తడిసి నీళ్ళోడుతున్న చీర కొంగును పిండుకుంటూ... అల్లంత దూరాన ఉన్న అతనిని చూసాను. కడవ నడుముకెత్తి తిరిగి మళ్ళీ మళ్ళీ చూసాను. ఎదుట ఏటుగట్టు వెనకనుంచి చుమ్మలు చుట్టుకుంటూ... తెల్లని పొగతెరలు, చెట్ల ముసుగులు దాటి వచ్చాను.
మామిడి చెట్టు ఆకుల గుబురుల్లోంచి, సన్నగా పడుతున్న నులి వెచ్చని సూర్యకిరణాలు.... మడత మంచంపై మాగన్నుగా పడుకుని ఉన్న నా మన్మధుడు. ఓయ్... అని కేక వేయాలనుంది, వాలుగాలిలో మాట కొట్టుకుని పోదా అని ఆగిపోయాను. తడక మీద ఆరవేసిన తుండువా లాగి దులుపుదామనుకున్నాను. గడుసుదనుకుంటాడని గమ్మునుండి పోయాను. పొగమంచు మేఘాల మధ్య చాచుకునే ఉంది. పసిడి పువ్వులు నా పిరికితనం చూసి నవ్వుకుంటున్నాయి. చెట్టు కొమ్మన కౌగిలించుకున్న రామచిలుకలు నీ మాటేమిటి? అని ఆరా తీశాయి.
సరే! నడుము మీద కడవ నిలవకుంది, అతనితో గొడవ పడమంది. నెత్తిన కుమ్మరిస్తే మేలుకొంటాడుగా?! అమ్మో కయ్యాలవాడు మాటలే కట్టేస్తాడు. వద్దులే రేగిపోయిన జుట్టును ముడి వేసుకుంటూ పక్కనే ఓ పూచిక పుల్ల కోసం వెతికాను. ఈ పడుచు వాడి కలలో ఏమొస్తుందో... నిద్రలోనే నవ్వాడు. చక్కనోడు చెంప మీద చంద్రవంకలు పూచాయి. మర్రి చెట్టు కాయలు ముసిముసిగా నవ్వుతూ... పుల్ల ఒకటి విసిరాయి. అతడి గుండెపై చెక్కిలిగింతగా చుట్టాను. చక్రాల కన్నులు తెరిచి సూటిగా చూశాడు, చిక్కగా నవ్వాడు. బిడియమో... భయమో... బిగుసుకుపోయాను. ఈ చక్కనోడి నవ్వుకే పడిపోతాను, వెయ్యి మాటలెందుకు? జారు కున్నాను.
సూర్యకిరణాలు అతని కనులను తాకి కడవనీటిపై ప్రకాశిస్తున్నాయి. నా బిడియపు నడకలు మాత్రం ఒక అడుగు వెనక్కు వేశాయి. చేయి పట్టుకుంటాడేమోనని చెంగుమని పరుగు లీడాను. చిక్కనంటే చిక్కనిక, ఒక్క పరుగు తీశాను. ఓయ్... అని పిలిచాడు, వాలుగా నవ్వి జారుకున్నాను. అక్కర ఏముంది నాకు! అతని పిలుపు చాలు. అతని చూపు చాలు.
పాము పడగ నీడలో నిదురించే విష్ణువితడు. ఆ పాల కడలి మధ్యలో పానుపేసుకున్నాడు. తామరపూవునై నేను, అతని నాభివిచ్చుతాను. శంకు చక్ర మై నేను అతని కరము తాకుతాను. అతని భార్యను కాదు నేను, పాదదాసిని. పారిజాత పుష్పమై కాలినంటుతాను. నా అరచేతులతని పాదము తాకే వేళ పులకించి, పరవశించే... పడతి లక్ష్మినవుతాను.
Thank you 🙏
✍️Bhagyamati.
👌👌👌👌👌👌👌👌👌
రిప్లయితొలగించండిThank you
తొలగించండిధన్యచరితవమ్మా!నీవు!! నిన్ను కన్నందుకు మీ నాన్నగారెంత భాగ్యశాలో కదమ్మా! విష్ణుచిత్తునికి "గోదాదేవి"జన్మించలేదట. తులసివనంలో దొరికిందట. కానీ ఆయన తన కడుపున పుట్టలేదే ఇంతటి పుణ్యశాలి అనుకొన్నాడట. అదీ జన్మలో నెరవేరింది. నాకు కూడా పుత్రికా సమానురాలవైన నీకు నమస్కరించకూడదు గనుక.. జయీభవ తల్లీ జయజయశ్రీరామ.
రిప్లయితొలగించండిThank you sir🙇🏻♀️
తొలగించండి