ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జూన్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

ఇది స్వప్నమా?! లేక సత్యమా?

 నీ తలపుల వానలో... తడిచిన దేహము, వలపుల పువ్వులు విచ్చిన మోహము, ఇహము - పరము లేవన్నవి. ఈవల- ఆవల వద్దన్నవి. వెయ్యి కలువలు ఒక్కసారి విచ్చినట్టు, వేయి కన్నులు ఒక్కసారి తెరిచినట్టు, ఆ జిలుగుల వెలుగుల చూపులు, నా ముందట మెరిసిన క్షణమున, నా గుండె దొర్లి, పొంగిపొర్లి, ఎటువైపు వెళ్లిందో తెలియదు! నీకు కనిపిస్తే తెచ్చి ఇవ్వు. వద్దులే! నీచోటే... ఉండనివ్వు. విరజాజులు కొమ్మ పై ఆడే సరసాలు చూస్తూ... మన మధ్య సాగిన సల్లాపాలను గుర్తు తెచ్చుకుంటున్నాను. నీ విసురులు, కసురులు, ముసి ముసి నవ్వులు, కసి తలపుల కన్నులు, వశ మగు చూపులు, నా ఉసురు తీసి వెళ్లినవని ఈ నిశి రాతిరికి చెప్పుకుంటూ ఉన్నాను. ఆ రోజు నుంచి ఈరోజు దాకా ప్రతి మాటను, గడియారానికి అప్ప జెబుతున్నాను. గడిచిన గడియ గడియను, గడియలో ప్రతి నిమిషమును, నిమిషములో ప్రతి సెకనును, క్షణకాలమైనా... నిన్ను చూడక రెప్ప వేసానా? ఆ కనురెప్ప పాటులో... నీ కదలికను కోల్పోయానా?! గంధర్వ కన్య నైనా కాకపోతిని! రెప్పవేయని వరముండేదని. నీ అరుణ వర్ణపు అధరములను, అవి గాంచి పైన వేసుకున్న బిడియపు తెరలను, నీ భుజములపై వాల్చిన ముఖమును, మన వెచ్చని చేతుల కౌగిలిలో వచ్చిన స్వేదమును, మన మనసులో మాటలను

నా శ్రీరాముని కోసం🙏

 ఆ విశ్వరూపుని గుణగణాలను వెల్లడించే... వేయి నామాలను, గుండెలో ప్రతిధ్వనించుకుంటూ... ఈ విష్ణు సహస్రనామం చదువుతున్నాను. ఇది నా రాముని కోసం, నా దేవుని కోసం. జగత్ ప్రభువైన ఈ భగవానుడు నా కనుల ముందే అగుపించుచున్నాడు. ఈ ధ్యానంలో... మౌనముద్రలో... అతి సుందరమైన అతని నిజరూపును, చిరునగవును చూసిన ప్రత్యక్ష సాక్షిని నేను. దేవునితో నాకు గల సంబంధాన్ని, సమన్వయాన్ని ఉదాత్తంగా రాసుకుంటున్నాను. ఇందులోని ప్రతి అక్షరం అతని మందహాసం నుంచి ఆవిర్భవించినవే!!. నిలకడ చూపుల వాడు, నిర్మల నేత్రముల వాడు,  నవనీతము వంటి దేహము కలవాడు, నిరాడంబరుడై... నింగి వరకు ఎత్తైనవాడు.... ఈ సర్వేశ్వరుడు. గేయమై, గీతమై, నా గొంతులో గానమై, ప్రతి వాక్కును నాతో ఇలా రాయిస్తూ ఉన్నాడు. ఇతని అసమాన్యమైన కథ సామాన్యులకు అంతుపట్టదు. ఈ రాముని చిరంతర సిద్విలాసాన్ని, శ్రేష్టంగా భావించి ఆంతర్యం గ్రహిస్తే తప్ప పూర్తిగా బోధపడడు.  భగవద్గీత సారాంశాన్ని గ్రహించిన వారికి తెలుస్తుంది శ్రీకృష్ణుడితో అర్జునుడికి గల బాంధవ్యము, సఖ్యము, సాహద్యము, సారథ్యము. అదేవిధంగా మనము కూడా ధన్యజీవులను కాగలము. దేవుని యొక్క మమతకు లోబడి ధర్మనిరతిని పాటించిన వారికి, అతని పరమశాంతి ని

ఓ చూపు చాలు మన్మధుడా!

