ఓ చిన్ని చిరునవ్వు ప్రేమ లోతుని పెంచుతుంది. ఆకర్షణ యొక్క ఔన్నత్యాన్ని రెట్టిస్తుంది. రోజంతా జోబుల్లో డబ్బుల గలగలలే కాదు, పెదవులపై నవ్వుల జలజలలు కావాలి. ఎర్రని పెదిమల మధ్య తెల్లని సుద్ద ముక్కలాంటి పల్లెందుకు ఇచ్చాడు దేవుడు? ఆ పెదవుల ఎరుపు పెంచడానికే కదా! పిసినారిదానివే... పిసరంత నవ్వవే...అని కవులెందుకు రాశారు? నేనొక నవ్వుల పారిజాతం. పారిజాతం చెట్టుకి ఎన్ని పూలు పూస్తాయో...రోజులో అన్నిసార్లు నవ్వుతాను.
నవ్వితే బుగ్గలు కంది, బుగ్గ సొట్టల్లో...ముత్యాలు పోసుకుని, మోము అందం ఇంకా పెరుగుతుంది. గులాబీ పెదవుల మధ్య రహస్యాలు పలికే నవ్వులు, ప్రేమ రాయబారం పంపుతాయి మనసులకు. నవ్వులో మెరిసే కళ్ళు కొలనులో దీపాలై వెలుగుతాయి. పట్టుచీర పై జరీ అల్లికలలా దట్టమైన నవ్వులు చూసే కనులను మోహిస్తాయి.
దిండులో తలదూర్చి నవ్వే నవ్వు తొలిప్రేమ ముందు తరుణం. జగత్ సమ్మోహనం ఆ వయసులో ప్రియుని నవ్వు. అందులో ఒక సున్నితమైన అనురాగం, ఒక స్వచ్ఛమైన ఆలోచన ఉంటాయి. అవి మేఘాలపై మనల్ని ఊయలూపుతాయి. అది విశ్వానికి, మనసుకి మధ్య జరిగే విశ్వాసపు సంఘర్షణ. అది ఊహాలోకమో... వాస్తవిక ఉత్సాహమో తెలియదు.
నవ్వు... బాలకృష్ణుని నవ్వు. నవ్వు... రాధ చెంత నవ్వు, నవ్వు... రాసకేళి లాడి నువ్వు, నవ్వు... బృందావనమున శోభ నివ్వు. మనసు మాటలకిచ్చి పరధ్యానంగా చూస్తూ... కృష్ణ తులాభారం లో గెలిచిన రుక్మిణిలా, చంద్రునికొక నూలుపోగులా... ఓ గులాబీని గర్వంగా బహూకరించమా మన ప్రియుని నవ్వుకి. అపాయంలో తీరం కొట్టుకొచ్చిన అల్చిప్పను ఆత్రంగా పగలగొట్టి ఈయమా ఓ ముత్యపు బహుమతిని.
మందహాసపు ఇంద్రజాలం ఎవరికి తెలియదు? మాగమాసపు మల్లెలకు తెలుసు, వసంతపు కోకిలకు తెలుసు, ముసలి తాత బోసి నోటికి తెలుసు. ఆ నవ్వులోని మాయ, వెర్రి ప్రేమ... వయసులో ఉన్నవాళ్ళకే తెలుసు. ఆకాశం నడిమద్య వేలాడే చంద్రవంకలా... పెదవుల పై చిరునవ్వు మోమంతా వెలుగులు నింపుతుంది. ఇక బిడియంతో రెప్పలు వాల్చే నవ్వులు చెప్పనవసరం లేదు మా అమ్మాయిలకు, పుట్టినప్పటి నుండి చచ్చేదాకా ఇదే పని. అయినా నవ్వటానికి సమయమెతకాలా? ఓ నవ్వు తెచ్చి పువ్వుల్లో పెట్టి వెన్నెల్లో సార్దకమవక!.
Thank you 😁,
Bhagyamati ✍️.
😀😃😄😁😆
రిప్లయితొలగించండిThank you
తొలగించండిచాలా చక్కగా రాస్తున్నారు , ఇంకా రాయండి ఇలానే చాలా బాగున్నాయి ...
తొలగించండిThank you
తొలగించండి🤣🤣👏👏👏
రిప్లయితొలగించండిమీ కవిత్వం బాగుంది మి చిరు నవ్వు బాగుంది.
రిప్లయితొలగించండి