ఇదంతా ఓ గానం, ఆనంద నృత్యం. నా ఊహాలలో ఉన్న భగవంతుడు నా కనుల ముందుకు వచ్చిన రీతిన, ఎన్నో ఆశలు నింపుకున్న హృదయం ఒక్కసారిగా పెల్లుబికి, కనుల నీరై దొర్లి, పొంగి పొర్లిన సంతోషం. దేవుని చిన్ని తండ్రిగా భావించి నేను తల్లినై ఆత్మతో ఆలింగనం చేసుకుని నా చిన్ని తండ్రి బుగ్గల్లో... నవ్వులు చూడాలని నుదిటిపై ముద్దులు పెట్టాను. తన అరచేతులను నా చెంపలకు ఆనించుకుని అరవిరిసి మురిసాను.
దేవుని తండ్రిగా, ప్రియునిగా, కుమారునిగా పూజించి సేవించిన భక్తియుగ కాలపు కడలి నుండి ఓ కెరటమొచ్చి నా పై పడ్డట్టుంది. చలించి విలపించేతలా నన్ను దేవునితో అనుసంధానించి ఉంచింది. ఈ భక్తి గానం నాలో ప్రతిధ్వనిస్తూ... కొత్తగా నన్ను అంకురింప జేస్తూ... తదేకంగా దేవుని కన్నులలో లీనం చేస్తూ... ఉన్నచోటే నన్ను ఊపిరాడని ప్రేమ ఉచ్చుతో బిగించింది. కదలక నే శిలనై, పరవశించి విస్మయంలో పరుగులీడేలోపు మాయమైన దేవుని ఉనికి, నా కవితా కల్పన. కవి కల్పనలో, కాగితపు బొమ్మలలో ఊహించిన వారమే తప్ప, నిజరూపుడు ఎన్నడు దొరికేనో?
దేవుణ్ణి అసలు యందుకు తలచుకోవాలి? అనే ఆలోచనను పుట్టించిన వానికి కృతగ్నురాలిని. వేప రుచి చూశాకే తీపి రుచి అవగతమవుతుంది. కన్నులు కాల్చేంత మెరుపు యొక్క ఉజ్వల రూపం సెకను కాలం మెరిసి, ఎలా ఆకాశపు అంధకారంలోకి మాయమవుతుందో... అలానే భక్తి జ్వాల గుండెలో వెలిగిన క్షణం, ఒక్కసారిగా నేను ఉన్న చోటనే మాయమయ్యాను. అందకారంలోంచి వెలుగులోకి నడవడం ప్రారంభించాను.
ఈశ్వడెంతటివాడు అనిన... ఆ నింగిని, నేలను ఏకం చేసేంతటివాడు. తన నీడలో పీడితులకు ప్రేమలాలి పాడెటివాడు. మరెందుకు రాడు? తలచి వెతికే మానవునికి, తరియింపజేయు ఈశ్వరునికి మధ్య ఈ యుగకాలపు విరహమెందుకు? ఒక యుగకాలం మనసును మౌనంతో నింపుకుని విలపిస్తుంటే... అప్పుడెప్పుడో యుగాంతంలో వచ్చే వానిని చూడటానికి నా ప్రాణం ఆగునా? విశ్రాంతి లేక లోకమంతా తిరిగేటి వానిని ఏ భక్తి స్రవంతితో పట్టుకోగలదానను? అనిర్వచనీయమైన ప్రేమని గుండెలో నింపుకుని ఓర్చుకోలేక ఎంత దూరమని వెతకగలను?!
ఈ అన్వేషణ, నివేదన, విరహం, వేదన అంతా ఆయన లీల. కనుల ముందే ఉంటూ, కానరాలేదనిపించే ఓ ఏమరుపాటు. ఈ లోకాన్ని పరిచయం చేస్తూ వచ్చిన నా హృదయం ఎక్కడున్నది? ఈ లీలా మందిరంలోనే పాలరాతి శిల్పంగా నుంది. దేవుని కోసం వెతుకుతూ... ఈ దాగుడు మూతలలోనే కాలమిలా గడిచిపోతోందే అని తల్లడిల్లుతోంది. ఈ పరమేశ్వరుణ్ణి కలుసుకోవడమే నా జీవితాశయం. మరి నా ఆత్మ నివేదనకు సమయమెప్పుడు? ఆ తండ్రే దీనికి సమాధానం చెప్పాలి.
Thank you 🙏,
Bhagyamati ✍️.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి