ఒక కవి విమర్శించారు. మీకు "అతనిపై ప్రేమ", "అతని అందం" ఈ రెండే కథా వస్తువులా? కవులంటే నవరసాలను పలికించాలి. మీరు మాత్రం ఈ రెండింటితోనే నెట్టుకొస్తున్నారు అని. నేను కవిని కాదు, మీ కవి సమూహంలో కూర్చునే అర్హత నాకు లేదు, అవకాశము నాకొద్దు. నా కలం నా గుండె భారాన్నే మోస్తుంది. నా ఇంటి కిటికీలోంచి బయట సమస్యల్ని వీక్షించే సమయమే నాకు లేనప్పుడు ఏ ప్రేరణతో నేను స్పందించగలను.
ఒక కవికి హృదయ స్పందనే... రసస్పందన. ఈ కాలం నాకు అతని వల్ల కలిగిన ఈ గుండె గాయాన్ని మాత్రమే తెలియజేస్తుంది. మరే స్థితిగతులు నన్ను ఏ మార్చకున్నాయి. లేతప్రాయపు కాంక్షలేవీ నా కలంపై కదలకున్నాయి. నా ప్రతి కదలికను గమనించే లోకుల ఆంక్షలే మెదడును తొలుస్తున్నాయి. గుండె నెత్తుటి ఏరై ప్రవహిస్తోంది. పెదవులపై చిరునవ్వు మాత్రం నిరంతరం చిగురిస్తోంది.
విడిపోయామనే నిజాన్ని ఒప్పుకోలేక, ఏకాంతంలో కొట్టుమిట్టాడుతున్న ఒంటరితనానికి తన రూపు చూపుతున్నాను. రోజు గుడిలో వెలిగించే దీపాలు నాలో వెలుగులు నింపట్లేదు, దీపపు కాంతుల మధ్య మెరిసే చీకటే నా కనులకు తారసపడుతుంది. నా రచనల్లో వెలుగునీడలను రెండింటినీ రాయాలనుకుంటాను. కానీ చీకటే ఎక్కువగా కనిపిస్తోందేమో!. పాత కొమ్మకు పూసిన కొత్త చిగురును నేను. ఈ లేత ఎరుపు నా పెదవులది కాదు నా గుండెది.
విడిపోయిన వాని వివరము లడగకండి. విడివడ్డానని విమర్శించకండి. పోనీలేద్దూ... అంటూ పరామర్శించకండి. వినయంగా నన్నేదో రాసుకోనియ్యండి. విషాదం నా కవితల్లో తాండవిస్తే... లోకులు పూరేకులై విచ్చుకునే కాలమిది. ఎన్ని అరచేతులున్నాయో! నా చెంపలపై కన్నీరు తుడవడానికి. ఎన్ని ఓదార్పు మాటలున్నాయో! నా చెవులు వినడానికి. ప్రేమే ఒక పెద్ద అబద్ధం. మళ్ళీ ఈ జాలి, బాధ, ఓదార్పు... దానిని మించిన దరిద్రం. ఇంకా నేను ఏ శరీర భాగాన్ని కోల్పోలేదు. కేవలం గుండెకు గాయం చేసుకున్నాను, అది కూడా స్వతహాగానే.
దయచేసి కవులారా వినండి!. నేను ప్రజాకవిని కాదు. మనసు కవినీ... కాదు. ఇంకా సరళంగా, సులభంగా చెప్పాలంటే అసలు కవినే... కాదు. సమాజంలోని దురాచారాలను, దుర్మార్గాలను ఎత్తిచూపి మీ రక్తం మరిగించలేను. మీరు శ్రీ శ్రీ కవితలు చదువుకోవచ్చు. నా కవితల్లో... నాయుడు బావ విరహము, ఎంకి అందము కనిపించవు. నండూరి వారి కవితలు చదువుకోండి. స్త్రీలు సమాజంలో పడే మానసిక రొదలు, శారీరక వ్యధలు కనిపించవు. చలం రచనలు చదవండి. లాలిత్యం, పాండిత్యం అసలే రాయలేను. దేవులపల్లి పాటల చదవండి.
ఓదార్చుకోనీయండి! నన్ను నా కలంతో... ఈ అక్షరాలకు ఏమీ తెలియదు, నా ప్రస్తుత స్థితి తప్ప. వదిలేయండి నన్నిలా... ప్రపంచపు నిశ్శబ్దపు మూలల్లో ఏదో ఒకచోట. కత్తేమీ నూరుకొని రావడం లేదుగా! మీ కంఠం మీదకు. కలమే కదా! అలా ఎలానో బ్రతకనీయండి. కరుకుగా ఉంటే మళ్లీ చదవకండి. మీ కవి సమ్మేళనానికి నన్ను పిలవకండి.
Thank you 😐,
✍️Bhagyamati.
Yes absolutely 💯 .Baga rasaru
రిప్లయితొలగించండిThank you
తొలగించండి