ప్రపంచమంతా పరిబ్రమించి వచ్చే హృదయాన్ని, ఒకే చోట ప్రక్కటెముకల మధ్య పట్టి ఉంచగలవా? ఎక్కడో కోతి కొమ్మచ్చ్చులాడే మనసును, మెదడు నరాలలో కట్టి పెట్టగలవా? చూపుడు వేలితో చుట్టూ చూస్తూ... పిడికిడంత మనసుని కొల్పోయావా? చుక్కల్లో ఏదో చూస్తూ... నిలబడ్డ నేల మరిచిపోయావా? ఉత్తి పుణ్యానికైనా... గుర్తుకు రావా నీకు నువ్వు? అంతలా చచ్చిపోయావా? అవమానాలకు, అనుమానాలకు, మత్తు సీసాకి, పొగాకు చుట్టకి... నీ మనసుని అమ్ముకున్నావా?
ప్రేమను ప్రణయానందం తో పైన కప్పుకునే నువ్వు, నీలోని బాధను, అవేసాన్ని మాత్రం దేవుని పై అపనమ్మకంతో, అవిశ్వాసంతో నిందిస్తావు, ఇది భావ్యమా? ఎవరో మనలా లేరని నిందించడం కన్నా... మనలో ఇంకిపోయే కన్నీటి చుక్కల్ని మన గొంతులోనే మింగేయడం మంచిది కదా! సాగర కెరటాల్ని కౌగిలించుకునే నువ్వు ఎంత ఉప్పు తాగేవు? ఇప్పుడు నీ కన్నీరు నీకు చేదయిందా?
జ్ఞాపకాలు ఎన్నటికీ తియ్యనివే, కాలానుగుణంగా నిన్ను, నన్ను మార్చదగినవే! ఏ తోడు లేక పుట్టేటి మనం, ఏ తోడు కోసం ఇలా సగిలా పడి వేడుకుంటున్నాము? పరిణతి చెందిన మనసుకి ప్రణయ గీతాల అవసరమేమున్నది? ప్రాణాధారమైన ఆయువు నీ దేహమంతా... ప్రవహిస్తుంటే, నీవే ప్రాణమని వేరొకరికి అభ్యర్ధన లేఖలు రాయడమెందుకు? దేవుడిచ్చిన హృదయాన్ని వేరొకరికి ఇచ్చి, వారి మనసుకోసం అరువులు చాచుట ఎందుకు? నీ మనసు నీకు అవగతమయినంతగ వేరొకరికి తెలియునా?
చేతులు చాచి తొలి సూర్యకిరణాలను, నీ అరచేతిలోకి ఆహ్వానించు. నువ్వు రోజూ ఉదయం, కొత్త బిడ్డగా జనియిస్తావు. నిన్న నిన్ను దహించిన ప్రేమ మరలా నిన్ను కాల్చకుండా... నీ ఆత్మాభిమానాన్ని అడ్డు పెట్టుకో! లేని పోని ఊహల్లో మనసుని తరియింప జేసుకునే కన్నా, నిన్నాదరించే నీ ఆత్మాభిమానాన్ని పెంచుకో! అభిమానం లేని దేహం అస్థిపంజరం.
మాటిమాటికీ ముక్కలయ్యే మనసు కన్నా, ఒంటరితనం ఒక వరం. నీ మనసుకి ఎవరు జోలలు పాడాలి? నీవు పుట్టినప్పుడు పుట్టిందా అది, నువ్వు చనిపొమ్మంటే పోతుందా మరి?. రెక్కలిరిగిన పక్షిలా... ఆ కుంటి మనసుని ఎంత కాలం వేరొకరికి భుజాలపై నడిపిస్తావు? నువ్వు నడిచే కాళ్ళు నీవి కావా? మరెందుకు నీ మనసును నడిపించలేవు? దేవుడిచ్చిన మెదడును అరికాళ్ళలో పెట్టి, ఆకాశం వైపు వెర్రి చూపులు చూస్తావెందుకు? వెగటు పుట్టదా, నీకు ఇన్నేళ్ల నీ మనసుపై? ఏళ్ళు గడిచినా ఎదగని నీ ఆలోచనలపై.
ఎందుకింత ఏమరుపాటు నీపై నీకు, కలిసి రాదా కాలం నీకు నీ అత్మ బలం వైపు. మనిషి మనసు మోసపూరితం, మరి ఏ తోడు కావాలి నీకు? నీడ నిచ్చే చెట్టుకొమ్మ, ఏ నీడ కోసం ఎదురు చూస్తోంది? ఎండ వేడిమిని ఒంటరిగా మోస్తోంది. తెలివి తేటలను తప్పించుకుని తిరిగే మనసు మాట, నువ్వెందుకు వినాలి? లెక్కలేని రూపాల్లో మారే ఈ మనసుని వయసు ముడతల్లో అయినా పట్టుకోలేవా? అంత చచ్చుబడి పోయావా? సమాధానం చెప్పుకో... నీకు నువ్వు.
Thank you🙏,
Bhagyamati✍️.
Excellent 👏👏 అసలు ఏమైనా రాశారా.
రిప్లయితొలగించండిThank you
రిప్లయితొలగించండి