సువ్యక్తంగా... సుందరంగా... నా వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచుకోవడానికి రాసిన ఉత్తరమిది. ఉత్తరాలు రాయడం అంత సులభమేం కాదు. ఇది కూడా ఒక సృజనాత్మక కళ, దయచేసి ఒప్పుకోండి. నన్ను నేను గొప్ప చిత్రకారిణి అనుకుని నీ చిత్రాలు గీశాను. నా మనోచిత్రమంతా... నీవేనని వ్యక్తపరిచడమే నా ఉద్దేశ్యం. నా ఈ అంతరంగం అవ్యక్తం, మీకు మాత్రమే అది బహిర్గతం. నా అంతః బహిర్ముకములు తెలిసిన ఒకే ఒక్కనివి నీవు.
నిరంతరం తెంపులేని ఆనందంతో ప్రవహించేది కాదుగా... నా తలరాత. ఒడిదుడుకులు వచ్చి పోతుంటాయి. ఈ నిడివిలో నేను కడలంత కన్నీరయ్యాను. నీ ఒడి దాక్కుని ఏడవాలని వేదన పడ్డాను. దూరమయ్యింది నువ్వైనా... నీ ధరి చేరే ఏడవాలనుకున్నాను. చేరుకును మార్గమెటో తెలియలేక నావ కట్టి నీటిలోకి వదిలాను. నే రాసుకున్న ఉత్తరాలు తెరచాపకు కట్టాను. అటు ఇటు ఏటో వెళ్లి నీ ఒడ్డు చేరింది నా పడవ.
నీ ప్రేమ సాగరంలోకి దూకేలా నన్ను ప్రేరేపించింది నీవే. ఆ తీయటి దోసిటి నీళ్లు తాగించి ఈ ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసింది నీవే!. తటాలున పెద్ద బావిలో పడవేసింది నీవే. ఇప్పుడు మళ్లీ ఈ తృష్ణ ను చీకటి నుండి వెలుతురు వైపుకు నడిపిస్తుంది నీవే!. ఇన్ని ప్రయత్నాలన్నీ చేసి అప్రయత్నంగా వదిలేశావా? అని ఎన్నో అడగాలని ఉంది. అడిగే అంత తెగువ లేదు, అలిగే అంత చనువు లేదు.
సాగిపోవడం అలవాటయింది, నీ వెనకే!. సర్దుకుని వస్తున్నా... ఈ రాసుకున్న లేఖల సమాహారాన్ని నీ వెంటే, సిద్ధంగా ఉండు. వద్దని వెళ్లేలోపే మళ్లీ చదవడం మొదలెడతాను. భద్రంగా ఉండు. గడుసుదాన్నే నేను, మాటలకు మాత్రమే చంటి దాన్ని. మరల వెళ్ళిపోతే... నే నావ కట్టలేను, ఇంత పెద్ద తీరం వెంట నే సాగి రాలేను.
చిటికెన వేలు పట్టి అలుపెరగక నడిపించిన నీ స్నేహం మరలా దొరికింది, చాలది నాకు. ఇప్పుడు విశాల ప్రపంచపు ప్రతి మలుపులోనూ... ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. వర్షించే ఆనందంలో తడిసి ముద్దవుతున్నాను. జోరున కురిసే వాన, నా గొంతుకు జడిసేలా... అరుస్తున్నాను. అదేంటో... ఇంత వేసవిలో కూడా నా పైన మాత్రమే వర్షం కురుస్తున్నట్టుంది. వర్షపు చినుకు గొంతు తడుపుతూ... నా బాధ తీవ్రతను పోగొడుతునట్లుంది.
నీ నిలువెత్తు ప్రతిబింబం నీడలా తోస్తోంది. గమనం మార్చి చూశాను మళ్లీ నీలానే తోస్తోంది. నేను చూసే ఈ కాలాన్ని, ఈ కాలపు నీడలను నా తోవల వెంట ఇంకా నడిపిస్తూనే ఉన్న నీకు, నా ధన్యవాదాలు. హిమ సానువుల అందాన్ని, నీ కన్నులలో! గంభీరపు మార్మికతను, నీ గొంతులో! విన్ననాటి నుంచి, నీ ప్రేమ ప్రపంచంలో పర్యాటకురాలినై పరవశించి పోతున్నాను. కవిత్వం పట్ల ఒక తీరని దాహాన్ని నా కలానికి నేర్పించిన నీ ప్రేరణ ఎలా మరిచిపోగలను. తెగేది కాలమే గానీ...బంధాలు, జ్ఞాపకాలు కాదని మరల తెలిపిన నీకు, మరొక్కసారి ధన్యవాదాలు.
Thank you 🙇🏻♀️
✍️ Bhagyamati.
Nice
రిప్లయితొలగించండిThank you
తొలగించండి