నీలి రంగు చీర కట్టి, చందమామను చూసాను. తేనె రంగు పూసుకున్న కొత్త అందం, తానె తాను!. వెన్నెల వాగును కన్నులు చూసే ఈ తరుణం, మంచు కురిసే పుడమిపై మచ్చ లేని చందమామ... నిత్యమై, సత్యమై అంతెత్తులో ఉన్నాడు. బొత్తిగా నను చూడకుండా పైనే చూస్తూ ఉన్నాడు. పరుగు తీసాను తన వెంటే... ఊరంత తిరిగాను, ఊరు దాటి వచ్చాను. ఊపిరలిసి పోయింది.
ఏటి గట్టున ఇసుక తిన్నెలో తీరుగా నిలిచాడు. తాటి చెట్టు చాటున దొంగలా... దాగాడు. చూడబోతే కానరాడు, వెళ్లిపోతే వెంబడిస్తాడు.
అమృతం, ఐరావతం, కామధేనువు, కల్పవృక్షం, పారిజాతం, ధన్వంతరి... అన్ని ఐశ్వర్యాలను మించిన వాడు, పుడమికంతా... ఒకడే అందగాడు, ఈ చందమామ. అందినట్టే అంది, అందకుండా పోయే ఆకాశ తార. అతనిని పట్టుకుందామని ఆయన తో పరిగెట్టాను. ఊరి చివర ఆగాను.
నల్ల మబ్బులో చందమామ, తెల్ల రంగుని ఎవరికిచ్చాడో... వసంతాలు జల్లు కుని పసుపు రంగు దాల్చాడు. కలువబామ అరువు అడిగిందేమో... తన రంగు అద్దెకిచ్చాడు. తేట మీగడ రంగు తేరిపార పట్టాడు.
చూపుకింక మేలిమి రంగు, చూడకుంటే... మనసు కృంగు. వేల తారల మధ్య ఒకడే ఒక్కడు, వేగు చుక్కలా ఎదను గుచ్చుతాడు. వేసవంటే ముచ్చటేమో... మసక చీకటిలో మంచమేయ మంటాడు. మంచుకురిసే వేళ లోన వద్దు లోనికి పొమ్మంటాడు.
కలువ పూలపై వెన్నెల కురిపించి కబురులెన్నో చెబుతాడు. చలువ రాతి నేల పై తన రూపు రేఖలు చెక్కుతాడు. రాతిరైతే... కోనేటిలో జలకమాడుతాడు. తెల్ల చొక్కా వేసుకుని మేడపై కెక్కుతాడు.
ఎప్పుడు పుట్టాడో మరి ఎవరికీ తెలియదు. యేరు పుట్టినప్పుడు పుట్టాడో... ఊరు పుట్టినప్పుడు పుట్టాడో. పూలకైనా తెలుసునో... నీళ్ళ కయినా తెలుసునో... మనిషికైతే తెలియదు.
అమ్మ ముద్ద పెట్టే వేళ నుండి చూస్తున్నాను... అలిగితే పున్నమి దాకా రాడు, అలగకుంటే ఆకాశం అంటి పెట్టుకుంటాడు. ఆకలేసిన రాహువు కి అన్నమవుతాడు, కోపమొచ్చిన కేతువుకి కడుపు నింపుతాడు. ఎంత మంచివాడో చందమామ!రాకాసులతోనూ... స్నేహమాడుతాడు.
ఎవరికేమైనా కానీ కవికి మాత్రం కనబడుతుంటాడు. రవి కాంచని చోటు కవి గాంచినట్టు, వేకువ.... వెన్నెల వేరులేక ఎప్పుడూ... ఎదురే ఉంటాడు. కవి కన్నులకు వూతమిస్తాడు, కవి కల్పనకు రాత నిస్తాడు. ప్రేమ కవితలో ప్రేరనిస్తాడు, ప్రేయసి మోముపై ప్రతిబింబిస్తాడు.
అతడే అతడే అందగాడు,
అందమైనా చందురూడు.
కలకాలముండాలి వీడు.
వేయి వసంతాల వరుడు.
Thank you 🌝
Bhagyamati✍️.
అదిరింది
రిప్లయితొలగించండిThank you
రిప్లయితొలగించండి