ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వేయి వసంతాల చందమామ

    నీలి రంగు చీర కట్టి, చందమామను చూసాను. తేనె రంగు పూసుకున్న కొత్త అందం, తానె తాను!. వెన్నెల వాగును కన్నులు చూసే ఈ తరుణం, మంచు కురిసే పుడమిపై మచ్చ లేని చందమామ... నిత్యమై, సత్యమై అంతెత్తులో ఉన్నాడు. బొత్తిగా నను చూడకుండా పైనే చూస్తూ ఉన్నాడు. పరుగు తీసాను తన వెంటే... ఊరంత తిరిగాను, ఊరు దాటి వచ్చాను. ఊపిరలిసి పోయింది. 


ఏటి గట్టున ఇసుక తిన్నెలో తీరుగా నిలిచాడు. తాటి చెట్టు చాటున దొంగలా... దాగాడు. చూడబోతే కానరాడు, వెళ్లిపోతే వెంబడిస్తాడు. 

అమృతం, ఐరావతం, కామధేనువు, కల్పవృక్షం, పారిజాతం, ధన్వంతరి... అన్ని ఐశ్వర్యాలను మించిన వాడు, పుడమికంతా... ఒకడే అందగాడు, ఈ చందమామ. అందినట్టే అంది, అందకుండా పోయే ఆకాశ తార. అతనిని పట్టుకుందామని ఆయన తో పరిగెట్టాను. ఊరి చివర ఆగాను.

నల్ల మబ్బులో చందమామ, తెల్ల రంగుని ఎవరికిచ్చాడో... వసంతాలు జల్లు కుని పసుపు రంగు దాల్చాడు. కలువబామ అరువు అడిగిందేమో... తన రంగు అద్దెకిచ్చాడు. తేట మీగడ రంగు తేరిపార పట్టాడు.

చూపుకింక మేలిమి రంగు, చూడకుంటే... మనసు కృంగు. వేల తారల మధ్య ఒకడే ఒక్కడు, వేగు చుక్కలా ఎదను గుచ్చుతాడు. వేసవంటే ముచ్చటేమో... మసక చీకటిలో మంచమేయ మంటాడు. మంచుకురిసే వేళ లోన వద్దు లోనికి పొమ్మంటాడు.

కలువ పూలపై వెన్నెల కురిపించి కబురులెన్నో చెబుతాడు. చలువ రాతి నేల పై తన రూపు రేఖలు చెక్కుతాడు. రాతిరైతే... కోనేటిలో జలకమాడుతాడు. తెల్ల చొక్కా వేసుకుని మేడపై కెక్కుతాడు.


ఎప్పుడు పుట్టాడో మరి ఎవరికీ తెలియదు. యేరు పుట్టినప్పుడు పుట్టాడో... ఊరు పుట్టినప్పుడు పుట్టాడో. పూలకైనా తెలుసునో... నీళ్ళ కయినా తెలుసునో... మనిషికైతే తెలియదు. 

అమ్మ ముద్ద పెట్టే వేళ నుండి చూస్తున్నాను... అలిగితే పున్నమి దాకా రాడు, అలగకుంటే ఆకాశం అంటి పెట్టుకుంటాడు. ఆకలేసిన రాహువు కి అన్నమవుతాడు, కోపమొచ్చిన కేతువుకి కడుపు నింపుతాడు. ఎంత మంచివాడో చందమామ!రాకాసులతోనూ... స్నేహమాడుతాడు.

ఎవరికేమైనా కానీ కవికి మాత్రం కనబడుతుంటాడు. రవి కాంచని చోటు కవి గాంచినట్టు, వేకువ.... వెన్నెల వేరులేక ఎప్పుడూ... ఎదురే ఉంటాడు. కవి కన్నులకు వూతమిస్తాడు, కవి కల్పనకు రాత నిస్తాడు. ప్రేమ కవితలో ప్రేరనిస్తాడు, ప్రేయసి మోముపై ప్రతిబింబిస్తాడు. 

అతడే అతడే అందగాడు,

అందమైనా చందురూడు.

కలకాలముండాలి వీడు.

వేయి వసంతాల వరుడు.


Thank you 🌝

Bhagyamati✍️.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మొదటి ప్రేమ... మా నాన్న!

