ప్రతి ఉదయం నన్నిలా... పలచ పలచని కిరణాలతో... పలకరించే సూర్యునికి శుభోదయం. చటుక్కున కిటికీలోకి దూరి, వెచ్చని చేతులతో... నా చంపగిల్లే భానుడికి ఉషోదయం. నిన్నటి గాయాలకు ఉష్ణ లేపనం రాసే నీ మమకారానికి మహోదయం.
జీవితం అంటే ఆకలేసేంత ఆశ లేకపోయినా... రోజు నీ నిట్టూర్పులతో... ఇలా కొత్తగా లేవడం, కాఫీ కప్పుతో పైకి చూస్తూ-చూడలేక రెప్పవాల్చడమే! నా తొలి ప్రణయం. నీలి కురులను ఇలా... నయగారంగా... చేతి వేళ్ళతో ఒద్దికగా సర్దుతూ నీకేసి చూడడమే నీతో నా సల్లాపం. చేతులను పైకి చాచి ఒల్లిరుచుకుంటూ... నిన్ను కవ్వించడమే నా కాలక్షేపం. కనుపాప పసిపాపేమో! నిన్ను చూడలేక అరచేతిలో దాక్కుంటే, నీ వెచ్చదనానికి విచ్చిన పూలన్నీ నా కొంగులోకి కోస్తున్నాను. మేఘమొచ్చి పోయే వేళ, నీ అందాన్ని వర్ణించ చూస్తున్నాను.
సంధ్య వేళల చీకటి అంటే భయమా నీకు? కొండల చాటున దాక్కుంటావు. చంద్రుడంటే అసూయా నీకు? తను వెళ్లే దాకా రావు. చిన్ని చుబుకాన్ని చేతులలో చాచుకుని, ఇట్టే నిన్ను చూస్తుంటాను. రోజూ...వస్తావని తెలిసిన, ఈవేళ వస్తావా? రావా? అనే సందిగ్ధంలో!. పవిట కొంగును పంటి కింద పెట్టుకుని నీ ఎర్రటి రూపు చూడాలని, పడిగాపులు పడుతుంటాను. వచ్చేయవా త్వరగా... నిన్న చీకటి కమ్మిన పాత మైకపు పొరలను చీల్చుకుని, అచ్చం మా అమ్మ నుదిటిన ఎర్ర సింధూరమై. వచ్చెల్లి పోవా... ఒకసారి! ఒడిసి పట్టుకోనులే సొగసుగాలమేసి.
తలగడపై చెదిరిన ముంగురులతో, గజిబిజిగా నడుస్తూ వచ్చి గవాక్షాలలోకి తొంగి చూస్తున్నాను. అల్లంత దూరాన ఆ కొండల మధ్య నుండి ఎదిగే నిన్ను. కోనేటిపై నువ్వు జల్లిన పసిడి రంగును, పచ్చని పైరు పై నీ వెలుగునీడలను, తామర పూలలో తీపి పులకింతలను. చురుకుగా గుచ్చే నీ చూపుకి మావి చిగురు ఎర్రబడ్డది. నా మోము మందారమయ్యింది. ఈ వెచ్చని వేకువలో మరొకసారి నేను యవ్వనం నింపుకున్నాను. మరలా కొత్తగా జన్మించాలని కోరుకున్నాను.
శీతాకాలపు మేఘాలు నీపై ముసుగు వేసి దోబూచులాడే వేళ, నువ్వు నాకోసం వస్తావా? స్వర్గం నుండి వడివడిగా!. ముసలి మూర్ఖుల వలె ఈ మసక మబ్బులు నిన్ను నా నుండి దూరం చేయాలని చూస్తాయి. అయినా పరదాల వెనుక నుండి చూస్తున్నాను, నీ పసిడి కాంతులను నేనే తొలిగా పీల్చుకోవాలని. నిన్న సంద్యవేళలో నువ్వు విడిచి వెళ్లిన నిట్టూర్పు వాసనలు ఇంకా నాతోనే ఉన్నాయి. ఆ కొండ చాటుకు వెళ్ళిపోకని కాళ్లు పట్టుకు బతిమిలాడిన వెళ్ళిపోయావు. ఇప్పుడు చూడు, ఆ వయసు మళ్ళిన మేఘం నిన్ను అడ్డుకుంటోంది.
మిరమిట్లు గొలిపే నీ అందం మాత్రమే నన్ను అందురాలిని చేస్తుంది. కనులతో నాకేం పని ఉంది? నువ్వు కానరానప్పుడు. నీ కిరణాలను కౌగిలించుకొని విలాసంగా ప్రకాశిస్తాను. నీ చుట్టూ ఉన్న కోటి తారల లాగే... నీ కాంతి సోకి మెరుస్తుంటాను. మన కలయికలో ఆకాశం ఉల్లాసంగా నవ్వాలి.
Thank you 🌞,
✍️ Bhagyamati.
Just now feels like rise of the sun by reading urs poetry
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి