జీవితంలో ఒక గాఢమైన ఇష్టం కలిగినప్పుడు ఆ ఇష్టం కలిగించే తన్వయత్వమే ప్రేమ. దాని ముందు ప్రపంచంలో మరేది ఎక్కువ కాదు. ఇప్పుడు మనసు దృష్టి ఇంకా విశాలమవుతుంది. ఇంకా హాయిగా... గొప్పగా... అనిపిస్తుంది. కానీ అతను మాత్రమే కనిపిస్తుంటాడు. అతని అందం, గుణం ఆపై ప్రేమ కప్పిన మోహం. జీవితంలోని ప్రతి అడుగు, ప్రతి కదలిక అతని కోసం ఏదోక త్యాగం చేయమంటాయి. త్యాగం ప్రేమకు దర్పణం.
ఒక శిల్పి తన ఉలితో చెక్కినట్టు... అందమైన ముఖం, చక్కటి కనుబొమ్మలు, కళ్ళలో నెమలి కనుల మెరుపు, తీయటి గొంతు, మాటలలో ఒక సన్నని సంగీతం. సంభాషణలో మృదుత్వం, బింకం కొంచెం కొంచెంగా తొనికిసలాడుతుంటాయి. మనసులోకి తొంగి చూసే అతని ఆలోచన తీరు, ఇంకొంచెం అతని వైపు లాగుతుంటాయి.
అప్పుడప్పుడు మాటలకు దొరకక ఎక్కడో వెళ్లి దాక్కుంటాడు. ఈ చిన్ని పావురం నీకోసం ఎన్ని ప్రేమ లేఖలు రాసిందో తెలుసా? అని అడగగానే, పెదవులపై విరబూసే చిరునవ్వే సమాధానం అంటాడు. ఆవేళ అతని కనులలో మెరుపేదో కదలాడుతుంది, అది మనసుకు మాత్రమే కనబడుతుంది. ఆ నవ్వు విని సిగ్గుపడి ముఖం ఎర్రబారిపోతుంది. ఎంతో ఎడబాటు నుంచి మనసును తేలిక పరిచే సంగీతం ఆ నవ్వు. ముఖాన్ని అరచేతుల్లో దాచుకొని అద్దానికి చూపెడతాను. పెదవి చివర దాచుకున్న సిగ్గుకి అర్థం ఏంటని అద్దం కన్నెగరేసింది. ఏమో! ఎడబాటుతో ఏరై పొంగిన హృదయం సిగ్గుతో ముడుచుకు పోయింది.
అతను ఎవరని చెప్పను?!. అతను పర్వతం అంత పురాతనుడు. భూమితో పాటు పుట్టాడు. ఆకాశం వైపు చేతులు చాచి ముందున్న సముద్రాన్ని కౌగిలించుకుంటాడు. అతడు హిమశిఖరముంత ఎత్తైనవాడు. అతని కీర్తి కొండంత. అతని ఛాయ తొలి సూర్య కిరణం. అతని చూపులు మంచు వర్షం. అతడు గంగానదంత పొడవైన వాడు. ఆకాశం నుంచి నాకోసం నడిచి వచ్చిన వాడు. తన బాటలో నాకింత చోటిచ్చిన వాడు.
అతని రూపం, మాటలు నా రక్తంలో ఇంకిపోయి కలానికి కొత్త భాష నేర్పాయి. అదే నా ప్రేమ భాష. నా కవితల్లో నిబిడీకృతమైన అంశం ఇంకేమీ లేదు, నా ప్రతిభా లేదు, అతని ప్రేమ తప్ప. నేను గొప్పగా రాశానని ఎవరైనా చెబితే... ఈ పదాలన్నీ అతని భ్రమలో పుట్టాయని చెబుతాను. అతని రూపంలో ప్రకృతి, నాపై వలకబోసిన ఈ ప్రేమనంతా దోసిళ్ళతో పట్టుకొని తలపై తలంబ్రాలు పోసుకుంటున్నాను.
కొండంత వేదనను నా గుండెలో దాచుకొని నన్ను నేను మన్నించుకునే సమయంలో... నా తండ్రిలా నన్ను వేలు పట్టి నడిపించిన వానికి, గుండెలో గుడి కట్టుకున్నాను. సాగే ఈ రచనలన్నీ అతనికోసం రాసుకున్న అష్టోత్తరాలు.
Thank you 🙏
✍️ Bhagyamati.
👌👌👌
రిప్లయితొలగించండిThank you
తొలగించండిNyccc👌👌👌👌
రిప్లయితొలగించండిThank you
తొలగించండిచాలా బాగున్నాయి మీ మాటలు
రిప్లయితొలగించండిThank you
తొలగించండి