స్త్రీ కవిత్వం అంటే స్త్రీ వాదం కాదు. సున్నితత్వం కాదు. అద్దంలో ఆమె అందం యొక్క చిరునామా కాదు. వెన్నెల్లో ఆడపిల్ల కథలా... రూపు కానరాక ఆడే అల్లరి ఆట కాదు. వయసు, వయ్యారం, సొగసు, సౌమ్యత... ఇవి మాత్రమే ఆడది కాదు. అనుకువలో అరనవ్వునవ్వి, అరచేతిలో ముఖం దాచుకోవడం కాదు. అల్లారు ముద్దుగా నాన్న ఎదపై ఆడుకునే చిట్టి అడుగులు కాదు. ఇల్లంతా తిరిగే అందెల అడుగుల చప్పుడు మాత్రమే కాదు. అమ్మ కొంగు పట్టుకుని అత్తారింటి ఆరండ్లు చెప్పుకునే అమాయకపు ఆడపిల్ల కాదు.
స్త్రీ అంటే వండి వార్చి వడ్డించే అమ్మ చేతి గాజుల చప్పుడు. అమ్మానాన్నలను వదులుకొని అతని కోసమే బ్రతికే గుండె చప్పుడు. చీకటింట వెలుగులు నింపి గూటిలోనే మౌనంగా ఉండిపోయే గోరంత దీపం. మన అమ్మ ఆచూకీ నాలుగు గోడల మధ్య, ఆలి ఆచూకీ ఆఫీసు ఫైలు దాకే, మరి కూతురు ఆచూకీ? నాన్న కలల వాకిటి దాకే!.
ఇంతలో ప్రియుని ప్రేమలో పిచ్చితనం, తల్లిదండ్రులను వ్యతిరేకించే గడుసుదనం, అన్నీ గెలిచి అత్తారింటికి పోతే... అక్కడ మళ్లీ మరో గెలుపు పందెం. అమ్మగా, ఆలిగా అన్ని గెలిచాం అనుకునే లోపు అనుమానం, అపార్థం. మళ్లీ ఓడిపోతాం. స్త్రీ అంటే గెలుపోటముల యుద్ధం. ఏ యుద్ధమూ... మనుషులను గెలవలేదు, మట్టిలో కలిసిపోయిన మనుషుల దేహాలను తప్ప.
ఆడదాన్ని మగాళ్లు పంచుకునే ఆదికాలం నుంచి, అంగడి వస్తువుగా అమ్మే కాలం నుంచి, అంతరిక్షంలో అడుగుపెట్టే ఈ కాలం దాకా... ఏం మారింది? సమాజం. ఒళ్ళమ్ముకునే ఆడది అమ్మ కాదా? ఒడిన బిడ్డను కన్నీటితో ఓదార్చగలదా? ఆకలి బాధల అవసరం, అక్షరం రాని ఆమెకు ఆ దారి చూపింది. అక్షరం వచ్చిన చేయి వారికి అడ్డుగా, అండగా నిలిచింది. ఈ అడ్డుగా నిలిచిన వారిలో పురుషోత్తములు ఉన్నారు. అడుగుల కింద తొక్కిన పురుషులు ఉన్నారు.
అమ్మ ప్రేమను ఆలింగనం చేసుకునే సమాజం, ఆడదాని ఉనికిని మాత్రం ప్రశ్నిస్తూనే ఉంది. గుండె చమ్మగిల్లి, గొంతు మూగబోయి, పెదవి చాటున విలపించే ఆడవాళ్లు, తరాలుగా... అక్షరాలతో యుద్ధం చేస్తున్నారు. స్త్రీతత్వం అంటే ఆమె ఔన్నత్యం. ఆమె అమ్మయినా, అమ్ముడుపోయిన బొమ్మయినా... స్త్రీ తత్వం అంటే సమాజపు దృష్టి కోణం. కాగితంపై అంతరంగాన్ని ఆవిష్కరించే ఆమె భావుకత.
ప్రేమ కవితలు రాస్తే, వలలో పడడానికి సిద్ధమని కాదు. స్త్రీవాదం రాస్తే, పురుష ద్వేషి అని కాదు. ఇల్లు, ఆఫీసు, అభిరుచులు, ఆశయాలు అన్నింటితో సమయాన్ని చేధిస్తున్నాం. ఇవికాక మళ్ళీ సాంప్రదాయపు సంకెళ్లను, మణికట్టుకు తగిలించుకుంటే కలం కదలదు. స్వేచ్ఛాయువులు పీల్చుకుంటేనే కలమైన, గళమైన కదులుతుంది. కదలనీయండి కలాన్ని, కవి రూపమైన ఆమె గళాన్ని.
Thank you 🙏,
✍️ Bhagyamati.
సూపర్
రిప్లయితొలగించండిThank you
తొలగించండిNice interpretation
రిప్లయితొలగించండిThank you
తొలగించండిNice
రిప్లయితొలగించండిThank you
తొలగించండిThank you
రిప్లయితొలగించండి