నిన్ను చూసిన క్షణం నుంచి గుండెలో అలజడి, జలజల జలపాతమై మెదడు నుంచి అరికాలుకు ప్రవహిస్తోంది. పుష్పక విమానమై పుడమి అంతా నన్ను తన ఒడిలో దాచుకుంటోంది. మృదుస్వరంతోపాటు రిథమిక్ గా సాగే సంగీతం...., బిగబట్టిన ఊపిరిని తేలికగా వదులుతూ... అతనికేసి చూశాను. మరింతగా ఇంకొంతగా ఆ కళ్ళలో... ఆ కనుల కౌగిళ్ళలో ఒదిగి పొమ్మని మనసు చెబుతోంది. చుట్టూ ఉన్న వాతావరణం ఒక్కసారిగా వెచ్చబడిపోయింది. స్వేద బిందువులు ముఖంపై ఆవిర్భవించాయి. నా కనురెప్ప చాటులో నీతో కాపురం ఉండే నేను, నీకనుచూపు సోకగానే... కరిగి మాయమైపోయాను. చలికి వనికే చిగురుటాకుల పెదవులను అరచేతులలో అదిమిపట్టుకున్నాను. సిగ్గు మోయలేక రెప్పులు వాలిపోతుంటే, అరవిరిసిన కన్నులతో ఏదో అంతరార్థాన్ని అలవికాక నీకు ఏలానో... చెప్పుకున్నాను. అల్లంత దూరంలో నిన్ను చూసినప్పుడు అగుపించని ఈ సిగ్గు, ఇప్పుడిప్పుడే అడుగులు నేర్చుకుంటోంది. నీ వెలుతురు నిండిన కన్నులు జల్లే వెలుగుల రేఖలు, నన్ను కాల్చి బూడిద చేస్తున్నాయి. పరిహాసమా నీకు ఈ ప్రణయ ప్రళయము!. వెన్నులో వచ్చే ఈ భయాన్ని మిన్నుకేసి చూసి ఆపుకుంటున్నాను. దొరికిపోవడం ఇష్టమే ఇలా నీ కళ్ళకు. కానీ సిగ్గులో దొర్లిపోతూ... ఎలా చెప్పు...
Telugu and English writings