భిన్న అస్తిత్వాలతో నా కథా సాహిత్యాన్ని విస్తరించాలంటే, కొత్త కథా వస్తువులు కావలెనా? నా కలానికి, కాగితానికి?. నా మనసుపై తిలకమద్దిన అతని వేలిముద్రలు చాలవా? తిమిరంగా రెప్పవేయక చూసే అతని చూపులు చాలవా!. కడలి పొంగిన అలనై దూసుకురానా... ప్రేమ కెరటమై కాగితంపై ఎగసిపడనా...
నా ప్రపంచంలో ఇద్దరే బలవంతులు నా ఊహలో నీ రూపు, నీ రూపునే రాసే నా కలం. ఈ లోకంలో అలసిపోక సంచరించే ఆ ఇద్దరు బాటసారులు... సూర్యచంద్రులనడుగు, ఇది నిజమో కాదో చెబుతారు. వేల రాళ్ల మధ్య విభిన్నంగా ప్రకాశించే రత్నమై నీవు, మిరుమిట్లు గొలుపుతూ నా కనులకు తారసపడ్డావు. ఆనాటి నుండి విచ్ఛిన్నమైన కనుపాప ఏ రాయిని చూడలేకుంది. నా దేశమంతా రాళ్ళు, మట్టితో నింపేసి, పరదేశం వెళ్ళిపోతావా?.
అబద్దానికి దూరంగా నిజానికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే జీవితం బాగుంటుందంటారు. కానీ నేను ఊహలకు దగ్గరగా వాస్తవానికి దూరంగా బ్రతుకుతుంటాను. దూరమైన వాస్తవాన్ని నాకు దగ్గరగా చూపి, నా ఊపిరిని నిలిపి ఉంచేది ఈ ఊహే!. దేవుడనేవాడు మనిషి ఊహల్లో సృష్టింపబడిన వాడైతే, వాస్తవం కాకపోతే నీవు కూడా దేవునివే. దేవుడనే మాట కల్పితమైతే, నీపై నా ప్రేమ కూడా కల్పితమే. నా దృఢవిశ్వాసం నీకు గుడి కట్టింది. చందనపు ముద్దలా నీ రూపు దిద్దింది. పసుపు కుంకుమలు నా మోము నలంకరించలేవు, నీపై పగటి కలలు మాత్రమే నా కనులను వెలిగించగలవు.
నిన్ను ప్రశ్నించి, విమర్శించి, దూషించి, ద్వేషించి... అన్నింటినీ ఆరాధించింది కూడా నేనే. మరచుట తెలియని మనసు నాది మన్నించలేవా... మగువను కాదా!. పూలపైన విరుపులెందుకు? జాలువారిన తేనెలుండగా... నువెళ్ళిపోతే, నే మరిచిపోతానా? నా మనసుకు పట్టేసి ఒక పట్టాన వదలని నీ ఊహలను నాకు కట్టేసుకున్నాక!, నువ్వే నాకిక అని ఓట్టేసుకున్నాక!.
నా మెదడుకు హృదయం లేదు, నీ మనసు నీ ఇష్టం రా! ఇచ్చుకో, దాచుకో ఏమైనా చేసుకో అంది. ఇప్పుడు నా మనసు మనుగడ కోసం పోరాటం చేస్తోంది. తరాల కోపమంతా... నీ ముక్కు మీదే పెట్టుకుని ఏం చేస్తావు? నీ తరుణిని కాదా మన్నించలేవా!. మనసారా నిన్ను కీర్తించి పలికిన మాటలను మరిచిపోయావా. నా కలలు వలచావుగానీ... నా ప్రేమను కాలిదన్నావా? నీ ప్రేమ రుచి చూపి ఏటో వెళ్ళిపోతావా?!.
ప్రపంచంలోని తీయదనం అంతా నీ మోమి పైనే చూసాను. అది చప్పరించి నా అక్షరాలలో చూపాను. నీ కళ్ళలోని ద్రాక్షరసం ఇంద్రలోకంలోనైనా దొరుకుతుందంటే చెప్పు, ప్రాణం త్యజించి పరలోకం వస్తాను. నువ్వలిగి అంతరిక్షం వెళ్ళిపోతే... భూమిపైన కాంత లేమవుతారు? నీ పెదవులంటిన అమృత పానం చిలకరిస్తే... వీరు దేవకన్యలవుతారు.
నా కలం నిన్ను గుచ్చుకుంటుందో లేక ఏకంగా కోస్తుందో తెలియదు నాకు. నీ మనసిమ్మని అడగలేదెప్పుడూ, నిన్ను మాటిమ్మని కోరలేదెప్పుడూ. మరల మరలా... మాటాడాలని, మైమరిచి నీ మొమునే చూడాలని, ఒక్కింత ఆశ మరి. మినుగురులా నా కన్నీరు, ఈ చీకటి బాధలో మెరుస్తుంటే, వెలుగులు నింపుతావా... నా చుట్టూ. వెచ్చగా అల్లుతావా... నా జట్టు.
Thank you ☺️
✍️ Bhagyamati.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి