ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నేనెప్పుడో... నువ్వయ్యాను

అంతరాత్మను అడిగి మరీ రాస్తున్నాను. నా గుండె నేను తవ్వుకుని చూస్తున్నాను... లోతైన సమాధానం కోసం ఎదురు చూస్తు రాస్తున్నాను! ఏ కారణం నా చేత, ఈ కవిత్వం రాయిస్తుందో... ఆ సమాధానం వెలికి తీసి రాస్తున్నాను! 


నా రాతల వెనుక రహస్య మేధో ఉందని, అది నా ఆత్మ లోనే నిదిరిస్తోందని, బాహ్య ప్రపంచపు బలహీనతలకు లొంగనిదని  నాకు నేను బలంగా చెప్పుకుంటున్నాను. నేను నిజాయితీగా రాసుకున్న ప్రతిమాటలో నా నువ్వు, అనే నేను ప్రతిబింబిస్తూ... ఉన్నాను.


జీవితంలోని ప్రతి అనుభూతిని, అనుకూల ప్రతికూలతల మధ్య వేరు చేసుకుని చూసుకున్నాను. రెంటి మధ్య నా జీవితం జీవం నింపుకున్న తెల్ల కాగితం. అచ్చు తప్పులు లేవు, వ్యర్థ అర్థాలు లేవు. ప్రేమకు అడ్డంగా... పరచిన నా గుండె తప్ప ఇక్కడేమి లేదు. ఒక వైపు నేను సన్యాసిని, మరోవైపు ప్రేమ ఉపన్యాసిని. రెంటి మధ్యా నేను సగం రాయిని, సగం ప్రేమని. నిత్యం నాలో నన్ను అన్వేషించుకుని అక్షరాలతో... అభినయించే అనుభూతిని.


ప్రతిరోజూ పరవశించి ఆడుకున్నాను, పసిపాప లాగా పిచ్చి గీతలు గీసుకున్నాను. నా పేరు నాకు పరిచయ మయినప్పటి నుండి నేను నాతోనే ఉన్నాను. నిర్మలమైన నా కన్నుల్లోనే... నా సుఖము, దుఃఖము చూసుకున్నాను. కన్నీళ్లతో కల్పనలన్ని కడిగి వేసి నన్ను నేను స్వచ్ఛంగా... చూసుకున్నాను. నిలువుటద్దం నా ఆత్మ విశ్వాసం ముందు ఓడిపోయేంతలా...నిటారుగా నిలుచున్నాను. అవతలి ఒడ్డున ఆశ్రయమేది ఆశించలేదు, నాలో నేనే కొత్త నావ నిర్మించుకున్నాను. 


నువ్విలా... ఎందుకు అని అడగడం వదిలేసి, నన్ను నేను ఏమార్చుకోడం మానివేసి, నన్ను నేనే... సలహా అడిగి మెరుగు పరచుకున్నాను. నా గుండె లోతుల్లో నిజంగా... దిగబడి ఉందా... రాయాలనే తృష్ణ?!  వెలికి తీసి వెతుక్కున్నాను. నాకోసం నేను కొత్తగా చిగురిస్తున్నాను. నేను మాత్రమే నాకిప్పుడు, నాలో ఉన్న నువ్వు మాత్రమే నాకిప్పుడు. ఆ నువ్వు కూడా నేనే. నేను కలం, ఆ నువ్వు నాలోని కవి.


 నా గుండెకు లేదు ఏ తడబాటు చప్పుడు, శ్రవణ మాధుర్యం నా గుండె ఎప్పుడూ... గంభీరమై కొట్టుకునేప్పుడు నేనొక విప్లవ కవిని, సరళమై సాగినప్పుడు నేనొక ప్రేమ కవిని. ప్రత్యుత్తరాలు లేని నాకు, నా మనసుకు నేనే అంతులేని ప్రేమని. అర్దం వెతికే కనులకు  అనుమతి దొరకని అక్షరాన్ని. మెత్తని పదాలను గుండెకేసి కొట్టుకుని చిందిన రక్తపు సిరాని. ఏ భావోద్వేగానికి అందని అగ్నిశిలని, ఏ ఉలి చెక్కలేని ఒక పాత రాతి కట్టడాన్ని.


Thank you🙏

Bhagyamati ✍️.




కామెంట్‌లు

  1. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. బాగుంది.....మీరు మీలోని కవి...

    రిప్లయితొలగించండి
  3. మీరు చాలా బాగా రాస్తారు సూపర్ అండి 👏👏 కోరా లో చూస్తూ ఉంటా.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి