జ్ఞానికి కనబడే లోకాతీతమైన దృశ్యాలలో ప్రేమ ఒకటి. మానసాతీతమైన ఈశ్వరానుభూతిని పొందిన స్థితిని, ప్రేమ మనకు తొలినాళ్లలో పరిచయం చేస్తుంది. ఈ హృదయ మాధుర్యం కళ్ళను ముద్దాడి, గుండెలోని ప్రేమ తంత్రుల్ని మీటుతుంది. ప్రియుని నవ్వు చూసి, భూమిపైన కాలు గంతులేస్తుంది, ఆకాశం తెరుచుకుని మనసుని ఎగరేసుకు పోతుంది. ప్రపంచం వినోదశాలగా... వాస్తవం లేని ఓ సినిమాగా కళ్లముందు సాక్షాత్కరింప జేస్తుంది.
కొత్తగా పుట్టిన బిడ్డను చూసి తల్లి ఎలా అర్ధంలేని జోలపాటలను పాడుతుందో... కొత్తగా పుట్టిన ప్రేమ కూడా ఏదో పిచ్చిపాటలు పాడుతుంది. మాటలతో ఇంతకన్నా వర్నించగలనా? నీ అందాన్ని అంటూ... కవితా బోధనలు మొదలవుతాయి, ప్రేయసి ప్రియుల మధ్య. కళ్ళు మాత్రం తెరువలేము ప్రేమలో... హృదయమొక్కటే ఇంద్రియ మిక్కడ. వాస్తవికతపై యుద్ధం చేసి, ప్రేమ ఆధిక్యం సాధిస్తుంది. ఈ అంతఃశాంతి ప్రేమలో ఉన్న వాడికే అర్థమవుతుంది. బయట ఉన్న జ్ఞానికి అర్దం కాదు. బయట వానికి అన్నీ సందేహాలే!. ఈ ప్రేమ జ్ఞానికి అన్నీ వాస్తవాలే. కనీసం తన ప్రియుడితో ఉన్న క్షణాలలో కలిగే దుఃఖం,సంతోషం... ఆ క్షణకాలమైనా వాస్తవాలే.
భక్తులు, యోగులు... ప్రేమికులు ఒకే కులం వారే. లోకాతీతమైన మైకంలో ఆడి పాడిటి వారే. అల్పమైన ఆశలు తప్ప మామూలు మనుషుల వలే అత్యాశలు, క్షుద్ర కోరికలు లేనివారే. ఏ వేదాంతులకి, మేధావులకి అందదు వీరి ప్రపంచం. వీరి అప్రమేయానందాలు, ఐశ్వర్యాలు... కేవలం ఒకరి ముఖంలో ఒకరికి కనిపించే చిరునవ్వులు. యుద్ద భూమిని గెలిచి, జయాపజయాలకు అతీతంగా సాగే నడక వీరిద్దరిది. వీరి సంభాషణల్లో... నిచ్చేస్టులై వినడమే తప్ప, నిరాకరణలు, నిరాదరణలు ఉండవు.
నాజూకైన వారి చేతి వేళ్ళు ప్రేమతో పెనవేసుకుని, నాడులు నవజీవనం నింపుకుని, అంతమనేది లేకుండా అలా సాగిపోతుంటాయి. ఆ అమృత హస్త స్పర్శల్లో... వారి చిన్ని గుండె అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతుంది. ఈ ప్రేమ వర్షం యుగయుగాలుగా వర్షిస్తునే ఉంది. ప్రేమ నిత్య యవ్వనంగానే ఉంది, మరిన్ని ప్రేమ చినుకులను తన దోసిలిలో నింపుకుని, నిలుచుని ఉంది.
ముఖం కేసి చూసి, కళ్ళు చెమర్చేటి తల్లి ప్రేమ కంటే ఏం తీసిపోదు ఈ ప్రేయసి, ప్రియుల ప్రేమ. అధ్యాంతం, అంబరం అంటే అనందముంది ఇందులో. సంతోషంతో సాగరాన్ని దాటే పక్షిలా హృదయమనే రెక్కలను విశాలంగా చాచి ఎగురుతోంది ప్రేమ. సఖుని, ప్రభువుగా భావించి పాదాక్రాంతమవుతుంది ఈ ప్రేమ. ప్రేయసిని, దాసిగా... పరిచర్యలు చేయమంటుంది ఈ ప్రేమ. అందుకే ప్రేమలు పుట్టిన క్షణాలు... దేవుని అందిన క్షణాలు.
Thank you 🙏🏻,
Bhagyamati ✍🏻.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి