దేవేంద్రుడు చెంతనున్నను... కాంతలందరూ ఏకాంతులే! అయోమయంలో అంతర్మధనం చెందే అభలలే. జీవన్మరణాల మధ్య వాడిపోయే తావి లేని పూవులే! ఆడంభరాలు, అలకలే కాదు ఆమె. అగాధం, అంతర్మదనం కూడా. సమాజపు విలువలతో సమాధియై, ఎండిపోయిన కొమ్మలతో నిటారుగా నిలుచుని ఉన్న మొండి మాను.
లెక్కలతో పని లేకుండా చెప్పగలను, లెక్కలేనన్ని ఆలాపనలు. ఆలోచనల ఆకర్షణను ప్రతిఘటిస్తూ వెనక్కు లాగే మనసు. పక్కపక్కనే ఉన్న రెండు కళ్ళు, పారదర్శకపు తెరల మధ్య తమను తామే బిగుతుగా... లాగి కట్టుకున్నాయి. తావేది ఇక్కడ తనువుకి, మనసుకి. ఊహా చిత్రాల నమూనాల తప్ప, ఊసులాడే దైర్యమెక్కడిది?
సబ్బు నురగల్లా... రంగు రంగుల బుడగలు, అచ్చం ఇంద్రధనస్సు చేతికందినట్టు. తాకితే మాయమవును. గాలి బుడగలవి, పట్టుకోవాలని పరిగెడితే నేల జారిపోతాము. గరుకు బారిన గుండెకు నునుపు పాటలెందుకు? గాలి వానలొచ్చి, వేళ్ళు తెంపుకుని వెళితే... కొత్త చిగురులెందుకు?
ఆకాశం కూడా అర్థ ఆకలితోనే ఉంది. ఏ పక్షానికో వచ్చే పున్నమి చంద్రుడు, అవతలి రోజునుండి కరిగి మాయమవుతాడు. కళ్ళ ముందే కదిలిపోతున్నా... చేజాచి ఆపలేని అమావాస్యపు ఆకాశం. కన్నీరంతా మేఘాలలో దాచి, ఎప్పుడో ఏడాదికొకసారి కడుపు నిండా ఏడుస్తుంది పాపం. అవును కదా... నిండుకున్న గుండెలే తప్ప, పొంగిపొర్లే ప్రేమలు లేవెక్కడాను!
మేఘం వర్షించనీ... సంద్రం ఉప్పొంగనీ... ఘనీభవించిన గుండె కదలకుండా, మెదలకుండా... కాలగర్భంలో కలిసిపోనీ. కన్నీరింకిపోనీ... గమనం లేక గుండె, గడియకొకమారు కొట్టుకుని ఆగిపోనీ. అచ్చెరువై కన్నులు రెప్పవేయక మిగిలిపోనీ... నీడ అవసరం లేని చోట చీకటి కూడా నేస్తమవనీ! తోడు కోరుకోని వారికి ఏకాంతం కూడా వరమవనీ!
Thank you 🙏
Bhagyamati ✍️
👌👌💐💐
రిప్లయితొలగించండిThank you
తొలగించండి