దివ్వెలా... వెండి పువ్వులా... ఆకాశంలో విరబూసిన చందమామ. చట్టా పట్టాలేసుకుని చుట్టూ మూగిన చుక్కలు. నిశ్చలంగా... నిర్మలంగా... కనుబొమ్మ పైకెత్తి చూసే చందమామ, తన చూపు తట్టుకోలేక, కొంగు పట్టుకుని పది గజాల దూరం పరిగెత్తిన కొన్ని నక్షత్ర భామలు. తలుకుతో... తమ కులుకుతో... చంద్రున్నే చూసే మరి కొన్ని భామలు. తమ వంక ఓరగా చూసే కనులకు బదులుగా... చూపులకు చుపులిచ్చి, చిరునవ్వులతో హృదయాన్ని మండించుకున్న కొన్ని భామలు. సుగుణాల చంద్రుణ్ణి భక్తితో చూస్తూ... ఆ చూపే అదృష్టంగా భావించే కొన్ని చుక్కలు. చీకట్లో చప్పున దీపాలు వెలిగినట్టు మెరిసి ఆరే కొన్ని బిడియపు తారలు. తదేక దీక్షతో చంద్రున్నే చూసే ఇంకొన్ని వగలమారి తారలు. తారలెన్ని రంగులైనా, అవి చుట్టుముట్టిన చంద్రుని వల్లే వాటి రూపురేఖలు.
పుడమి నిండా పూవుల వాసన, సెలయేటి నీళ్లలో సన్నాయి మేలము, రోజూ చూసే ఆకాశంలో నూతనత్వము, ఎవ్వనము, కొత్త సౌదర్యపు సోయగము. అన్నీ అద్భుతాలే నేడు ఆకాశంలో... కళ్ళు నులుముకుంటూ చూస్తున్నాను. ఈ చుక్కలకేమి కొత్త రోగము, నిన్నటిలా లేవు మరి. కొత్త పెళ్ళికూతురిలా... నడుమూపుతూ, నవ్వు దాచుకుంటూ ఓరకంట చంద్రునిపై కోరికల బాణాలేస్తునాయి. తమ సౌందర్య ప్రతిభా లాభాన్ని పొందాలని వీటికి ఎంత కొర్కో?
అత్త మామలపై అలిగిన కొత్త కోడలిలా... వీరి మూతి విరుపులు, సవితి చుక్కలతో తోపులాటలు. చంద్రుని కావలించుకుని, పులకరించి పోవాలని, కుదరక కుదేలై, తమ సుందర స్వప్నం చెదిరిందని గందర్వలోకం వెళ్లి పోయాయి కొన్ని చుక్కలు. అర్ధరాత్రి రెండు గంటలయ్యింది, అయినా ఆకాశంలో ఈ సౌమ్య ప్రణయగాధ నడుస్తూనే ఉంది. మన్మధుడు ఈ చంద్రుడు, మమ్మల్నే చూడును అనే రహస్యపు మాటలు ఇంకా వినబడుతూనే ఉన్నాయి.
చంద్రుని ముందు తలొంచుకుని, ముందుకు నడుస్తూ... విరహిణి గీతాలు పాడే చుక్కలదైతే అప్రమేయానందం. చంద్రుడు మాటల్లో నేర్పరితనము, చూపుల్లో నాజూకుతనము, నవ్వులో వాత్సల్యము కలిగినవాడు. కనుల నిండా బోలెడు మమతను కలిగినవాడు. ఆ చుక్కల సమూహంలో ఓ భక్తురాలిని చూసాడు. ఒళ్లు పులకరించి చూసే ఆమె కన్నుల సౌందర్యము, చంద్రుని ప్రేమకు నిలయమైంది.
స్వప్నాలతో... తూగుతున్న కళ్ళతో... ఇంకా ఆకాశం వైపే చూస్తున్నాను. ఇక్కడేదో పెద్ద వేడుక జరగబోతోంది. పెళ్లి ఉత్సవం జరుగబోతోంది. చల్లని గాలితో, వేణుగానంతో ఆకాశం హాయిగా ఉంది. పెనుగులాడే హృదయాల తారల మధ్య రోహిణి, వయ్యారంగా... చంద్రుని వెనకే అడుగులేస్తోంది. చంద్రుడు దక్కిన ఆనందంలో ఆమె అందం ఇంకా చంచలంగా, ఆమె నవ్వు నయగారంగా తోస్తోంది. ఆమె ముఖ కమలం చూస్తూ... చంద్రుడి కన్నులు ఇంకా పెద్దవయ్యాయి. ఈ అనంత, అదృశ్య, అనిర్వచనీయ అనుభూతి, నా హృదయంలో ఇంకా వాస్తవంగా తోస్తూ ఉంది.
Thank you 🌝,
Bhagyamati ✍🏻.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి