ఓ రాత్రివేళ, కొలను పక్కన... మేమిద్దరం చేతులు పట్టుకు కూర్చున్నాము, పక్కనున్న కొబ్బరి చెట్టు చాటు చందమామను చూస్తున్నాము. ప్రేమ పరవసులమై మేము తనివితీరా నవ్వుకున్నాము. మా నవ్వు విని చుక్కలన్ని తప్పుకున్నాయి. కొబ్బరి చెట్టుకు కోపమొచ్చి గట్టిగా రెమ్మలను విదిలించింది. పక్షుల జంటలు పైకేగిరి పోయాయి. ప్రకృతికెందుకు ఇంత అసూయ? అతని పట్టపు రాణిని నేనయినందుకా?
చంద్రుని చివరి కిరణాలు మా చర్మం పై చిందాయి. నా ప్రేమ నిండిన గుండెను తన భుజంపై వాల్చి, తన వెచ్చని శ్వాసల్లో... పచ్చిక పై చినుకులా మెరిసాను. కొలనులోని నల్లని నీరు తాపమోపలేక నురగలు కక్కింది. చిన్ని చేపలు తల్లడిల్లి పైకెగిరి పడ్డాయి. నిర్మలమైన అతని కన్నులు, నిశి రాతిరిని కూడా వెన్నెల చేస్తాయి. అందుకేనేమో! ఈరాతిరికింత అలక, జంట చిలుకలను చూసి ఓర్వలేక.
అందమైన అతని మోము మొత్తమంత విరిసిన మందార పువ్వు, చెక్కిలంతా... చెమటలు, గంధపు చినుకులు. అతను నా ప్రేమ ఋతువు. ఏడాదికొకమారు కాదు, సంవత్సరమంతా చిగురించే ఓ పచ్చటి పూల మాను. అతను నా గుండె తోటలో పరిమళాలు జల్లే పన్నీటి పువ్వు. మొగలి పూవులు అతని మోము చూసి విచ్చేను, నా మగడి అందం ఎవరికొచ్చేను?
చూడకుండా అతనిని ప్రేమించాను, చూసినప్పటి నుండి నన్ను నేను చూసుకోవడం మరిచిపోయాను. తొలిసారి తనని చూసినప్పుడు మనసు లేడి పిల్లై పరుగు తీసింది, లేగ దూడై గంతులేసింది. మరలా వెనక్కి మళ్ళి చూస్తూ ముందుకెళ్లి పోయేదాన్ని. కాలమలా కరిగింది, కలలో ఏడాది కాలం గడిచింది. అగ్నిసాక్షిగా ఒక్కరయ్యాము. అయినా... అంతర్ముఖంలో, ప్రేమ శిశువునయి ఇప్పటికీ అతని గుండె గర్భంలో కొట్టుకులాడుతూనే ఉన్నాను. తీవ్రమైన నా ప్రేమకి తాను తల్లడిల్లి నాడేమో తెలియదు నాకు. ఇంత మాత్రమే వచ్చు మరి నాకు ప్రేమించడం.
చిన్ని పక్షినై లేత రెక్కలతో అతని చుట్టూ తిరుగుతుంటాను. అతని నవ్వులనే పూలకొమ్మపై వాలుతుంటాను. నా ప్రేమ ఇదని పదే పదే చెబుతుంటాను. అంతులేని ప్రేమ కూడా కొన్ని సార్లు అంగీకార యోగ్యం కాదు. అతనికి తెలుసనుకుంటాను ఈ పేద హృదయపు ఆకలి ఏడుపు. అమృత మిచ్చి నింపుతుంటాడు. ఆకలిని, ఆయువిని ఆకాశమంత జల్లుతో... తడుపుతుంటాడు.
మేఘమై నేను వర్షించినప్పుడు, మగ నెమలిలా... పించమిప్పుతాడు. ఆరంగులన్ని నా మోముపై చిమ్మి నడి రాతిరికి రంగవల్లులు అద్దుతాడు. అతనిచ్చే సమయం అంతులేనిది కాకపోవచ్చు, చమురు వత్తి చేసి దీప మెలిగించినంత కావొచ్చు. అది నాకు లోకమంతా వెలిగించే... సూర్యుడంతటిది.
Thank you🙏
Bhagyamati ✍️
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి