కొత్త వానలొచ్చాయి, పూల తీగలు చేతులు చాచాయి. గొప్పగా కదిలే చెట్ల నీడలు, అడవి పరిమళాలు, ఆకాశపు కాంతులు, ప్రకృతి రమణీయత పరవశింప చేసింది. మెత్తని పూవులు ఒద్దికగా కౌగిలించుకుని, చెట్ల కొమ్మలను అదిమి పట్టుకున్నాయి. మత్తుగా వెదజల్లే వాసనలు, విరుల కురులు విప్పుకున్నాయి. నా చక్కనయ్య వెళ్ళే దారంతా... చిక్కని పూల పాన్పు అయింది. పూవులను విదిలించి కొమ్మలు పునీతమయ్యాయి. వేదములకు పెద్దడితడు, రూపమున చంద్రుడు, సౌఖ్యములను జల్లెటివాడు, వేగమై అరణ్యము వెంట వచ్చేను. రాదారి పొడవునా ప్రకృతి, పరవశించి నెమలి వోలె ఆడింది.
ప్రకృతికి స్వామి పై గల ఈ ప్రేమ ఉదారమైనదా? ఉన్నతమైనదా? ఉత్కృష్టమైనదా? కాదు కాదు స్వార్థమైనది, సంపన్నమైనది. ఇంద్రనీలముల కన్నులు గల స్వామి పై చిరునవ్వులు విసిరేటి గోపికలదొక ప్రేమ, దేవేంద్రుని అందమొలికే స్వామి పై బృందావనమునకు నొక ప్రేమ. దేవతాంగలు అష్ట భార్యలు... స్వామి వారిని చుట్టుముట్టుట నొక ప్రేమ. పరిచర్యలు చేయు పదహారువేల పడుచులు... పదముల నొక్కు దాస్య ప్రేమ. స్వామి చెంత చేరి ప్రణయ దీపమెలిగించే రాధదొక ప్రేమ, చిత్తము నందు భక్తి, చేతులలో వాత్సల్యము... యశోద నందనుల నయన భాగ్యము నా స్వామి🙏
వేదములలో మిక్కిలి వీడు, వేద పారాయనుడు... ఈ నారాయణుడు. వేదమందు మోదము, క్రోదమందు క్రూరము. శోధన చేయువాని హృదయమందు సరళము. కీర్తింప కోరనివాడు, కీర్తిమంతుడైన వాడు, కీర్తి కిరీటమును భాగవతమంతా... మోసినవాడు, కీర్తి పరాయణుడు. కీకరముల రాకసులను అంతమొందిన వాడు, కిరీటికి గీత బోధించి కైవల్యమును ప్రాప్తింప జేసినవాడు, కమలాకరుడు, కరుణానిధి వీడు.
హారతి పట్టి గొల్లబామలు హరిని చూసి మురిసిపోగా... అదరమొనికే రాధ చూపులు పరుగులీడి చెంతకు రాగా... అరుదెంచనతడు. సుగంధ పుష్పములు మెడను జారగా... సువర్ణ కిరీటమును తలను మోయగా... సేవకుల తోడుగా శ్రీహరి... సేవలందింప భాగ్యమొసగ అరుదెంచెను మరల బృందావనము.
హరే కృష్ణ 🙇🏻♀️
Thank you 🙏
Bhagyamati ✍️
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి