మృదువైన లయబద్ధమైన వాన శబ్దం వినపడుతుంటే... చిట్టి చినుకుల మధ్య నేను నీతో వెళుతూ ఉంటే... నీతో ఈ క్షణాలను అనుభూతి చెందడానికి ఈ వర్షంలో తడవాలి. ఈ వర్షపు రోజు, నా పక్కనే ఉన్న నా ప్రేమికుని ఉనికి.. ఇది ఒక అందమైన కలయిక. అందుకే ఈ రైనీ సీజన్ ఒక పర్ఫెక్ట్ రొమాంటిక్ సీజన్.
పచ్చని చెట్లు, తడిచి ముద్దై నల్లగా మెరిసే తారు రోడ్డు, చీకటిని చీల్చుకుని వెళ్ళే మా రాయల్ ఎన్ఫీల్డ్!. పెద్దగా రంగు లేమి లేవు ఇక్కడ, నల్లగా కమ్ముకున్న మబ్బులు తప్ప. చీకటి ఏం చేస్తుంది చిరుత కన్నుల చిన్నోడు పక్కనుండగా!
స్వర్గం నుండి జారి పడే చినుకులు నేల తాకే లోపు హృదయాన్ని తాకుతుంటే... ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ రెగ్యులర్ గా తాగే చోటే కాఫీ తాగుతుంటే, జడి వాన ఏదో సడి చేస్తూ ఉంటే, చల్లగాలి చెంపలపై ఏదో చెప్పి వెళుతుంటే... మా ఇద్దరి మధ్య సాగే సంభాషణలు వెన్న కంటే సాఫీగా సాగిపోయాయి. కురుస్తున్న వర్షం మధ్యలో... మధురమైన సంభాషణలో మునిగిపోయాం. వర్షం ఆగలేదు గానీ, మా కప్పులో కాఫీ మాత్రం కరిగిపోయింది.
ఈ ఆహ్లాదకరమైన అవుట్‌డోర్ వాతావరణం... ఇద్దరినీ ముసిముసిగా నవ్వుకోవడానికి మరియు ప్రేమలో మళ్లీ పడేలా చేయడానికి సరిగ్గా సరిపోతుంది. అందుకే మన ఇండియన్ సినిమాలలో రైన్ సాంగ్స్ అంత ఫేమస్ అవుతాయి. ఈ చిలిపి వాన ఎప్పుడూ... మనల్ని తడిపి వెళుతుంది, ఇద్దరి హృదయాలను దగ్గరగా జరిపి వెళుతుంది. కరిగిపోయే మబ్బులది ఎంత త్యాగమో కదా... కరిగి మరీ హృదయాలలో ప్రేమ నింపుతాయి.
వర్షమంటే ఎంత ఇష్టమో... పూలకి, నేలకి. కడుపునిండా... నింపుకుంటాయి.
వర్షమంటే ఎంత ఇష్టమో... కవులకి, ప్రేమికులకి కలం నిండా నింపుకుంటారు.
కురిసేది... వాన కాదు,
తడిసేది... నేల కాదు,
విరిసేది... పువ్వు కాదు,
ఇది లోకం ఎప్పుడూ చూడని నా కంటె నవ్వు.
నీకు యేళ్ళ తరబడి చెబుతున్న నా పిచ్చి లవ్వు.
చల్లని వర్షం నా మీద పడుతుంటే... వెచ్చని సూర్యరశ్మిని నీ శ్వాస నాకు అందిస్తుంది. నీ ప్రేమ నాకు గొడుగు పట్టే వేళ, నీ నిట్టూర్పు నాకు చలికాస్తుంది. నేనెప్పుడూ... నమ్ముతాను, ఈ వర్షం మనల్ని ప్రేమలో పడేయడానికి పుట్టిందని, ఆ బంధం ఇంకా దృఢంగా ఉండాలని మళ్లీ మళ్లీ పడుతోందని.
"వర్షం కొంతమందికి చీకటిని కలిగిస్తుంది, కానీ నువ్వు నా పక్కన ఉంటే, అది నా హృదయానికి ఆనందాన్ని, వెచ్చదనాన్ని మాత్రమే ఇస్తుంది." మన చర్మం పై పడే ఈ వర్షపు చినుకులు ఆకాశం నుండి పడే మృదువైన ముద్దులు. ఇవి తాకకుంటే తప్పేమో గాని తాకితే ఎంత హాయి కదా!
ఈ వర్షం కురిసే ప్రతి చోట, నేను అందమైన ప్రేమ కోటను నిర్మిస్తాను. అందులో నీకు నాకు మధ్య ఉన్న తీయని జ్ఞాపకాలను భద్రంగా దాచుకుంటాను. ఈ వానాకాలం, మనం పంచుకునే ప్రేమ క్షణాలను ఆస్వాదించమని చెప్పే ప్రకృతి మార్గం.
ఏ రంగూ లేదు ఈ వర్షానికి, నా స్వచ్ఛమైన ప్రేమకున్న రంగులాగే. వానను నిజంగా చూడాలంటే పక్కనే ప్రేమికుడు ఉండాలి. ప్రతి వర్షపు చినుకులు గమనించటానికి, అందులోని సంగీతం వినడానికి, అది ఎందుకు పడుతుందో అర్థం చేసుకోవడానికి. ప్రేమ పక్షులకే తెలుసు ఈ వర్షపు దాహం. అందుకే చంద్రుని కోసం ఎగిరే చకోర పక్షి లా... వర్షం కోసం ప్రేమికులు ఎదురు చూస్తుంటారు.
ఈరోజు భూమి అంతటా వర్షం ఉద్రేకంగా కురుస్తున్న... నేను మాత్రం నా ప్రేమికుడి పట్ల ఉన్న అభిమానాన్ని వివరిస్తూ ఉన్నాను. అదే నేను.
Thank you 🙏🏻
✍🏻 Bhagyamati.
అదిరింది
రిప్లయితొలగించండిThank you
తొలగించండి