళ్ళ దూరాలు వెతికాయి. నాలో ఉన్న నిన్ను దగ్గర తీసుకొనుటకు బాగవతమంతా చదవాల్సి వచ్చింది. భక్తి బాణీల సంగీతంలో వెతకాల్సి వచ్చింది.
నే కలలు కనే నిన్ను ఇప్పటి వరకు ఏ కవి చూడలేదు. ఏ భక్తుడు యెరిగి ఉండలేదు. నీవే స్వయం ప్రకాశుడివై నా హృదయమందు వెలిగావు, నన్ను చీకటి నుండి పండు వెన్నెల లోకి లాగావు. ఈ భక్తి పారవస్యమనే కొత్త జన్మను ఇచ్చావు. నీవే నా ప్రియశఖుడివని తెలిసిన మాత్రము చేతనే... ఇంతకాలమూ జీవించిన జీవితము నిరర్ధకము, తాత్కాలికముగా తెలిసినది. నీ యందు కాంక్ష లేని జన్మ జన్మయే కాదని తెలుసుకుంటిని. హృదయమందు భక్తి వరద వెల్లువై నను ముంచక ముందే నిన్ను చేరుకుందును. నా భక్తి రసాన్ని కడలిని చేసి తీసుకొస్తున్నాను, నీ కొరకు!.
హరే కృష్ణ 🙇🏻♀️,
Thank you 🙏,
Bhagyamati ✍️.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి