చెరిగిపోయే జ్ఞాపకాల్ని చెదిరిపొనీకుండా... చేతులలో పట్టుకుని పుస్తకమంతా అలుముకున్న ప్రేమ కావ్యం ఇది. ఇది నాపై నాకున్న ప్రేమో... అవతలవారిపై పెంచుకున్న ప్రేమో... పొడిబారిన మనసులో... కన్నీటితో తడిచిన తలపులను మళ్ళీ మళ్ళీ వల్లె వేసుకుంటూ... రాసుకున్నాను. ఇవి ఒక రాయి రాసుకున్న రాతలు... రాయి నుదిటిపై చెదిరిన గీతలు...
నా మాటలను ఆపేసి ఆ సముద్రం వైపే చూస్తున్నాను, అందులో నాకు గోచరించని రహస్యమేదయినా ఉందని. అది నా వర్తమానాన్ని శాసిస్తూ, భవిష్యత్తును బోధిస్తూ ఉందని!. నా బాధ లోతు, ఈ సముద్రపు లోతుకేమీ... తక్కువ కాదు. అట్టడుగులో రత్నగర్భ మున్నట్లు, నా గుండెలోనూ... ఓ గుడి దర్శనమిచ్చింది. మనుషుల్లో దేవుణ్ణి చూస్తూ... వెంబడిస్తున్నాను. దేవుడు దొరికే వరకు వెంబడిస్తాను.
గుండె లోతుల్లోంచి వచ్చే గురుతుల్ని, ఎండుటాకుల్లా... రాలిపోయే ప్రేమ లేఖలని, అన్నింటినీ ఆత్మ కేసి కుట్టుకుని, వాస్తవానికి దూరంగా... గతంలోనే మిగిలిపోయిన నా గొంతును సరిచేసుకుని కొత్త పాటలు పాడటానికి తయారవుతున్నాను. ఏ పల్లవి నన్ను పల్లానికి చేరుస్తుందో? ఏ చరణం నాకు చరమగీతం పాడుతుందో? ఏ పాట నా నోట ప్రాణధారగా నిండుతుందో? నాకే తెలియని సందిగ్ధంలో రాసుకున్నాను, ఈ అంతరంగాన్ని.
ఒంటరినైన సమయంలో, నా మనసు అడిగిన ప్రశ్నకు నా మెదడు మంచు గడ్డైంది. ఉపాయం లేని అపాయంలో మనసు కొట్టుకుంటోంది. సాయంత్రపు సంధ్య గాలిలో నడక సాగించాను. కింద మెత్తటి ఇసుక, పైన ఎర్రటి ఆకాశం, మధ్యలో చల్లని గాలి. సాగర తీరంలో ఇసుక తిన్నె పై కూర్చుని చూస్తున్నాను. అలలొచ్చి ఇసుకను అలికి వెళుతున్నాయి. ఆకాశంలో పక్షి రెక్కల్లో... స్వతంత్రం, గాలిని చీల్చుకుని వెళుతోంది. బిక్కు బిక్కుమంటూ నా గుండె బిడియానికి, భయానికి మధ్య కొట్టు మిట్టాడుతోంది. గుప్పెడంత గుండెను ఇసుకపై జల్లి, నా మనసు బొమ్మ గీసాను. నే చూసేలోపే అల వచ్చి యెత్తుకెళ్ళింది.
చేతి వేళ్లలో ఇసుక మరకలను నీటిలో తుడుచుకున్నాను. గుండెలో జ్ఞాపకాల మరకలు కన్నీటితో కడగలేకున్నాను. నిండుకున్న గుండె, నిండియున్న కన్నులు, నిన్న గడిపిన జంట జ్ఞాపకాలలో... ఒంటరై మిగిలాను. జంటగా లేనని చెప్పలేను, నా ఆత్మతో... నే కలిసే ఉన్నాను. జంట పక్షుల మధ్య ఒంటరిని మాత్రమే నేను!. వెంట నడిచే నీడనే... నా తోడనుకున్నాను, అంతముండని ప్రేమ నాలో నేను వెతుకున్నాను. బయటనుండి వచ్చేది వెళ్ళిపోతుందని, లోపల ఉన్న ప్రేమ, నాలోనే ఉండిపోతుందని... అనుభవం అర్థమయేట్టు నేర్పింది.
Thank you🙇🏻♀️,
Bhagyamati ✍🏻
సముద్రమంత విశాలమైన మనస్సు ఉండి బరువెక్కిన గుండె తో మీరు ఎందుకు ఎప్పుడు భాద పడుతున్నారో అర్ధం కావటం లేదు.... మూగ జీవాలను ప్రేమించే మీరు సంతోషం గా ఉండాలని కోరుకుంటూ మీ ....
రిప్లయితొలగించండిThank you 🙂
తొలగించండి👍
తొలగించండిThank you
తొలగించండి