నా మనసు మంత్రి మాటలు విని పని చేసే రాజుని నేను. అప్పుడప్పుడు గుండె వదులయ్యి భావాలు బయటకి వస్తే, వాటికి దారం కట్టి మళ్ళీ లోనే దాచేస్తాను. ఆ భావాలు విసిరిన గువ్వలై ఎటో వెళ్లిపోతే... ఈ రంగుల లోకంలో కలిసిపోతే... రాత్రేదో, పగలేదో తెలియకుంటే... చిత్రహింస పడేది చివరికి మనసే! తట్టుకోగలనని తెలిస్తేనే తెరలు తెంచుకోవాలి, మనసు పంచుకోవాలి. మోమాటాల ముసుగులు తొలగాక మిగిలేది శూన్యమే గనుక మంచి చెడుల మధ్య నలగడానికి సిద్దమవ్వాలి.
గుండెలోని శబ్దాలను గొంతుకందకుండా నిశబ్దమైన వాక్యాలలో దాచుకోవడం నాకు తెలుసు. బయట ప్రపంచం బలహీనమైనది, నా బలమైన భావజాలాన్ని మోయాలేనిది. ఈ గందరగోళపు గాలివానలు మహా వృక్షాలనైనా పెకలించవచ్చు గానీ, నా మనసు మూలాలను కాదు. నేను నిశ్చలమైన గంగానదిని, నిర్మలంగా ప్రవహించే నా కన్నీరు కూడా పవిత్రమయినదే. కలియుగమందు ఏ కొలమానము పుట్టలేదు, నన్ను ఎంచడానికి..
నా గుండె పై ఉన్న అడుగుల ముద్రలు నే తన్నుకున్నవే! ఎవరు చెయ్యెత్తలేని చోటది. కోటి ఆశలు అక్కడేమి లేవు, కోరుకున్న వన్నీ బాల్యమే తీర్చింది. గాఢ నిద్రలోను నేను కౌగిలించుకుంది నా గుండె దైర్యాన్నే!. స్వచ్చమైన నా గుండె, నాకు రాసిన ప్రేమ లేఖల కట్టలు కాలిపోయాయి. బూడిదైనంత మాత్రాన నేను ఓడిపోయిన నిప్పు కనికను కాను. నివురు మాత్రమే అది, గాలికెగిరి పోద్ది.
కొన్నాల్లిలా ఉండి పోతాను, కాలం గడియారపు ముల్లై తిరిగినంత కాలం, నిశిని ఉష ఓడించినంత కాలం, నే గెలుస్తూనే ఉంటాను. వెనుదిరిగి చూడను, పగిలిన గాజు ముక్కలను పట్టుకుని కళ్ళను నులుముకోను. కారే రక్తపు బిందువులు నేల చిందితే... భూమి బీటలు బారును. ఆ పాపం నాకొద్దు. నేల తల్లి పాతివ్రత్యం నే శంకించను. కాలితో తన్నినా... వేళ్లను ముద్దాడే అమ్మ ఆమె.
అర్థ నిమీలిత నేత్రాలతో ఆకాశం వంక చూసిన, అరుణ కిరణాల నా ఎర్రని కన్నులు అరచేతి చాటు ఏడ్చినా, నేనర్దమయ్యేది నాకొక్కటే. గుండె కన్నీరు పెట్టినా గోటితో తుడుచుకోగల మొండి దైర్యం నాది. నూనె బొట్ట్లను దీపపు పురుగులు హత్తుకున్నట్లు, గుండె తూట్లు కన్నీటి బొట్లని ఆకట్టుకున్నాయి. అయినా దయలేని లోకంలో దేవుని తనయగా ఎన్నాల్లయినా ఇలానే గెలుస్తాను. నా మనసుకి మకుటం లేని మహారాజును నేను.
Thank you 😎,
Bhagyamati ✍️.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి