ఇద్దరం కలిస్తే నిండు పున్నమిలా ఉంటుంది. అందుకే విధికి అసూయ పుట్టి అప్పుడప్పుడు దూరం చేస్తుంది. కనుమరుగైన వాని కథలు రాస్తూ... కనిపించక పోతాడా అని కూనిరాగం తీస్తూ... ఈ కవ్వింపుల సవారీ చేస్తుంటాను, ఈ గతం తాలూకు గమనంపై, నా కలం తాలూకు కవనంపై.
ఏ నందనం నుండి ఈ నారు తెచ్చుకుని నాటుకున్నానో... నా హృదయ మందిరమంతా... అతని పూజా మందిరమైంది. ఈ వికశించిన పూవుల తీరులో... ఈ తియ్యనిదనం, అతను నింపి వెళ్ళినదే. వెన్నెల వెలుగులు, రవిబింబ దీప్తులు... అల్లంత దూరాన మెరుస్తుంటే... అతని కన్నులే జ్ఞాపకమొస్తాయి, అస్తమానం... అనుదినం.
సగం చదివిన పుస్తకంలా ఎప్పటికీ నాకు పూర్తిగా అర్ధం కానివాడు, అర్థమైతే ఆరాధించడం మనేస్తానేమోనని మధ్య మధ్యలో మాయమౌతాడు. ఈ మాయమయ్యే రోజుల్లో నా తడి రెప్పల మీద పాకేటి ఈ కన్నీటి చుక్కలు, అతని చేత పొదిగిన ముత్యాలే. వెళ్లినవాడు వస్తాడని తెలుసు. అయినా మనసు ఊరుకోదే?! వెదకడం మొదలెడుతుంది. పక్షి రెక్కలు ఛాచుకుని ఈ పచ్చని కొమ్మల మధ్య ఎగరలేక ఎగురుతుంటాను. ఎగిరేటి దూరం ఏందాకో? యదకే తెలుసు, రెక్కలకేం తెలుసు?. ఆకాశమంతా... చాచుకుని అలిసిపోయేదాక ఎగురుతాయి.
అంది అందని అందమే ముద్దు అన్నట్లు, చేతికందక కనులు పొందక ఎందుకో ఈ దొంగాట!. వంద మైళ్ళు వెళ్లిన నీకు నాకు మధ్య, రెండు గుండెలే కదా దూరం. ప్రవహించే నీటిని అరచేతిలో బంధించినా... వేళ్ళ సందుల్లోంచి వెళ్లిపోతాయి. నువ్వు అంతే!. నిన్ను బంధించ సఖ్యమగు బంధముందా మన మధ్య? అయినా... ప్రయత్నిస్తాను.
నీ గులాబీ కన్నులు విసిరి, నీ గులామును చేసుకొని, నువ్వలాగా... వెళ్ళిపోతే, నేనెలాగ ఉండిపోను చెప్పు?.
ఎప్పుడో ఏడాదికొకసారి కుశలమా? అని అడిగే నీ గొంతు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాను. ఈ బిడియపు మౌనం లోంచి, ఏదో... రాయడానికి మాటలు వెతుక్కుంటున్నాను. ముఖంపై సగం విరిసిన చిరునవ్వు ముందు, అక్షరాలు ఓడిపోతున్నాయి.
చల్లగాలి నన్ను మెల్లగా తాకి వెళుతుంటే నీ కుశలములడిగాను. కాగితాలపై రంగుల మరకలు పడ్డట్టు అన్ని నీ బొమ్మలే గీసాను. నిన్ను తలచిన క్షణాలే తప్ప, నీతో గడిపిన జ్ఞాపకాలు ఏమీ లేవు, అయినా ఎందుకీ గందరగోళం నాలో?.
ఒక్కో అక్షరాన్ని కూడబలుక్కుంటూ... నీవేలా ఉన్నావనే అడుగుతున్నాను. మనం గతంలోనూ కలిసి లేము, ప్రస్తుతం లోనూ కలిసి లేము, అసలు మనం కలవనే లేదు. మరి ఏ పేరు పెడదాము, ఈ ప్రేమకు? సముద్రపు ఇసుకపై రాసుకున్న పేర్లలాగా ఈ వచ్చిపోయే అలలకు ఆహారమవుతున్నాము. ఏమో ఇక నీ ఇష్టం! నా మనసులోని మాటలన్నీ... ఇలా కాగితంపై అక్షరాలుగా అప్పజెప్పేసాను. ఈ దూరానికి, ఏ పేరు పెట్టినా ఇక నీయిష్టమే!.
Thank you 🙏.
✍️Bhagyamati.
పవన్ కళ్యాణ్ 😊
రిప్లయితొలగించండిTrue💃, thank you
తొలగించండి