 నిన్ను చూసిన క్షణం నుంచి గుండెలో అలజడి, జలజల జలపాతమై మెదడు నుంచి అరికాలుకు ప్రవహిస్తోంది. పుష్పక విమానమై పుడమి అంతా నన్ను తన ఒడిలో దాచుకుంటోంది. మృదుస్వరంతోపాటు రిథమిక్ గా సాగే సంగీతం...., బిగబట్టిన ఊపిరిని తేలికగా వదులుతూ... అతనికేసి చూశాను. మరింతగా ఇంకొంతగా ఆ కళ్ళలో... ఆ కనుల కౌగిళ్ళలో ఒదిగి పొమ్మని మనసు చెబుతోంది. చుట్టూ ఉన్న వాతావరణం ఒక్కసారిగా వెచ్చబడిపోయింది. స్వేద బిందువులు ముఖంపై ఆవిర్భవించాయి. నా కనురెప్ప చాటులో నీతో కాపురం ఉండే నేను, నీకనుచూపు సోకగానే... కరిగి మాయమైపోయాను. చలికి వనికే చిగురుటాకుల పెదవులను అరచేతులలో అదిమిపట్టుకున్నాను. సిగ్గు మోయలేక రెప్పులు వాలిపోతుంటే, అరవిరిసిన కన్నులతో ఏదో అంతరార్థాన్ని అలవికాక నీకు ఏలానో... చెప్పుకున్నాను. అల్లంత దూరంలో నిన్ను చూసినప్పుడు అగుపించని ఈ సిగ్గు, ఇప్పుడిప్పుడే అడుగులు నేర్చుకుంటోంది. నీ వెలుతురు నిండిన కన్నులు జల్లే వెలుగుల రేఖలు, నన్ను కాల్చి బూడిద చేస్తున్నాయి. పరిహాసమా నీకు ఈ ప్రణయ ప్రళయము!. వెన్నులో వచ్చే ఈ భయాన్ని మిన్నుకేసి చూసి ఆపుకుంటున్నాను. దొరికిపోవడం ఇష్టమే ఇలా నీ కళ్ళకు. కానీ సిగ్గులో దొర్లిపోతూ... ఎలా చెప్పు ఈ స

రెండు గుండెల దూరం

 ఇద్దరం కలిస్తే నిండు పున్నమిలా ఉంటుంది. అందుకే విధికి అసూయ పుట్టి అప్పుడప్పుడు దూరం చేస్తుంది. కనుమరుగైన వాని కథలు రాస్తూ... కనిపించక పోతాడా అని కూనిరాగం తీస్తూ... ఈ కవ్వింపుల సవారీ చేస్తుంటాను, ఈ గతం తాలూకు గమనంపై, నా కలం తాలూకు కవనంపై. ఏ నందనం నుండి ఈ నారు తెచ్చుకుని నాటుకున్నానో... నా హృదయ మందిరమంతా... అతని పూజా మందిరమైంది. ఈ వికశించిన పూవుల తీరులో... ఈ తియ్యనిదనం, అతను నింపి వెళ్ళినదే. వెన్నెల వెలుగులు, రవిబింబ దీప్తులు... అల్లంత దూరాన మెరుస్తుంటే... అతని కన్నులే జ్ఞాపకమొస్తాయి, అస్తమానం... అనుదినం.  సగం చదివిన పుస్తకంలా ఎప్పటికీ నాకు పూర్తిగా అర్ధం కానివాడు, అర్థమైతే ఆరాధించడం మనేస్తానేమోనని మధ్య మధ్యలో మాయమౌతాడు. ఈ మాయమయ్యే రోజుల్లో నా తడి రెప్పల మీద పాకేటి ఈ కన్నీటి చుక్కలు, అతని చేత పొదిగిన ముత్యాలే. వెళ్లినవాడు వస్తాడని తెలుసు. అయినా మనసు ఊరుకోదే?! వెదకడం మొదలెడుతుంది. పక్షి రెక్కలు ఛాచుకుని ఈ పచ్చని కొమ్మల మధ్య ఎగరలేక ఎగురుతుంటాను. ఎగిరేటి దూరం ఏందాకో? యదకే తెలుసు, రెక్కలకేం తెలుసు?. ఆకాశమంతా... చాచుకుని అలిసిపోయేదాక ఎగురుతాయి. అంది అందని అందమే ముద్దు అన్నట్లు, చేతికందక కనుల

