నిన్ను చూసిన క్షణం నుంచి గుండెలో అలజడి, జలజల జలపాతమై మెదడు నుంచి అరికాలుకు ప్రవహిస్తోంది. పుష్పక విమానమై పుడమి అంతా నన్ను తన ఒడిలో దాచుకుంటోంది. మృదుస్వరంతోపాటు రిథమిక్ గా సాగే సంగీతం...., బిగబట్టిన ఊపిరిని తేలికగా వదులుతూ... అతనికేసి చూశాను. మరింతగా ఇంకొంతగా ఆ కళ్ళలో... ఆ కనుల కౌగిళ్ళలో ఒదిగి పొమ్మని మనసు చెబుతోంది. చుట్టూ ఉన్న వాతావరణం ఒక్కసారిగా వెచ్చబడిపోయింది. స్వేద బిందువులు ముఖంపై ఆవిర్భవించాయి.
నా కనురెప్ప చాటులో నీతో కాపురం ఉండే నేను, నీకనుచూపు సోకగానే... కరిగి మాయమైపోయాను. చలికి వనికే చిగురుటాకుల పెదవులను అరచేతులలో అదిమిపట్టుకున్నాను. సిగ్గు మోయలేక రెప్పులు వాలిపోతుంటే, అరవిరిసిన కన్నులతో ఏదో అంతరార్థాన్ని అలవికాక నీకు ఏలానో... చెప్పుకున్నాను. అల్లంత దూరంలో నిన్ను చూసినప్పుడు అగుపించని ఈ సిగ్గు, ఇప్పుడిప్పుడే అడుగులు నేర్చుకుంటోంది. నీ వెలుతురు నిండిన కన్నులు జల్లే వెలుగుల రేఖలు, నన్ను కాల్చి బూడిద చేస్తున్నాయి. పరిహాసమా నీకు ఈ ప్రణయ ప్రళయము!.
వెన్నులో వచ్చే ఈ భయాన్ని మిన్నుకేసి చూసి ఆపుకుంటున్నాను. దొరికిపోవడం ఇష్టమే ఇలా నీ కళ్ళకు. కానీ సిగ్గులో దొర్లిపోతూ... ఎలా చెప్పు ఈ సమయం. అప్పుడే మూత పడిపోతున్న రెప్పలని పూర్తిగా మూసుకోక ముందే ధైర్యం అడ్డుపెట్టి చూస్తున్నాను. వచ్చిపోయే వాహనాల మధ్య చిక్కుకున్న చిన్నపిల్లల నా గుండె గుబేలున కొట్టుకుంటుంది. ఒక్కదానిని అయిపోయాను ఒంటరిగా చిక్కుకుపోయాను. నడుముకు ఏదో కట్టేసినట్టు కదలకున్నాను. నోరూరించే ఆ కళ్ళను గుటుక్కున మింగేయాలని ఉంది. లోగొంతుకతో అతనికి మాత్రమే వినిపించేటట్టు చిన్నగా ముద్దు పేరును పలికాను. నిన్ను నీ కన్నులను ఆరగించేలోపు ఇక్కడి నుంచి పారిపో అని. సమయమనే అడ్డు పుల్ల వేసి, నా ఉత్సాహం పై చన్నీళ్లు చిలకరించడంలో నిపుణుడు తాను. వెళ్ళిపొమ్మని వెడళిపోయాడు. అతనిని మాటలలో ఓడించే చాతుర్యము లేక మౌనంగా తల ఊపాను.
చేతులకు చిక్కడు, మాటలకు దొరకడు, చూపుల రాయబారాలతోనే కాలమంతా గడిపేస్తాడు. గడసరి వాడు ఈ చక్కని వాడు. గడియ గడియ దాచిన ఏడబాటునంత చేర్చి, గుడి కట్టి తీసుకువస్తే... గడియ చాలులే పొమ్మన్నాడు, గుడి తలుపులు మూసుకున్నాడు. సడి మారిన ఎద చప్పుడుని చల్లబరిచి, చల్లబాటు వేళలో మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాను. చూసి వచ్చిన కన్నులను వెనకే మోసుకొస్తున్నాను.
Thank you 😍,
✍️ Bhagyamati.
👏👏👏
రిప్లయితొలగించండిThank you
తొలగించండిగడియ గడియ దాచిన ఏడబాటునంత చేర్చి, గుడి కట్టి తీసుకువస్తే... గడియ చాలులే పొమ్మన్నాడు, గుడి తలుపులు మూసుకున్నాడు. ..
రిప్లయితొలగించండిగడియ చాలులే అని గుడి తలుపులు మూసుకోవడమేమిటి ఇక్కడ గడియకు మీరు ఎటువంటి అర్ధాన్ని ఆపాదించారు సమయమా? లేదంటే గుడి తలుపుకు ఉండే గడియ? ఏ కాన్ టెక్స్ట్ లో మీరు ఈ ప్రయోగం వాడారు వివరించగలరు
గడియ అంటే గంట సమయం అని నా ఆలోచన
తొలగించండిగడియ అంటే రెండున్నర గంటల సమయం
రిప్లయితొలగించండివాస్తవానికి అది గకారంతో కూడిన గడియ అని రాయకూడదు ఘడియ అని రాయాలి
తొలగించండిThanks andi🤝
తొలగించండి