నీ కంటి చూపుల్లో నన్ను బందీగా చేసుకుని, నా గుండె ఖజానాలో నిన్ను ఖైదీగా చేసుకుని, ఎడతెగని ప్రేమ సంకెళ్లను మనికట్టుకు బిగించుకొని, ఈ స్వేచ్చాయుత ప్రేమ స్వర్గంలో విహాంగమై ఎగురుతున్నా...
పదునైన నా రెక్కలతో గాలి తరంగాలను చీల్చుకుని వెళుతున్నాను. ఎదురెవరూ... లేరు నాకు, నా నీలి కన్నులతో ఆకాశాన్ని తాకి కాంతి నింపుతాను.
ఓ చీకటి రాతిరి రోజున, నిర్జనమైన వీదిలో, చుక్కల గుంపులో నిను చూసాను. నా హృదయ మాధుర్యాన్ని వాంఛల అంచుకు ఎగుర వేసిన ఆ రోజునే నేను కొత్తగా జనియించాను.
నిర్మానుష్యమైన ఎడారిలో నీటి చుక్కకోసం వెతికే వేళ ఓయాసిస్సువై నువ్వు దొరికావు, నీడ కోసం చెట్టు చేరితే ఉద్యానవనమై చుట్టుముట్టావు.
నా ఊహాలోకపు ఊగిసలాటకు, నీ గుండెను ఊయలగ కట్టావు. పసిపాపగా నాకు ప్రాణం పోసి ప్రేమజోలలు పాడావు. అందని ఆకాశాన్ని నా చేతికి అందించి ఆనందపు డోలికల్లో అటూ ఇటూ ఊపావు. నా ఊహా జగతికి ఊతమిచ్చి ఊపిరి పోసావు.
ఆకాశంలో హరివిల్లు తెచ్చి నా కనుల ముందు నిలిపావు, నా కళ్ళు చెదిరిపోయేన్ని రంగులని నా మీద కుమ్మరించావు. నీలి ఆకాశపు నీడను తెచ్చి, నా గుండె వేడిమి తగ్గించావు. తోడుగా నన్ను నడిపించి నా ప్రేమను గెలిపించావు.
గుండె వ్యధను కన్నులు మోయలేక కరిగి పోతుంటే... ఆ నీటిబిందులను నీ అరచేత మోసావు. నే బారమోపలేని ప్రతి బరువైన నిమిషాన్ని నువ్వు తెలిక చేసావు.
నీ పేరు నా మెదడులోని నరనరాల్లో పెనవేసుకుని, నీ చేతి వేళ్ళ కొసలలో... నేననురాగవల్లినై అల్లుకునే రోజులివి.
ఆకాశం లో పొంగి పోర్లేటి పండు వెన్నెలను నాదాకా తీసుకొచ్చిన చంద్ర కిరణం నువ్వు. ఆ కిరణాన్ని నా చెంగుకేసి కట్టుకున్న చాలా అరుదైన అతివను నేను.
యెన్నో మేలి ముసుగుల చాటున నే దాచుకున్న మనసుని, తన కంటి కొనలతో వెలికితీసి, నన్ను సౌందర్య దేవతగా... అలంకరించిన నా ప్రియుని కోసం... ఈ కవితా కుసుమం.
ప్రేమించుకునే వారికి ప్రతి రోజూ ప్రేమికుల రోజే!
Thank you ❤️,
Bhagyamati ✍️.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి