దేవలోకపు రాజకుమారుడొచ్చి, స్వర్గలోకపు అప్సరను చూసినట్లు చూస్తుంటే, ఎక్కడో... గుండె లోతున కన్ను తెరిచాను. అంకురించిన యవ్వనం మోమంతా అలుముకుంది. ఎవ్వనమొచ్చినప్పటి నుండి ఎప్పుడైనా చూసానా? ఇంతటి ప్రేమని!. ఎదుట నిలబడ్డవాణ్ణి చూసి అదరప్రీతి కనులకు.
సిగ్గు, గౌరవం ఒకేమారు చిత్తడయ్యేంత ఉబలాటం. నే కరిగి నీరై పోయాను, గుండె జలపాతమై ఉప్పొంగింది, మాట సెలయేరులా... జలజలా పారాలనుకుంది. తెర చాటు దీపపు వెలుగులా రెప్ప చాటున దాక్కున్నాను. కాలి వేళ్ళను నేల కేసి గోముగా... చుట్టాను.
వేల కొలది కళలు అతనిలో చూసాను. చూడగానే స్వేచ్చాయుత శక్తి ప్రవాహాలలో కొట్టు మిట్టాడింది గుండె. నా హృదయ మంతా అతనికి ఇచ్చేసి దూరంగా నిలబడ్డాను. ఆకాశంలోని చుక్కలన్ని నేల రాలి మా మీద పడ్డాయి. చంద్రుడు చిన్నబోయాడు. ఆత్రుతగా నా కంఠం అతని పేరు పిలవబోయి అంతలోనే అదుముకుంది. అవును ప్రేమకున్న ఒకే ఒక భాష - తేలికైన నవ్వు.
ఇక విరబోసుకున్నాను నా కమ్మని మనసుని అతని ముందు, కలబోసుకున్నాను మాటలన్నీ గుట్టలు పోసుకుని. కల్లెమేసుకోలేదిక మనసుకి, మాటకి. కమ్మని కబురుల వర్షం తో... తడిపి ముద్ద చేశాను. కొవ్వొత్తి కాంతిలా... అతని చూపు, నా బిడియాన్ని కాల్చి దహనం చేస్తోంది. అప్రయత్నంగా చూస్తూ... తదేకంగా... మాట్లాడుతూ గడిచిపోయింది ఆ సాయంత్రం. ప్రేమ విద్యుత్ ప్రవహించే యంత్రమైపోయాను నేను.
వెనుతిరిగి వెళ్ళానే గానీ, వీపుపై గుచ్చుకుంటూనే ఉన్నాయి అతని కళ్ళు. బోర్లా పడి ఫోను కేసి చూస్తూనే ఉన్నాను, అయోమయంలో నవ్వుకున్నాను, అద్దంలో తేజస్సును చూసుకున్నాను. రాతిరెప్పుడు వెళ్లిందో? సూర్యుడెప్పుడు వచ్చాడో? హాజరు పట్టీలో అసలు నేనే లేను.
ఈ ప్రేమ జ్వరానికి అతని చూపు ఔషధం అయింది. వెల కట్టలేని ఐశ్వర్యమే అతని ప్రతి మాట. వెనుకే వెంబడించే మనసును మళ్ళీ మళ్ళీ కలిసేదాన్ని. కళ్ళ నిండా పొంగే ప్రేమ, కోమలమైన చంపలపై జారి ఎర్రగా కందేది. అతని ప్రతీ మాట ఊపిరి బిగబట్టి వినేదాన్ని. పిప్పరమెంటు బిళ్ళల్లా... అతని కళ్ళు చీకట్లో మిలా మిలా మెరిసేవి. ఆ చల్లని సాయంత్రాలు మా చనువుని అనువుగా తీసుకునేవి. అతని అనుగ్రహం దొరికిన ఆ రోజులు ఇంకా నాలోనే ఉన్నాయి.
Thank you 🙏
Bhagyamati ✍️
అధరప్రీతి కనులకు అన్నారు ఏ కాంటాక్ట్స్ లో దీన్ని మీరు వాడారు వివరించగలరు
రిప్లయితొలగించండి🥰
రిప్లయితొలగించండి