నిశ్శబ్దపు సంగీతం

 ఏ శూన్యం కేసి అట్లా చూస్తున్నాను? వసంతం పుష్పించడం ముగించుకొని సెలవు తీసుకుందనా? వాడిన వ్యర్థమైన పువ్వుల భారంతో గుండె చతికలబడిందనా? నిర్నిద్రమైన నీలాకాశం కళ్ళు మూసుకుని నేలపైకి కృంగి పడిందనా? ఎందుకీ నిశ్శబ్దం నాలో??? నన్ను వదిలి వెళ్లి ఏకాకైన ప్రియుడు ఈ నిర్జనమైన వీధిలో తానొక్కడే... వస్తాడని, నా ఇంటి తలుపు తెరిచి ఉంచాను. కలవలే మాయమై జారిపోతే కన్నీటిని ఎవరితో పంచుకోను? ఉండుండి తలుపు తెరిచి చూస్తున్నాను, ఈ దారిలో ఎక్కడైనా ఎదురొస్తాడని. ఈ చీకటి చిక్కుల లోతుల గుండా ఎందుకీ నిశ్శబ్దం నాలో?? చీకటి మేలి ముసుగు కప్పినప్పుడు తామరాకులన్నీ తలవంచుకొని దగ్గరగా ముడుచుకున్నాయి, నిద్ర దేవికి నన్ను అర్పించుకుందామని దుప్పటి కింద దాక్కున్నాను. అతను వచ్చి నా పక్కనే కూర్చున్నట్లు, అతని స్వరం నా చెవుల మారి మ్రోగినట్టు, అతని పరిమళం నా చుట్టూ ఆవరించినట్లు, ఆ కలలోంచి లేచాను. నాలో నన్నిలా కలవరపరిచేది వ్యదేంటో నాకు తెలియడం లేదు. మండే ఈ తపనాగ్నిలో ఎందుకీ నిశ్శబ్దం నాలో? క్షణికమైన విద్యుత్ కాంతి మేఘాలను కోసుకుంటూ మెరుపై మెరిసింది. అతని రాక కోసం రాయబారమా? ఇది. హృదయం తడుముకున్నాను. నా గదినిండా పేరుకున్న అతని ఆలోచనలు

అతడొక హిమశిఖరం

 జీవితంలో ఒక గాఢమైన ఇష్టం కలిగినప్పుడు ఆ ఇష్టం కలిగించే తన్వయత్వమే ప్రేమ. దాని ముందు ప్రపంచంలో మరేది ఎక్కువ కాదు. ఇప్పుడు మనసు దృష్టి ఇంకా విశాలమవుతుంది. ఇంకా హాయిగా... గొప్పగా... అనిపిస్తుంది. కానీ అతను మాత్రమే కనిపిస్తుంటాడు. అతని అందం, గుణం ఆపై ప్రేమ కప్పిన మోహం. జీవితంలోని ప్రతి అడుగు, ప్రతి కదలిక అతని కోసం ఏదోక త్యాగం చేయమంటాయి. త్యాగం ప్రేమకు దర్పణం. ఒక శిల్పి తన ఉలితో చెక్కినట్టు... అందమైన ముఖం, చక్కటి కనుబొమ్మలు, కళ్ళలో నెమలి కనుల మెరుపు, తీయటి గొంతు, మాటలలో ఒక సన్నని సంగీతం. సంభాషణలో మృదుత్వం, బింకం కొంచెం కొంచెంగా తొనికిసలాడుతుంటాయి. మనసులోకి తొంగి చూసే అతని ఆలోచన తీరు, ఇంకొంచెం అతని వైపు లాగుతుంటాయి. అప్పుడప్పుడు మాటలకు దొరకక ఎక్కడో వెళ్లి దాక్కుంటాడు. ఈ చిన్ని పావురం నీకోసం ఎన్ని ప్రేమ లేఖలు రాసిందో తెలుసా? అని అడగగానే, పెదవులపై విరబూసే చిరునవ్వే సమాధానం అంటాడు. ఆవేళ అతని కనులలో మెరుపేదో కదలాడుతుంది, అది మనసుకు మాత్రమే కనబడుతుంది. ఆ నవ్వు విని సిగ్గుపడి ముఖం ఎర్రబారిపోతుంది. ఎంతో ఎడబాటు నుంచి మనసును తేలిక పరిచే సంగీతం ఆ నవ్వు. ముఖాన్ని అరచేతుల్లో దాచుకొని అద్దానికి చూపెడతాన

అతడే కేశవుడు, అతడే నా ప్రభువు!.

