మారువేషంలో ఉన్న కృష్ణుడు నా ముందే తిరుగుతూ ఉంటే, జన్మలు మారినా ప్రేమని మర్చిపోలేని రాధగా అతని ముందే తిరుగుతూ ఉన్నాను. ఇది లౌకిక ప్రేమనో లేక అలౌకిక ప్రణయమో? నేను వర్ణించలేను. గొంతు గంభీరంగా ఉన్నా అతను మాటలో మధురమైన వాడు. నా యోగక్షేమాలు అడగకున్నా... నా ప్రేమ యాగంలో పూజ్యుడైన వాడు.
నాకు ఈశ్వరుడైన వాడు, నా యందు దేవుడైన వాడు. ఏ దూప దీపములు, మంత్ర జపములు కోరనివాడు. నా అంతరంగమందు అనందరూపుడు. నిర్మలుడు, నిర్భయుడు, నిమీలిత నేత్రములతో నన్ను వరించి, హరించే నీరాజక్షుడు. అతడే నా ప్రియుడు, కలల వరుడు.
నువ్వు నాకు పలకనంత దూరంలో ఉన్నా...నీ మౌనంలో నా హృదయాన్ని నింపుకుని, ఓర్చుకుని ఊరుకుంటాను. ఏదో ఒక రోజు నీ చూపులు, స్వర్ణదారలై నాపై వర్షిస్తాయి. ఆరోజు నా మనసులోని మాటలు రెక్కలు కట్టుకుని పాటలై నీ చెవులను చేరుతాయి. ఆరోజు నీ ముఖాన్ని ముద్దాడి, నీ చిరునవ్వుని దొంగిలిస్తాను.
నా ప్రాణానికి ప్రాణమైన చెలికాడి చెంత ఒక్క నిమిషమైనా కూర్చునే చనువు కావాలని కోరుకుంటున్నాను. అతని చేతి స్పర్శ తగిలి నా హృదయంలో జరిగే విద్యుత్ ప్రవాహాన్ని చూడాలని ఉంది. తన గుసగుసలు, నిట్టూర్పులు తగిలేంత దగ్గరగా నా మాట సాగాలి. పగటి కాంతి పడమట కుంకగానే... మసక చీకటిలో... నా ముఖం వంక నువ్వు చూసే వేళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.
నీ ముఖ వీక్షణం కోసం అంతులేని అలసట చెందుతోంది హృదయం. పొంగిపొర్లే నిశబ్దానికి విరామం కోరుతోంది విరహం. నా కళ్ళను ముద్దాడే ఒకే ఒక్క రూపం నువ్వు. నా హృదయాన్ని మాధుర్యంలో ముంచే మకరందం నువ్వు. నిజంగా నీ రూపు చెంత చేరిన నాడు, వాంచించేది, పొందగోరేది ఏమి లేదు. నీ చూపుకు నోచుకోవాలనే ఈ తాపత్రయం తప్ప.
ఆవిరామంగా నా హృదయం నిన్నే తలుచుకుంటోంది. అదిగో వచ్చాడని గాలి తలుపులను తోసి వెళుతోంది.నీ తెల్లని చిరునవ్వు నా కళ్ళ ముందు తొణికిసలాడుతోంది. నిద్రించే శిశువు పెదిమలపై దోబూచులాడే చిరునవ్వు అది. నువ్వు నా హృదయంలో జనియించిన ప్రేమ శిశువువే కదా!. ఈ తుషార స్నాత ప్రభాత స్వప్నంలో నీ చిరునవ్వుకిది ప్రథమ జననం.
Thank you🥳,
✍️Bhagyamati.
👍🎈🎈💐💐💐👌👌
రిప్లయితొలగించండిThank you
తొలగించండి