నిలువెత్తు చెట్ల మధ్య, దట్టమైన ఆకుపచ్చ గడ్డి. చల్లగా తడిసిన గాలి తరంగాలు. గాలి అలలను పక్కకు నెట్టే పిట్టల కబుర్లు. జోరుగా కురిసే సాయంత్రపు సూర్య కిరణాలు, రాదారి పొడుగునా... రంగురంగుల పూవులు, జింకపిల్లలమై ఆడుకున్న రోజులు. అరచేతి కౌగిలింతలు, కన్నుల్లో కొత్త భాషలు. ఆ యవ్వనమొక కోలాహలం, పల్లవించే ప్రతీ మాట అతిశయం. కొత్తగా మళ్ళీ తెచ్చి పెట్టుకుంటే ప్రేమదే ఆ భాగ్యం.
నిను చూసిన కన్నుల పరవశమా... నే చూసిన జగతికి ఇది తొలి దినమా... కొత్తగా భూమిపై పుట్టానా? లేతకనులను తెరచి తొలిగా నిన్నే చూశానా? ఆనంద తరంగాల్ని వెదజల్లే ప్రేమోద్బావ తరుణమా ఇది?. శృంగార సందేశాలను మబ్బులకు ఎగురవేసే గాలి తరంగమా ఇది? అప్పుడే వెలుగు చిమ్మి ఆరిపోయే చిచ్చుబుడ్డీలా... వయసుకెందుకు ఇంత తపన? వలపు మాటలు విని విని, మనసు రేపిన గందరగోళమా...మట్టిమనుషులని దేవతలుగా చేసేటి ఈ ప్రేమ.. ఇంద్రజాలం ద్వంశమయ్యేదాక వాస్తవమేగా!
జీవితం మొత్తం వెతికినా దొరకని బంగారు కనిక ఈ ప్రేమ, సొరంగపు చీకటిలో దొరికే అపరంజి తునక ఈ ప్రేమ. ఇది ఒక సహజ ఆనంద స్థితి. యోగులకు తపస్సాదనలో కలిగేది. ఇది అనురాగపు ఆకర్షణల సమ్మ్మిళితం. ఇది శిఖరాల ఎత్తును తాకి, అగాదపు లోతుకు దూకే జలపాతం. ఇది అంద విశ్వాసంలో మనసును ఉయాలలూపే ఉద్యానవనపు ఊహాలోకం. ఇది శత్రురాజులు జొరబడలేని ప్రాకారం. చక్రవర్తి మాత్రమే అడుగిడే హృదయసౌదం. అలంకారమయం ప్రేమ హృదయపు అంతరంగం.
ఇంద్రుడింట అప్సరలా ప్రేమ ముంగిట నాట్యమాడగా, సుర పానములు అదరమోపి హరియించగ, మధుర భావములు మనసు దాటి జ్వలియించగా... జ్వలించి ఉద్దీపించిన ప్రేమ పరవశమిది, ప్రణయగాధకు. మరల కలిసి వెళ్ళేదాకా ఈ మధుర జ్ఞాపకాలు... మనసుని కొంచెం కొంచెం తింటూ పెరిగే పరాన్నజీవులు. కనులు తాకి వెళ్ళిన ప్రతిసారీ ఈ కొత్తదనం, సీతాకోకగ ఎగరవేయును ఆకాశం.
ఆరోజు నా రాజు కన్నుల్లో చూసాను, పారేటి ప్రేమ సంద్రాలు. ఎగిరేటి అలలపై నావలా తడబడి నడిచాను. పైకెగిరి పడ్డాను, కింద లోతుకి మునిగాను, తన గుండెలోకి దూకాను. హోరు గాలిలో మాటలను తెరచాపకేసి కట్టాను. మనసంతా తనకిచ్చి ఆకాశ దీపమై వెలిగాను.
Thank you 🙏
Bhagyamati ✍️
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి