లేత బెండకాయ లాంటి వేళ్ళను, తరిగి తాలింపు వేసుకోక, కలం పట్టి కాగితం పై ఈ కొట్లాటలెందుకు? కౌగిలించుకుని అరచేతుల్ని కమ్మగా చంపకేసి రుద్దుకోక, ఈ పీకులాట లెందుకు?. పిచ్చి రాతలు రాసుకుని పెద్ద కవినై పోదామనా?! ఈ కాగితాల కట్టలు తీసుకెళ్ళి ఏ మిచ్చరు కొట్టోడికో తాకట్టు పెడదామనా! కాగితమైనా కాకపోయనే, పాత ఫోనులో ఈ పీతాంబరాన్ని ఎవడు చదువుతాడు?!
ఇసుకపై అలిగి వెనక్కు వెళ్ళే అల లాగా, విసుగుపుట్టి ముందుకు తోసే సంద్రం లాగా... మధ్యలో ఈ అల కే పట్టింది, లేనిపోని బాధ. ఇష్టపడి ముందుకు సాగదు, కష్టపడి వెనక్కు పోదు, ఏమి ఈ కలం రొధ. పిసినారి సిరా బుడ్డి తప్పా? పిసరంత దైర్యం లేని గుండె తప్పా?
చిన్నప్పటినుండి అమ్మ చెబుతోందిగా చందమామ కథలు, మళ్ళీ నువ్వెందుకు మొదలెట్టావు? ఈ కల్లబొల్లి మాటలు. ఒకేమాటను ఒక్కోరకంగా సందుగొందుల్లో తిప్పి మళ్ళీ అక్కడికే తెస్తావు. వచ్చే పోయే దారుల్లో మళ్ళీ కొన్ని ఒత్తులు, పొల్లులు ఏరుకొస్తావు. నీకెందుకు చెప్పు? ఈ దేవులాట. చిమ్మ చీకట్లో నల్లపిల్లికై వెతుకులాట.
మాటలన్ని వండి విస్తర్లో వడ్డించుకొని, ముని వేళ్ళతో ముద్ద చేసుకుని నోట్లో పెట్టుకోక, ఎందుకే 'bhagi' నీకీ భాద. అక్షరం అక్షరాన్ని ఏరుకొని, యేటిలో జలకమాడించి, ఏరి కోరి అతికించి ఎక్కడికి తీసుకెళతావే? పెన్నేమైనా పెన్నా రివరా? ఎన్ని మైళ్ళు పోద్ధి. ఆగవే తల్లి అక్కడే ఆగు. చెప్పాలనుకున్నది చెప్పి చప్పున వెళ్ళిపో!
నల్ల ద్రాక్షాలు ఆ నీలికళ్ళు, మొత్తమంతా రసం తీసి తాగేయకుండా... గంటల కొద్దీ ఫోన్ చూస్తూ ఎందుకే నీకు ఈ పిచ్చి ప్రేలాపనలు?. కవితలటుంచి కళ్ళు పోతాయ్ ఫోనుకేసి చూసి. కలం లో విద్యుత్తుంటే చాలదు, కవిత్వంలో కూడా ఉండాలి. ఓ... చేతి వేళ్ళని కౌగిలించుకుని కసభిసా రాసేస్తే చదివేవాడు చచ్చుబడిపోతాడు. కలం పట్టుకుని రాసినోడల్లా చలం కాడుగా! కాస్త చూసుకో అమ్మా!
రోజూ ఏదో ఒకటి రాసుకుంటూ... రాయక పోతే రోగమొచ్చినట్టు మూలబడుతూ... అంత తపనెందుకే నీకు? తృప్తిలేని కాగితాన్ని ఎంత వరకూ సర్దిపెడతావ్. సర్ధుకో! పెన్ను, పేపరు... మనకీ రాతలు, గీతలు వద్దు. శ్రీరంగం వెళ్లిపోదాం, శ్రీనాథుడున్నాడట, సాగిలా... పడిపోదాం.
Thank you😁
Bhagyamati ✍️.
"ఇసుకపై అలిగి వెనక్కు వెళ్ళే అల లాగా, విసుగుపుట్టి ముందుకు తోసే సంద్రం లాగా" mee భావుకతకు hatsoff andi
రిప్లయితొలగించండిThank you
తొలగించండిపిసినారి సిరా బుడ్డి తప్పా?
రిప్లయితొలగించండిఇంకా సిరా వాడుతున్నారా?
కవిత బాగుంది.
Thank you
తొలగించండిSelf criticism la chestu bagane raasaru
రిప్లయితొలగించండిThank you
తొలగించండిబహుమంచి జ్ఞానోదయం ఆత్మ పరిశీలన కూడా ఒక వేదానికి ఉండవలసిన ఈ రెండు ప్రధాన లక్షణాలు మీకు ఉన్నాయి
రిప్లయితొలగించండిGreat compliment, thank you 🙏
తొలగించండిBagundi story
రిప్లయితొలగించండిThank you ☺️
తొలగించండి