 మెరుపు కొరడాలతో నల్లని ఆకాశాన్ని జులిపించి నాపై ప్రేమ వర్షాన్ని కురిపించు. నా పెదవులలో ప్రాణవాయువును నింపు. బీటలు వారిన నా హృదయంలో మెత్తని మబ్బు తరకను మొలిపించు. నా ప్రేమకాశాన్ని ఈ మూల నుంచి ఆ మూలకి మేల్కొలుపు. భరించలేని నిరాశతో ఈ గుండెను రగిలిస్తున్న అగ్నిని నీ ఊపిరితో చల్లార్చు. తల్లి కన్నీటి చూపు వంటి నీ అనుగ్రహాన్ని నాపై వర్షించు. నా పూల సజ్జలో పువ్వులన్ని నువ్వు వచ్చే తోవలో అలంకరించి ఉన్నాను. నీకోసం నైవేద్యాన్ని ముందు పెట్టుకుని కాచుకొని కూర్చుని ఉన్నాను.  నా ఈశ్వర పీఠమెక్కి పూజలు అందుకునే నీకోసం, దీపాలు వెలిగించి ఉన్నాను.  నిన్ను ఊరేగింప కోరి నా ప్రేమ రథంపై బంగారు కేతనాలు కట్టాను. వసంత మారుతంలోని పూల తీగ వలె గర్వంగా వికసించి పులకిస్తున్నాను. నీ ఆకర్షణ యొక్క వైభవాన్ని మనసు నిండా ఊరేగించుకోవాలని నీ రూపు కోసం వెతుకుతూ ఉన్నాను. సాయం సమయం, తగ్గుతున్న కాంతి లోకి వాలిపోతుంది సూర్యాస్తమయపు కడపటి కాంతిరేఖలు రాత్రిలోకి మాయమవుతున్నాయి. నక్షత్రం నుంచి నక్షత్రానికి ప్రతిధ్వనించే అతని స్వరమును వింటున్నాను. నా పేరును వింటున్నాను. సడి లేని అతని అడుగులు నా వైపే వస్తున్నాయి . అతని అడుగుల బరువును

ఇప్పటికి మేల్కున్నావా స్వామి?!

 తడిసి నీళ్ళోడుతున్న చీర కొంగును పిండుకుంటూ... అల్లంత దూరాన ఉన్న అతనిని చూసాను. కడవ నడుముకెత్తి తిరిగి మళ్ళీ మళ్ళీ చూసాను. ఎదుట ఏటుగట్టు వెనకనుంచి చుమ్మలు చుట్టుకుంటూ... తెల్లని పొగతెరలు, చెట్ల ముసుగులు దాటి వచ్చాను.  మామిడి చెట్టు ఆకుల గుబురుల్లోంచి, సన్నగా పడుతున్న నులి వెచ్చని సూర్యకిరణాలు.... మడత మంచంపై మాగన్నుగా పడుకుని ఉన్న నా మన్మధుడు. ఓయ్... అని కేక వేయాలనుంది, వాలుగాలిలో మాట కొట్టుకుని పోదా అని ఆగిపోయాను. తడక మీద ఆరవేసిన తుండువా లాగి దులుపుదామనుకున్నాను. గడుసుదనుకుంటాడని గమ్మునుండి పోయాను. పొగమంచు మేఘాల మధ్య చాచుకునే ఉంది. పసిడి పువ్వులు నా పిరికితనం చూసి నవ్వుకుంటున్నాయి. చెట్టు కొమ్మన కౌగిలించుకున్న రామచిలుకలు నీ మాటేమిటి? అని ఆరా తీశాయి.  సరే! నడుము మీద కడవ నిలవకుంది, అతనితో గొడవ పడమంది. నెత్తిన కుమ్మరిస్తే మేలుకొంటాడుగా?! అమ్మో కయ్యాలవాడు మాటలే కట్టేస్తాడు. వద్దులే రేగిపోయిన జుట్టును ముడి వేసుకుంటూ పక్కనే ఓ పూచిక పుల్ల కోసం వెతికాను. ఈ పడుచు వాడి కలలో ఏమొస్తుందో... నిద్రలోనే నవ్వాడు. చక్కనోడు చెంప మీద చంద్రవంకలు పూచాయి. మర్రి చెట్టు కాయలు ముసిముసిగా నవ్వుతూ... పుల్ల ఒకటి వ

ఒంటరైతే... ఓటమి కాదు!.

