ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హీరోయిజం అంటే ఏంటి?

జీవితం మొత్తం ఒక చేతగాని వాడిలాగా బ్రతికే కంటే జీవితంలో ఒక్కరోజైనా హీరోలా బతికి చనిపోవాలి అంటారు. 




దైర్యవంతుడు ఒక హీరో:

శారీరక ధైర్యం అందరిలోనూ ఉంటుంది. నైతిక ధైర్యం చాలా అరుదుగా ఉంటుంది. నైతిక ధైర్యం అంటే నీతి నిజాయితీ కోసం నిలబడటం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిలబడడం. ఎన్ని కష్టాలు వచ్చినా వెనకాడకుండా నమ్ముకున్న సిద్ధాంతం కోసం ధైర్యంగా నిలబడే వాడు హీరో.

ధైర్యం అంటే భయానికి ప్రతిఘటన. భయం యొక్క వ్యతిరేక పదం లేదా భయం లేకపోవడం కాదు. ఒక మనిషి ధైర్యవంతుడని చెప్పడం పొగడ్త కాదు, అది అతని లక్షణం, అదే హీరోయిజం.  జీవితంతో పోరాడే ఎంతోమంది పేదవాళ్లు దివ్యాంగులు మన చుట్టూనే ఉంటారు, వారిని అభినందించలేనంత మౌనంగా ఉంది ప్రపంచం. వీరిలో బతకడానికి చేతినిండా డబ్బులు ఉండవు, గొప్పగా బతకాలని ఆశ ఉంటుంది. అందుకు దారి వేసే ధైర్యం ఉంటుంది.



ధైర్యం అనేది ధర్మాన్ని కాపాడుకోవడానికి అవసరమైన లక్షణం. ఇది ఎల్లప్పుడూ గౌరవించబడుతుంది. ధైర్యవంతుడు ఎప్పుడు సమాజంలో హీరోగా కనబడతాడు.ధైర్యవంతుడు వంద మంది ముందు నిలబడి మాట్లాడగలడు, వంద మందిలో స్ఫూర్తిని నింపగలడు, ధర్మాన్ని ప్రేరేపించగలడు. అతను సులువైన మార్గాన్ని చూపడు, జీవితం పట్ల కఠినమైన మార్గానికే నిర్దేశాన్ని నేర్పుతాడు. ఎందుకంటే సులభమైన మార్గాన్ని పిరికివాడు కూడా అవలంబించగలడు, అదే పిరికివాడు ధైర్యవంతుని మాటల్ని కూర్చొని వినడానికి కూడా ధైర్యం చేయడు. 

పిరికి మనుషులు స్వేచ్ఛ సముద్రం కంటే నిరంకుశం యొక్క ప్రశాంతతను ఇష్టపడతారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండినా, మన స్వతంత్ర సమరయోధులను మనం హీరోలుగా ఇంకా అభినందించడంలో గల అంతరార్థం ఇదే. పరిస్థితులతో ధైర్యంగా పోరాడే వాడు హీరో అవుతాడు, ప్రతికూల పరిస్థితులను మౌనంగా అంగీకరించేవాడు బానిస అవుతాడు.
ధైర్యం అనేది ఒక ప్రత్యేకమైన జ్ఞానం: దేనికి భయపడాలి మరియు భయపడకూడని వాటికి ఎలా భయపడకూడదు అనే జ్ఞానం.

 హీరో ఒక పాజిటివ్ థింకర్:
పాజిటివ్ థింకింగ్, ఆశావాద వైఖరితో ముడిపడి ఉంటుంది. సానుకూలంగా ఆలోచించే వ్యక్తులు ఒత్తిడికి తక్కువగా గురవుతారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా తమ చాలకశక్తిని ఉపయోగించి మరింత సమర్థవంతంగా పనిచేస్తారు. పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తులు సాధారణంగా ఆరోగ్యకరమైన జీవన విధానం గడపడానికి మొగ్గు చూపుతారు; వారు ఎక్కువ వ్యాయామం చేస్తారు, మరింత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు.
 
