జల్లు జల్లుగా నాపై వెన్నెల కురిపిన అతని ప్రేమని, తుల్లిపడి తన కౌగిలిలో ఒళ్ళు విరుచుకున్న రేయిని, ఒంటరితనపు సంకెళ్ళతో ఓదార్చు కుంటున్నాను. నడి రాతిరి జాములొస్తునాయి, అతని జాడలడిగి పోతున్నాయి. పొడిబారిన కన్నులు ఎదురు చూపులతో అలిసిపోతున్నాయి. తడి ఆరని చెంపలు మళ్ళీ మళ్ళీ తనకోసం తడిచిపోతున్నాయి. ఎడబాటు ఎంత గొప్పదో... కన్నీటిని ఏరై పొంగించగలుగుతుంది.
వేయిసార్లు అతని మోముని తనివితీరా చూడాలని ఉంది. అరచేతులతో... తన చెంపలను తాకి నుదిటిపై ముద్దాడాలని ఉంది. నీ కనురెప్పల చాటున కలగానైన ఉన్నానా? నీ మెదడు పొరలలో జ్ఞాపకమైనా ఉన్నానా? అని మనసుతీరా అడగాలని ఉంది.
ఈ రాత్రి, పగళ్ళు వస్తూనే ఉన్నాయి. నిరంతరం వస్తూనే ఉన్నాయి. నిన్ను నాతో కలపలేక దూరం నుండే వెళ్లిపోతున్నాయి. అవతలి ఒడ్డు నుంచి వచ్చే గాలి పులకరింత ఒక్కసారైనా నీ పరిమళాన్ని మోసుకురాలేకుంది. ఈ నల్లనైన నదీ తీరం నావైపు నువ్వు నడిచే తోవ కూడా మూసివేసిందా? ఈ వియోగం, ఈ అన్వేషణ... వినోదమా నీకు? నీ ఆకర్షణలో మరిగించి ఈ ఒడ్డునే వదిలి వెళ్ళిపోతావా? నాతో ఆడే ఈ దాగుడుమూతలు ఇంకెన్నియుగాలు?.
తల్లికి ఎడమైన బిడ్డలా... నీ కోసం విలపిస్తున్నాను. నువ్వు నా కళ్ళపై కప్పిన ఇంద్రజాలాన్ని, మరల నీ వక్షంపై ప్రణయానందంతో కప్పాలని ఎదురుచూస్తూ ఉన్నాను. నన్నల్లుకున్న నీ మొండి బంధాన్ని తెంపుకోలేక నా హృదయంలోనే తల్లడిల్లుతున్నాను. నీ శ్వాస తాకి నా గుండె దీపం, మరొక్కసారి వెలిగించుకోవాలని నాకాంక్ష. ఆభరణాలు, చీనాంబరాలు నాకు ప్రేమ చిహ్నాలే కావు, నీ చిరునవ్వు మాత్రమే నాకు ప్రణయపరమార్థం.
మబ్బుల మీద మబ్బులు, కమ్ముకు వస్తున్న... చీకటి, ఒంటరితనం భయపెడుతున్న, తలుపు దగ్గర నిరీక్షణలో ఇలానే ఎదురు చూస్తూ ఉన్నాను. నిరాశతో మూల్గుతూ ఉన్న ఆకాశం, ఒక రవ్వ వెలుగు లేని ఈ దివ్వె, ఏమాత్రం విషాదం నింప లేవు నాలో!. మబ్బు కమ్మిన ఆకాశం ఎడతెరపక వర్షిస్తోంది. దుఃఖం కమ్మిన నా హృదయం కన్నీరై కురుస్తోంది. అంతమాత్రాన నా హృదయం, నా స్థితి నా బ్రతుకును ప్రశ్నించవు. అలసట ఆవరించిన హృదయం మాత్రమే ఇది మరలా పుంజుకోగలదు.
Thank you 🙏
✍️Bhagyamati.
Excellent
రిప్లయితొలగించండిThank you
తొలగించండి