 జల్లు జల్లుగా నాపై వెన్నెల కురిపిన అతని ప్రేమని, తుల్లిపడి తన కౌగిలిలో ఒళ్ళు విరుచుకున్న రేయిని, ఒంటరితనపు సంకెళ్ళతో ఓదార్చు కుంటున్నాను. నడి రాతిరి జాములొస్తునాయి, అతని జాడలడిగి పోతున్నాయి. పొడిబారిన కన్నులు ఎదురు చూపులతో అలిసిపోతున్నాయి. తడి ఆరని చెంపలు మళ్ళీ మళ్ళీ తనకోసం తడిచిపోతున్నాయి. ఎడబాటు ఎంత గొప్పదో... కన్నీటిని ఏరై పొంగించగలుగుతుంది. వేయిసార్లు అతని మోముని తనివితీరా చూడాలని ఉంది. అరచేతులతో... తన చెంపలను తాకి నుదిటిపై ముద్దాడాలని ఉంది. నీ కనురెప్పల చాటున కలగానైన ఉన్నానా? నీ మెదడు పొరలలో జ్ఞాపకమైనా ఉన్నానా? అని మనసుతీరా అడగాలని ఉంది. ఈ రాత్రి, పగళ్ళు వస్తూనే ఉన్నాయి. నిరంతరం వస్తూనే ఉన్నాయి. నిన్ను నాతో కలపలేక దూరం నుండే వెళ్లిపోతున్నాయి. అవతలి ఒడ్డు నుంచి వచ్చే గాలి పులకరింత ఒక్కసారైనా నీ పరిమళాన్ని మోసుకురాలేకుంది. ఈ నల్లనైన నదీ తీరం నావైపు నువ్వు నడిచే తోవ కూడా మూసివేసిందా? ఈ వియోగం, ఈ అన్వేషణ... వినోదమా నీకు? నీ ఆకర్షణలో మరిగించి ఈ ఒడ్డునే వదిలి వెళ్ళిపోతావా? నాతో ఆడే ఈ దాగుడుమూతలు ఇంకెన్నియుగాలు?. తల్లికి ఎడమైన బిడ్డలా... నీ కోసం విలపిస్తున్నాను. నువ్వు నా కళ్ళపై కప్పిన

కళ్ళు తెరవని సీతలెందరో?!

 భర్త గారి గాలి మాటలు, గాలి వాగ్దానాలు విని మళ్ళీ మోసపోయి, కాపురానికి వెనక్కు వెళ్లే భార్యలెందరో! ఇంతకాలం భరించడం నా అజ్ఞానం, ఇక భరించలేను అని సుజ్ఞానంగా పలుకుతూనే మరల తమ విజ్ఞానాన్ని కోల్పోయి, అతని వెనక వెళ్లిపోతుంటారు. అతగాడి నుంచి అదనపు జ్ఞానం పొందటానికే ఈ అగచాట్లన్ని. అమ్మగారింటికి పోవడానికి మొహం చెల్లక, సిగ్గుపడి అతనితోనే కాలం వెళ్ళబుచ్చుకుంటారు. ఇక్కడ ఈమె అభిప్రాయాన్ని మార్చుకోవడం తప్ప, అతని ప్రవర్తనలో మార్పేమీ రాదు. ఆమె నోరు మూసుకుని ఉన్నంతకాలం, దెబ్బలకు ఓర్చినంత కాలం ఇది పండంటి కాపురమే!. పక్కవారికి ప్రేరణ కూడా ఈ అన్యోన్య దాంపత్యం. రంగనాయకమ్మ గారి "కళ్ళు తెరిచిన సీత" బుక్ చదువుతుంటే నాకెందుకో ఇలా రాయాలనిపించింది. బట్టలు, సర్టిఫికేట్లు సర్దుకుని నెలకోసారి పుట్టింటికి పారిపోయే భార్యలున్నారు. ఇరుగుపొరుగు వారి మాటలు విని, అత్తరింటి రాయబారాలతో... మళ్ళీ తిరిగు ముఖం పడుతుంటారు. మళ్లీ వారం తిరగక ముందే ఈ విముక్తి నుంచి ఎవరు బయట వేస్తారు వారికి ఆ జన్మాంతం  రుణపడి ఉంటాము, అని దేవుని ప్రార్థిస్తూ ఉంటారు. మనం ఆపదలో ఉన్నప్పుడు ఎదుటివారు సహాయం మనకు అంతలా అనిపిస్తుంది.  పడి పడి లేచాక,

అందమైన కనులవానికి అంకితం(100th blog).