 మనలో చాలామంది సానుకూల ఆలోచనని కలిగి ఉంటాము, కానీ హీరోలు సానుకూల ఆలోచనతో పాటు వాస్తవిక దృక్పథాన్ని కూడా కలిగి ఉంటారు. అంటే వాస్తవిక పరిస్థితులలో ఆలోచించడం... అన్నిసార్లు పాజిటివ్ గా కాకుండా కొన్నిసార్లు నెగిటివ్ థింకింగ్ ద్వారా ఆలోచించడం కూడా... కొన్ని ప్రశ్నలకు సమాధానాన్ని చూపుతుందని హీరోలు నమ్ముతారు. 




పాజిటివ్ థింకింగ్ కొన్ని సమయాల్లో ఆపదలను కలిగిస్తుంది. సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం ముఖ్యం అయినప్పటికీ,  అధిక అంచనాలు (ఓవర్ ఎక్స్పెక్టేషన్స్)నిరాశకు దారితీయవచ్చు. దీనినే టాక్సిక్ పాజిటివిటీ అంటారు. పాజిటివ్ థింకింగ్ ని కూడా ఒక సాధనం లాగా వాడితే మాత్రమే హీరోలు అవుతారు.

"బిగ్ హెచ్ హీరోయిజం" వర్సెస్ "స్మాల్ హెచ్ హీరోయిజం"


బిగ్ హెచ్ హీరోయిజంలో గాయపడడం, జైలుకు వెళ్లడం లేదా మరణం వంటి పెద్ద ప్రమాదం ఉంటుంది. మరోవైపు, చిన్న హీరోయిజంలో మనలో చాలా మంది ప్రతిరోజూ చేసే పనులు ఉంటాయి: ఎవరికైనా సహాయం చేయడం, దయగా ఉండటం మరియు న్యాయం కోసం నిలబడటం. ఈ విషయాలు సాధారణంగా మా వైపు వ్యక్తిగత ప్రమాదాన్ని కలిగి ఉండవు. ఈ హీరోలు తమ వ్యక్తిత్వాన్ని హీరోఇజం గా చెప్పుకోరు, ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఏమి చేస్తారో నేను కూడా అదే చేశాను అంటారు.




ఈ బిగ్ హెచ్ అండ్ స్మాల్ హెచ్ థియరీ చెబుతుంటే నాకు అతివాదులు మితవాదులు గుర్తుకొస్తున్నారు. మితవాదుల గురించి చదివేటప్పుడు ఉదయం స్పందిస్తుంది. అదే అతివాదుల గురించి చదివేటప్పుడు ప్రతి రక్తపు బిందువు స్పందిస్తుంది.

హీరోలు, హీరోలు కాని వారి నుండి వేరు చేసే రెండు ముఖ్యమైన లక్షణాలను కలిగి ఉంటారు: వారు తమ విలువలకు అనుగుణంగా జీవిస్తారు మరియు ఆ విలువలను రక్షించడానికి వ్యక్తిగత నష్టాలను భరించడానికి సిద్ధంగా ఉంటారు.

హీరోలో ఉండే క్వాలిటీస్:

1. గొప్ప నాయకులు రాజకీయ ఉద్యమాలకు మరియు సామాజిక మార్పులకు స్ఫూర్తిని ఇవ్వగలరు. వారు మరికొందరు నాయకులను సృష్టించడానికి మరియు ఆవిష్కరించడానికి కూడా ప్రేరేపించగలరు.

2. నాయకులు, ఏమి చేయాలి? ఎప్పుడు చేయాలి? మరియు ఎలా చేయాలి? అనే దాని గురించి స్పష్టమైన అంచనాలను అందిస్తారు. ఈ నాయకత్వ శైలి నాయకుడి ఆదేశం మరియు అనుచరుల నియంత్రణ రెండింటిపై బలంగా దృష్టి పెడుతుంది.

3. నాయకులు టీం లోని సభ్యులకు మార్గదర్శకత్వం అందిస్తారు, కానీ వారు కూడా టీం లో ఒకరుగా పాల్గొంటారు మరియు ఇతర టీం సభ్యుల నుండి ఇన్‌పుట్‌ను అనుమతిస్తారు. కానీ నిర్ణయం తీసుకునే ప్రక్రియలో తుది అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. 

