గత ఏడాది చివర కొత్త ప్రవుత్తి, పాత అలవాటే అయినా కొత్తగా మొదలెట్టాను. అనంతమైన జలనిధిలో ఆణిముత్యాల కోసం వెతుకినట్లు... నాలో నన్నే అన్వేషించుకున్నాను. జ్ఞానం గీనం అంటూ కొత్త రాతలు మొదలు పెట్టాను. గత ఏడాది ఏదో కొంచెం నేర్చుకున్నాను. తెరచాప లా చేయి చాచి గాలి వాటంగా నడిచాను. నా నావ ఎటూ పోలేదు, ఒడ్డుకే వచ్చింది. చదివే వారందరికీ కృతజ్ఞతలు. వీక్షకులు చదవరులు... చదవరులు స్నేహితులయ్యారు. కలిసిన బంధాలన్ని గత జన్మ పరిచయాలుగా తలపోస్తున్నాను.
ఎక్కడో చదివాను, సంకోచం లేని మనసే అన్ని కవితలకు ఒకే ఒక సూత్రమని. ఏదో రాయాలని అత్రం ఉంటే చాలదు. ఎక్కడ ఆగాలో... ఎక్కడ సాగాలో తెలియాలి. ఇది అనుభవం నేర్పుతుంది. ఎదుటి గుండెను పలుకరించే మాటల కోసం, ఒళ్ళు పులకరించే మాటల కోసం, మనసు పరవశించే మాటల కోసం నాలో నేను వెతుకులాడాను.
కవ్వించే పదాలు, కొన్ని నవ్వించే పదాలు... కాగితం పై చెళ్ళాటమాడాయి, నాకు ఉల్లాస మిచ్చాయి. మది మౌనాలు, మృదు భావాలు... గుండెలోనే శిధిలమవ్వకుండా మృదులంగా, మధురంగా... పెదవంచుకు తెచ్చాను. నా కలం పదును పెట్టాను. కాగితం చినిగి పోకుండా కొత్త సాగు చేశాను.
ప్రేమ రాయబారం పెదవులతోనే కాదు, వేలి చివరలతోను చెప్పగల ఈ భావ కవిత్వం ఎంతో మధురం. నా ప్రతి మాటను తేనెలద్ది రాయాలని కోరుకుంటాను. మామూలు మాటలే మనసును కవ్వించినపుడు కవితలవుతాయి కనుక తొలి సూర్య కిరణం లా వెచ్చగా గుచ్చుకునే మాటల కోసం వెతుకుతుంటాను.
ఎప్పుడో విన్నవి, ఎక్కడో అన్నవి, మళ్లీ మళ్లీ మనసులో స్మరిస్తూ జపిస్తుంటాను. వయ్యారి కలాన్ని వర్ణాలతో నింపి రాస్తుంటాను. చదివేటి మనసును అల్లుకుని, పరిమళాలతో కమ్ముకోవాలని చూస్తుంటాను.
ఒకసారి సీతాకోక చిలుకలా... ఊసులాడాలని, మరొకసారి సీతనై నా రాముని సేద తీర్చాలని... లేత పూవుల ఒడిని దోచి తీసుకొచ్చా... తేనె తెంపెరను. కాగితంపై జల్లి రాయడం మొదలెట్టాను. అంతా సులువుగానే ఉంది గానీ... అంతమెక్కడో తెలియదు నాకు. రాసుకుంటూ పోతుంటా... ఆగడం తెలియక కృతజ్ఞతలు చెప్పి ఊరుకుంటా...
ఆకతాయి మనసు కదా! అల్లరి కొంచెం ఎక్కువైంది. ప్రేమ కవితల్లో మనసుకు యవ్వనమొచ్చింది. చిలిపి మాటలు దొర్లాయి. చివరికి ఇంతేనేమో... ప్రేమ కవుల పాట్లు ప్రియుని పాదుకలు పట్టుకుని వదలని అగచాట్లు. అలుసై పోనా... అతనికి? ఏమో తెలుసుకుంటాడులే వెరసి నా పిల్లే కదా! అని.
Thank you 🙏
Bhagyamati ✍️.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి