ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మరల తెలుపనా ప్రియా! (98వ బ్లాగ్)

నీ తీపి తలపులు నింపుకున్న ఆ తెల్లవారు జాముల తలుపులు, మళ్ళీ తెరవనా ప్రియా... మసక వెలుతురులో, మంచు తెరలలో, ప్రేమ పొరల మధ్య మనం ఆడిన దోబూచులాటలు... దొరకక నువ్వు తిరిగిన చెట్ల దారులు, దొరికి పోతూ జారిపోయిన నీ చేతి స్పర్శలు,  మరల మరల నీ వెనక పరుగులీడిన నా అడుగులు. ఈ కొంటె తలుపులన్నీ మరల తెలుపనా ప్రియా...


నలువైపులా... విచ్చిన తోటలలో... తెంచి తెచ్చిన పువ్వుల గంపలు, మరుమల్లెల గుంపులు మనలను గుమికూడిన వేళ, తప్పించుకు త్రోవ లేక పట్టుబడ్డ మన బిడియపు కౌగిళ్ళను మరల తెలుపనా ప్రియా!.


నా కనులు దొంగిలించిన నీ మోమును, నీ కనుల దొర్లిన తేనెను మింగిన నా రెప్పలను, మరిగే పాల కడవలా... నురగలు కక్కే కడలిలా... నా మది చిలికిన నీ కవ్వపు నవ్వును మరల తెలువనా ప్రియా!. 


వెన్నెలంత చల్లగా నీ చూపులు, వేసవంత వెచ్చగా నా పడిగాపులు ముసుగులు వేసుకుని, గుసగుసలా నీ స్వరము ఒక వరమై, నా చెవులను చేరే సమయాన... అవధులు లేని ప్రేమని అనంతమైన అనుభూతిని అలవికాక అందుకున్న ఆ నిమిషాలను మరల తెలుపనా ప్రియా!.  


ఈ చూపుల సమన్వయంలోని మకరందాన్ని దొంగిలించగా పూల పొదరిల్లను వదిలి వచ్చిన మధుకరం గుర్తుందా? దాని దారి మర్లించలేక మనం పడ్డ పాట్లు గుర్తున్నాయా? చిగురు పెదవిని చిదిమి దీపమెలిగించి, ఆ జిత్తులమారి తేనెటీగను తరిమికొట్టిన తగవులను మరల తెలుపనా ప్రియా!.


 నీ నవ్వు మెరుపులు కప్పుకుని మెరిసిపడ్డ నక్షత్రాలు,  ముత్యాల వానలా... నా గుండెపై పడి మెల్లగా... పుడమిపై కమ్ముకున్న వేళ, ఆ శరత్కాలపు చంద్రునిలా తెల్లబడి, ప్రకృతంతా... సృష్టి రహస్యములతో నిండిపోయిన ఆ రేయి గూర్చి మరల తెలుపనా ప్రియా!.


నా అనుమతి కోరక, నీ కరమందుకొని విశ్వవిలాసము పొందిన నా బిడియపు సడలిని, నీ మాయా చరణముల వద్ద నా మది ఓటమిని, అర విచ్చిన సిగ్గు మోమును నీ రెక్కల చాటున దాచుకున్న ఆ నడి రేతిరి సంగతులు మరల తెలుపనా ప్రియా!.


కలలో నీవు కలమై రాస్తూనే ఉన్నావు. నా కలవరింతలకు గిలిగింతలు పెడుతూనే ఉన్నావు. ఉక్కిరిబిక్కిరి అయ్యే ఈ ఊహల్లో ఉలిక్కిపడి లేచాను. గుండె నెత్తికెళ్ళావు, నీ కలానికి కట్టుకుని. పోవోయ్... నువ్వెప్పుడూ పోకిరీ వాడివే!


Thank you 😊,

✍️ Bhagyamati.









కామెంట్‌లు

  1. మనసు లో ఉవ్వెత్తున లేచి పడే ఆలోచనా తరంగాలు కు అక్షర రూపం నిచ్చి , క్రమమైన కూర్పుతో నేర్పుగా మలచిన తీరు బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. Super poetry ✨ మనసు ను తాకుతుంది .

    రిప్లయితొలగించండి
  3. చలం ,స్త్రీ జాతి కోసం తపించి తపించి స్త్రీ లా ఆలోచించి, స్త్రీలలో మమేకమై, తానూ...ఓ స్త్రీ అయితే బాగుండునని నిలువరించి...పలవరించి...... మరణించి మరలా మరో జన్మలో నీలా పుట్టాడేమో బాసుమతీ.
    నీ బాలీవుడ్కు నా పాదాభివందనం

    రిప్లయితొలగించండి
  4. నీ బావుకతకు పాదాభివందనం

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మొదటి ప్రేమ... మా నాన్న!