 4. నాయకులు వ్యక్తిగత బలాలు మరియు పరిమితుల గురించి అవగాహన కలిగి ఉంటారు. వీరు ఆత్మవిశ్వాసం మరియు స్వీయ అంగీకారం ఉన్నవారై ఉంటారు.

5. వీరు మార్పును అంగీకరించే మరియు స్వీకరించే సామర్థ్యం కలిగి ఉంటారు. పాత తరం నుంచి నేర్చుకున్న అభిప్రాయాలను లేదా అనుభవాలను కొత్త తరానికి తగ్గట్టుగా మార్చి అందించడంలో కృషి చేస్తారు.

6.నాయకుడు తను చేసిన తప్పుకు బాధ్యతను వహిస్తాడు. క్లిష్ట పరిస్థితుల్లో భావోద్వేగాలను నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంటాడు. గెలుపులోను ఓటమిలోనూ ఒకే రకమైన మానసిక స్థితిని వ్యక్తపరుస్తాడు.

ఎవరు పుట్టేటప్పుడే హీరోగా పుట్టరు, లేదంటే హీరోఇజం అనేది వంశపారంపర్యంగా వచ్చేది కాదు. మన కుటుంబ సభ్యుల కోసమో, మన స్నేహితుల కోసమో, సమాజంలోని ప్రజల కోసమో త్యాగం చేసిన వాళ్ళు హీరోలు అవుతారు. మనం కూడా హీరోలు అవుదాం.

Thank you 🙏.


                              ✍️ Bhagyamati.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మొదటి ప్రేమ... మా నాన్న!

  ఒక అమ్మాయి ఏ వయసులో అయినా ఉండొచ్చు కానీ ఆమె ఎప్పటికీ తన తండ్రికి చిన్ని యువరాణిగానే ఉంటుంది.  తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న ఈ ప్రత్యేక బంధం... ఆరాధ్య బంధం!.  ఒక తండ్రి తన కూతురిపై ఉంచే హద్దులు లేని ప్రేమ ఎప్పటికీ తిరిగి చెల్లించలేనిది.   బెస్ట్ ఫ్రండ్ తో షాపింగ్:  నేను రత్నం జూనియర్ కాలేజి లో చదివేటప్పుడు కాలేజి వ్యాన్, ఇల్లు తప్ప ఏం తెలియదు. డిగ్రీ కి వచ్చాక న బెస్ట్ ఫ్రెండ్ శ్వేత తో మొదటిసారి బయటకి వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళడం, నాన్నకి trunk road లో కనిపించాను. నా మైండ్ బ్లోక్ అయ్యి రెడ్ అయ్యి, బ్లూ అయ్యింది. మా నాన్న మాత్రం సింపుల్ గా షాపింగ్ కి వచ్చావా? డబ్బులు ఉన్నాయా? అంటూ 2000 ఇచ్చేసి వెళ్ళాడు. నాన్న అంటే అంతే మరి, నెక్స్ట్ లెవెల్.  నేను పెద్ద చిరంజీవి అభిమాని ని. నాన్న ఫస్ట్ డే ఫస్ట్ షో చిరంజీవి మూవీ కి తీసుకుని వెళ్తాడు. నేను తిరుపతి లో M.SC చేసేప్పుడు నాకోసం dairy milk బాక్స్లు కొరియర్ చేసేవాడు. చిరంజవి గ్రీటింగ్స్ పంపేవాడు. నాన్నకి నేను ఎప్పటికీ చిన్న పిల్లనే. నేను అబద్ధాలు చెప్పను. ఇప్పటికీ చెప్పను. అందుకే నన్ను మా అమ్మ, నాన్న బాగా నమ్ముతారు. నా ప్ర...

ఇప్పటికి మేల్కున్నావా స్వామి?!