 మారువేషంలో ఉన్న కృష్ణుడు నా ముందే తిరుగుతూ ఉంటే, జన్మలు మారినా ప్రేమని మర్చిపోలేని రాధగా అతని ముందే తిరుగుతూ ఉన్నాను. ఇది లౌకిక ప్రేమనో లేక అలౌకిక ప్రణయమో? నేను వర్ణించలేను. గొంతు గంభీరంగా ఉన్నా అతను మాటలో మధురమైన వాడు. నా యోగక్షేమాలు అడగకున్నా... నా ప్రేమ యాగంలో పూజ్యుడైన వాడు. నాకు ఈశ్వరుడైన వాడు, నా యందు దేవుడైన వాడు. ఏ దూప దీపములు, మంత్ర జపములు కోరనివాడు. నా అంతరంగమందు అనందరూపుడు. నిర్మలుడు, నిర్భయుడు, నిమీలిత నేత్రములతో నన్ను వరించి, హరించే నీరాజక్షుడు. అతడే నా ప్రియుడు, కలల వరుడు. నువ్వు నాకు పలకనంత దూరంలో ఉన్నా...నీ మౌనంలో నా హృదయాన్ని నింపుకుని, ఓర్చుకుని ఊరుకుంటాను. ఏదో ఒక రోజు నీ చూపులు, స్వర్ణదారలై నాపై వర్షిస్తాయి. ఆరోజు నా మనసులోని మాటలు రెక్కలు కట్టుకుని పాటలై నీ చెవులను చేరుతాయి. ఆరోజు నీ ముఖాన్ని ముద్దాడి, నీ చిరునవ్వుని దొంగిలిస్తాను. నా ప్రాణానికి ప్రాణమైన చెలికాడి చెంత ఒక్క నిమిషమైనా కూర్చునే చనువు కావాలని కోరుకుంటున్నాను. అతని చేతి స్పర్శ తగిలి నా హృదయంలో జరిగే విద్యుత్ ప్రవాహాన్ని చూడాలని ఉంది. తన గుసగుసలు, నిట్టూర్పులు తగిలేంత దగ్గరగా నా మాట సాగాలి. పగటి కాంతి పడ

జ్ఞానం- ధ్యానం, నా గ్రంథాలయం(99th blog)

 ఇది నా 99వ Blog, నేను కథలు రాయను, కవితలు రాయను, రచనలు చేయను. రోజు ఒక ఆరు పేరాగ్రాఫ్లు రాసి అందులో నా అమాయకపు ఫోటో ఒకటి పెట్టి ఏదో చదివిస్తూ ఉంటాను మీ చేత. అలా ఇది నా 99వ బ్లాగ్. ఇలా ఏదో ఒకటి రాయగలిగాలి అంటే దానికి ఒక ప్రేరణ ఉంటుంది.  రాయడానికి నాకు ప్రేరణ ఇచ్చిన వాటిల్లో మొదటివారు, మా తాత, రామచంద్రయ్య. ఆయన ఊటుకూరు గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో తెలుగు టీచర్ గా చేసేవారు. చాలా కవితలు రాసారు. తాత రాసిన సంక్షిప్త రామాయణం- శ్రీరామ శతకం అనే పేరుతో ఉంటుంది. అందులో రామాయణాన్ని మొత్తం 100 పద్యాలలో తాత సంక్షిప్తంగా రాశారు. ఈ పుస్తకాన్ని టిటిడి దేవస్థానం వాళ్ళు లక్ష కాపీలు అచ్చు వేశారు. తాత ఇప్పుడు లేరా? అంటే ఉన్నారు. ఆ పుస్తకంలో. కవులెక్కడికి వెళ్తారు? వారి రచనల్లో అలానే ఉంటారు. రెండవది నెల్లూరు, రేబలవారి వారి వీదిలో ఉన్న గ్రంథాలయం. ఇలా గ్రంథాలయం వెళ్లడం కూడా తాత నేర్పించిందే. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ చదివేటప్పుడు వేసవి సెలవుల్లో తాత వాళ్ళ ఊరికి వెళ్లే వాళ్ళం. రోజు సాయంత్రం గ్రంథాలయం తీసుకెళ్లేవాళ్లు. రెండు గంటలు గడిపే వాళ్ళం. అది నాకు బెస్ట్ టైం అన్నట్టు. ఇప్పటికీ RAIN(ధియేటర్) లో మూవీ చూడ్డ