నీ తీపి తలపులు నింపుకున్న ఆ తెల్లవారు జాముల తలుపులు, మళ్ళీ తెరవనా ప్రియా... మసక వెలుతురులో, మంచు తెరలలో, ప్రేమ పొరల మధ్య మనం ఆడిన దోబూచులాటలు... దొరకక నువ్వు తిరిగిన చెట్ల దారులు, దొరికి పోతూ జారిపోయిన నీ చేతి స్పర్శలు, మరల మరల నీ వెనక పరుగులీడిన నా అడుగులు. ఈ కొంటె తలుపులన్నీ మరల తెలుపనా ప్రియా...
నలువైపులా... విచ్చిన తోటలలో... తెంచి తెచ్చిన పువ్వుల గంపలు, మరుమల్లెల గుంపులు మనలను గుమికూడిన వేళ, తప్పించుకు త్రోవ లేక పట్టుబడ్డ మన బిడియపు కౌగిళ్ళను మరల తెలుపనా ప్రియా!.
నా కనులు దొంగిలించిన నీ మోమును, నీ కనుల దొర్లిన తేనెను మింగిన నా రెప్పలను, మరిగే పాల కడవలా... నురగలు కక్కే కడలిలా... నా మది చిలికిన నీ కవ్వపు నవ్వును మరల తెలువనా ప్రియా!.
వెన్నెలంత చల్లగా నీ చూపులు, వేసవంత వెచ్చగా నా పడిగాపులు ముసుగులు వేసుకుని, గుసగుసలా నీ స్వరము ఒక వరమై, నా చెవులను చేరే సమయాన... అవధులు లేని ప్రేమని అనంతమైన అనుభూతిని అలవికాక అందుకున్న ఆ నిమిషాలను మరల తెలుపనా ప్రియా!.
ఈ చూపుల సమన్వయంలోని మకరందాన్ని దొంగిలించగా పూల పొదరిల్లను వదిలి వచ్చిన మధుకరం గుర్తుందా? దాని దారి మర్లించలేక మనం పడ్డ పాట్లు గుర్తున్నాయా? చిగురు పెదవిని చిదిమి దీపమెలిగించి, ఆ జిత్తులమారి తేనెటీగను తరిమికొట్టిన తగవులను మరల తెలుపనా ప్రియా!.
నీ నవ్వు మెరుపులు కప్పుకుని మెరిసిపడ్డ నక్షత్రాలు, ముత్యాల వానలా... నా గుండెపై పడి మెల్లగా... పుడమిపై కమ్ముకున్న వేళ, ఆ శరత్కాలపు చంద్రునిలా తెల్లబడి, ప్రకృతంతా... సృష్టి రహస్యములతో నిండిపోయిన ఆ రేయి గూర్చి మరల తెలుపనా ప్రియా!.
నా అనుమతి కోరక, నీ కరమందుకొని విశ్వవిలాసము పొందిన నా బిడియపు సడలిని, నీ మాయా చరణముల వద్ద నా మది ఓటమిని, అర విచ్చిన సిగ్గు మోమును నీ రెక్కల చాటున దాచుకున్న ఆ నడి రేతిరి సంగతులు మరల తెలుపనా ప్రియా!.
కలలో నీవు కలమై రాస్తూనే ఉన్నావు. నా కలవరింతలకు గిలిగింతలు పెడుతూనే ఉన్నావు. ఉక్కిరిబిక్కిరి అయ్యే ఈ ఊహల్లో ఉలిక్కిపడి లేచాను. గుండె నెత్తికెళ్ళావు, నీ కలానికి కట్టుకుని. పోవోయ్... నువ్వెప్పుడూ పోకిరీ వాడివే!
Thank you 😊,
✍️ Bhagyamati.
మనసు లో ఉవ్వెత్తున లేచి పడే ఆలోచనా తరంగాలు కు అక్షర రూపం నిచ్చి , క్రమమైన కూర్పుతో నేర్పుగా మలచిన తీరు బాగుంది.
రిప్లయితొలగించండిGreat compliment, thank you
తొలగించండిSuper poetry ✨ మనసు ను తాకుతుంది .
రిప్లయితొలగించండిThank you
తొలగించండి