 తడిసి నీళ్ళోడుతున్న చీర కొంగును పిండుకుంటూ... అల్లంత దూరాన ఉన్న అతనిని చూసాను. కడవ నడుముకెత్తి తిరిగి మళ్ళీ మళ్ళీ చూసాను. ఎదుట ఏటుగట్టు వెనకనుంచి చుమ్మలు చుట్టుకుంటూ... తెల్లని పొగతెరలు, చెట్ల ముసుగులు దాటి వచ్చాను.  మామిడి చెట్టు ఆకుల గుబురుల్లోంచి, సన్నగా పడుతున్న నులి వెచ్చని సూర్యకిరణాలు.... మడత మంచంపై మాగన్నుగా పడుకుని ఉన్న నా మన్మధుడు. ఓయ్... అని కేక వేయాలనుంది, వాలుగాలిలో మాట కొట్టుకుని పోదా అని ఆగిపోయాను. తడక మీద ఆరవేసిన తుండువా లాగి దులుపుదామనుకున్నాను. గడుసుదనుకుంటాడని గమ్మునుండి పోయాను. పొగమంచు మేఘాల మధ్య చాచుకునే ఉంది. పసిడి పువ్వులు నా పిరికితనం చూసి నవ్వుకుంటున్నాయి. చెట్టు కొమ్మన కౌగిలించుకున్న రామచిలుకలు నీ మాటేమిటి? అని ఆరా తీశాయి.  సరే! నడుము మీద కడవ నిలవకుంది, అతనితో గొడవ పడమంది. నెత్తిన కుమ్మరిస్తే మేలుకొంటాడుగా?! అమ్మో కయ్యాలవాడు మాటలే కట్టేస్తాడు. వద్దులే రేగిపోయిన జుట్టును ముడి వేసుకుంటూ పక్కనే ఓ పూచిక పుల్ల కోసం వెతికాను. ఈ పడుచు వాడి కలలో ఏమొస్తుందో... నిద్రలోనే నవ్వాడు. చక్కనోడు చెంప మీద చంద్రవంకలు పూచాయి. మర్రి చెట్టు కాయలు ముసిముసిగా నవ్వుతూ.....

ఇది యుగాలనాటి ప్రేమ!.

 రాధంటే... ఉత్తదేహం కాదు, ఉత్త మనసే కాదు, రాధంటే ఆత్మ. కృష్ణుని ప్రేమలో లీనమైన ఆత్మ. ప్రపంచానికి అర్థం కాని ఎన్నో విషయాలలో వీరి ఇరువురి ప్రేమ కూడా ఒకటి. వీరి శృంగారం మానసికమే! కానీ ఆత్మసంబంధం. ఏ ప్రేమ కథకైనా వీరే ఆదర్శం. ప్రేమ యొక్క గొప్పతనం పట్టాలంటే... కథలో చిత్రించే పాత్రలను రాధాకృష్ణలను ఊహించే రాయాలి. కృష్ణుని పై ఆశలు రేకెత్తించుకొని మనసును కృంగ దీసుకున్న రాధ ప్రేమ లోంచి విరహం అనే పదం పుట్టుకొచ్చిందేమో?! ప్రేమంటే మనసంతా కాముఖత్వం పులుముకోవడం కాదు, దేహవసరాలను తీర్చుకోవడం కాదు, ప్రేమంటే విశాలత్వం, దైవత్వం, విరహం, తపన, వేదన, ఎడబాటు, త్యాగం, కృష్ణుని రూపు కోసం పరితపించే రాధ దినచర్య. అందుకే రాధాకృష్ణుల ప్రేమ ఉత్త ప్రబంధ కథగా కాకుండా... యుగాలు చెప్పుకునే గొప్ప ప్రేమగాధ గా మిగిలింది. ఒక ప్రేమ కథను పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టాలన్నా... ఒక ప్రేమ గీతాన్ని, స్వర్గాన్ని తాకేంత ఆనందంగా ఆలాపించాలన్నా... రాధాకృష్ణుల ప్రేమే ప్రేరణ. ఇంత గొప్పగా మనం ప్రేమించాలంటే రోజు మనసుకి మెదడుకి మధ్య దేవాసుర యుద్ధమే జరుగుతుంది, అయినా నిలబడితేనే ప్రేమ గెలుస్తుంది. ఇక్కడ గెలవడం అంటే ఇద్దరు పెళ్లి చేసుకొని జీవి...