  ఒక అమ్మాయి ఏ వయసులో అయినా ఉండొచ్చు కానీ ఆమె ఎప్పటికీ తన తండ్రికి చిన్ని యువరాణిగానే ఉంటుంది.  తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న ఈ ప్రత్యేక బంధం... ఆరాధ్య బంధం!.  ఒక తండ్రి తన కూతురిపై ఉంచే హద్దులు లేని ప్రేమ ఎప్పటికీ తిరిగి చెల్లించలేనిది.   బెస్ట్ ఫ్రండ్ తో షాపింగ్:  నేను రత్నం జూనియర్ కాలేజి లో చదివేటప్పుడు కాలేజి వ్యాన్, ఇల్లు తప్ప ఏం తెలియదు. డిగ్రీ కి వచ్చాక న బెస్ట్ ఫ్రెండ్ శ్వేత తో మొదటిసారి బయటకి వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళడం, నాన్నకి trunk road లో కనిపించాను. నా మైండ్ బ్లోక్ అయ్యి రెడ్ అయ్యి, బ్లూ అయ్యింది. మా నాన్న మాత్రం సింపుల్ గా షాపింగ్ కి వచ్చావా? డబ్బులు ఉన్నాయా? అంటూ 2000 ఇచ్చేసి వెళ్ళాడు. నాన్న అంటే అంతే మరి, నెక్స్ట్ లెవెల్.  నేను పెద్ద చిరంజీవి అభిమాని ని. నాన్న ఫస్ట్ డే ఫస్ట్ షో చిరంజీవి మూవీ కి తీసుకుని వెళ్తాడు. నేను తిరుపతి లో M.SC చేసేప్పుడు నాకోసం dairy milk బాక్స్లు కొరియర్ చేసేవాడు. చిరంజవి గ్రీటింగ్స్ పంపేవాడు. నాన్నకి నేను ఎప్పటికీ చిన్న పిల్లనే. నేను అబద్ధాలు చెప్పను. ఇప్పటికీ చెప్పను. అందుకే నన్ను మా అమ్మ, నాన్న బాగా నమ్ముతారు. నా ప్ర...

అతడొక హిమశిఖరం

 జీవితంలో ఒక గాఢమైన ఇష్టం కలిగినప్పుడు ఆ ఇష్టం కలిగించే తన్వయత్వమే ప్రేమ. దాని ముందు ప్రపంచంలో మరేది ఎక్కువ కాదు. ఇప్పుడు మనసు దృష్టి ఇంకా విశాలమవుతుంది. ఇంకా హాయిగా... గొప్పగా... అనిపిస్తుంది. కానీ అతను మాత్రమే కనిపిస్తుంటాడు. అతని అందం, గుణం ఆపై ప్రేమ కప్పిన మోహం. జీవితంలోని ప్రతి అడుగు, ప్రతి కదలిక అతని కోసం ఏదోక త్యాగం చేయమంటాయి. త్యాగం ప్రేమకు దర్పణం. ఒక శిల్పి తన ఉలితో చెక్కినట్టు... అందమైన ముఖం, చక్కటి కనుబొమ్మలు, కళ్ళలో నెమలి కనుల మెరుపు, తీయటి గొంతు, మాటలలో ఒక సన్నని సంగీతం. సంభాషణలో మృదుత్వం, బింకం కొంచెం కొంచెంగా తొనికిసలాడుతుంటాయి. మనసులోకి తొంగి చూసే అతని ఆలోచన తీరు, ఇంకొంచెం అతని వైపు లాగుతుంటాయి. అప్పుడప్పుడు మాటలకు దొరకక ఎక్కడో వెళ్లి దాక్కుంటాడు. ఈ చిన్ని పావురం నీకోసం ఎన్ని ప్రేమ లేఖలు రాసిందో తెలుసా? అని అడగగానే, పెదవులపై విరబూసే చిరునవ్వే సమాధానం అంటాడు. ఆవేళ అతని కనులలో మెరుపేదో కదలాడుతుంది, అది మనసుకు మాత్రమే కనబడుతుంది. ఆ నవ్వు విని సిగ్గుపడి ముఖం ఎర్రబారిపోతుంది. ఎంతో ఎడబాటు నుంచి మనసును తేలిక పరిచే సంగీతం ఆ నవ్వు. ముఖాన్ని అరచేతుల్లో దాచుకొని అద్దానికి చూపె...

ఇది యుగాలనాటి ప్రేమ!.

 రాధంటే... ఉత్తదేహం కాదు, ఉత్త మనసే కాదు, రాధంటే ఆత్మ. కృష్ణుని ప్రేమలో లీనమైన ఆత్మ. ప్రపంచానికి అర్థం కాని ఎన్నో విషయాలలో వీరి ఇరువురి ప్రేమ కూడా ఒకటి. వీరి శృంగారం మానసికమే! కానీ ఆత్మసంబంధం. ఏ ప్రేమ కథకైనా వీరే ఆదర్శం. ప్రేమ యొక్క గొప్పతనం పట్టాలంటే... కథలో చిత్రించే పాత్రలను రాధాకృష్ణలను ఊహించే రాయాలి. కృష్ణుని పై ఆశలు రేకెత్తించుకొని మనసును కృంగ దీసుకున్న రాధ ప్రేమ లోంచి విరహం అనే పదం పుట్టుకొచ్చిందేమో?! ప్రేమంటే మనసంతా కాముఖత్వం పులుముకోవడం కాదు, దేహవసరాలను తీర్చుకోవడం కాదు, ప్రేమంటే విశాలత్వం, దైవత్వం, విరహం, తపన, వేదన, ఎడబాటు, త్యాగం, కృష్ణుని రూపు కోసం పరితపించే రాధ దినచర్య. అందుకే రాధాకృష్ణుల ప్రేమ ఉత్త ప్రబంధ కథగా కాకుండా... యుగాలు చెప్పుకునే గొప్ప ప్రేమగాధ గా మిగిలింది. ఒక ప్రేమ కథను పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టాలన్నా... ఒక ప్రేమ గీతాన్ని, స్వర్గాన్ని తాకేంత ఆనందంగా ఆలాపించాలన్నా... రాధాకృష్ణుల ప్రేమే ప్రేరణ. ఇంత గొప్పగా మనం ప్రేమించాలంటే రోజు మనసుకి మెదడుకి మధ్య దేవాసుర యుద్ధమే జరుగుతుంది, అయినా నిలబడితేనే ప్రేమ గెలుస్తుంది. ఇక్కడ గెలవడం అంటే ఇద్దరు పెళ్లి చేసుకొని జీవి...