  ఒక అమ్మాయి ఏ వయసులో అయినా ఉండొచ్చు కానీ ఆమె ఎప్పటికీ తన తండ్రికి చిన్ని యువరాణిగానే ఉంటుంది.  తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న ఈ ప్రత్యేక బంధం... ఆరాధ్య బంధం!.  ఒక తండ్రి తన కూతురిపై ఉంచే హద్దులు లేని ప్రేమ ఎప్పటికీ తిరిగి చెల్లించలేనిది.   బెస్ట్ ఫ్రండ్ తో షాపింగ్:  నేను రత్నం జూనియర్ కాలేజి లో చదివేటప్పుడు కాలేజి వ్యాన్, ఇల్లు తప్ప ఏం తెలియదు. డిగ్రీ కి వచ్చాక న బెస్ట్ ఫ్రెండ్ శ్వేత తో మొదటిసారి బయటకి వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళడం, నాన్నకి trunk road లో కనిపించాను. నా మైండ్ బ్లోక్ అయ్యి రెడ్ అయ్యి, బ్లూ అయ్యింది. మా నాన్న మాత్రం సింపుల్ గా షాపింగ్ కి వచ్చావా? డబ్బులు ఉన్నాయా? అంటూ 2000 ఇచ్చేసి వెళ్ళాడు. నాన్న అంటే అంతే మరి, నెక్స్ట్ లెవెల్.  నేను పెద్ద చిరంజీవి అభిమాని ని. నాన్న ఫస్ట్ డే ఫస్ట్ షో చిరంజీవి మూవీ కి తీసుకుని వెళ్తాడు. నేను తిరుపతి లో M.SC చేసేప్పుడు నాకోసం dairy milk బాక్స్లు కొరియర్ చేసేవాడు. చిరంజవి గ్రీటింగ్స్ పంపేవాడు. నాన్నకి నేను ఎప్పటికీ చిన్న పిల్లనే. నేను అబద్ధాలు చెప్పను. ఇప్పటికీ చెప్పను. అందుకే నన్ను మా అమ్మ, నాన్న బాగా నమ్ముతారు. నా ప్ర...

ఇది యుగాలనాటి ప్రేమ!.

 రాధంటే... ఉత్తదేహం కాదు, ఉత్త మనసే కాదు, రాధంటే ఆత్మ. కృష్ణుని ప్రేమలో లీనమైన ఆత్మ. ప్రపంచానికి అర్థం కాని ఎన్నో విషయాలలో వీరి ఇరువురి ప్రేమ కూడా ఒకటి. వీరి శృంగారం మానసికమే! కానీ ఆత్మసంబంధం. ఏ ప్రేమ కథకైనా వీరే ఆదర్శం. ప్రేమ యొక్క గొప్పతనం పట్టాలంటే... కథలో చిత్రించే పాత్రలను రాధాకృష్ణలను ఊహించే రాయాలి. కృష్ణుని పై ఆశలు రేకెత్తించుకొని మనసును కృంగ దీసుకున్న రాధ ప్రేమ లోంచి విరహం అనే పదం పుట్టుకొచ్చిందేమో?! ప్రేమంటే మనసంతా కాముఖత్వం పులుముకోవడం కాదు, దేహవసరాలను తీర్చుకోవడం కాదు, ప్రేమంటే విశాలత్వం, దైవత్వం, విరహం, తపన, వేదన, ఎడబాటు, త్యాగం, కృష్ణుని రూపు కోసం పరితపించే రాధ దినచర్య. అందుకే రాధాకృష్ణుల ప్రేమ ఉత్త ప్రబంధ కథగా కాకుండా... యుగాలు చెప్పుకునే గొప్ప ప్రేమగాధ గా మిగిలింది. ఒక ప్రేమ కథను పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టాలన్నా... ఒక ప్రేమ గీతాన్ని, స్వర్గాన్ని తాకేంత ఆనందంగా ఆలాపించాలన్నా... రాధాకృష్ణుల ప్రేమే ప్రేరణ. ఇంత గొప్పగా మనం ప్రేమించాలంటే రోజు మనసుకి మెదడుకి మధ్య దేవాసుర యుద్ధమే జరుగుతుంది, అయినా నిలబడితేనే ప్రేమ గెలుస్తుంది. ఇక్కడ గెలవడం అంటే ఇద్దరు పెళ్లి చేసుకొని జీవి...

అతడొక హిమశిఖరం

 జీవితంలో ఒక గాఢమైన ఇష్టం కలిగినప్పుడు ఆ ఇష్టం కలిగించే తన్వయత్వమే ప్రేమ. దాని ముందు ప్రపంచంలో మరేది ఎక్కువ కాదు. ఇప్పుడు మనసు దృష్టి ఇంకా విశాలమవుతుంది. ఇంకా హాయిగా... గొప్పగా... అనిపిస్తుంది. కానీ అతను మాత్రమే కనిపిస్తుంటాడు. అతని అందం, గుణం ఆపై ప్రేమ కప్పిన మోహం. జీవితంలోని ప్రతి అడుగు, ప్రతి కదలిక అతని కోసం ఏదోక త్యాగం చేయమంటాయి. త్యాగం ప్రేమకు దర్పణం. ఒక శిల్పి తన ఉలితో చెక్కినట్టు... అందమైన ముఖం, చక్కటి కనుబొమ్మలు, కళ్ళలో నెమలి కనుల మెరుపు, తీయటి గొంతు, మాటలలో ఒక సన్నని సంగీతం. సంభాషణలో మృదుత్వం, బింకం కొంచెం కొంచెంగా తొనికిసలాడుతుంటాయి. మనసులోకి తొంగి చూసే అతని ఆలోచన తీరు, ఇంకొంచెం అతని వైపు లాగుతుంటాయి. అప్పుడప్పుడు మాటలకు దొరకక ఎక్కడో వెళ్లి దాక్కుంటాడు. ఈ చిన్ని పావురం నీకోసం ఎన్ని ప్రేమ లేఖలు రాసిందో తెలుసా? అని అడగగానే, పెదవులపై విరబూసే చిరునవ్వే సమాధానం అంటాడు. ఆవేళ అతని కనులలో మెరుపేదో కదలాడుతుంది, అది మనసుకు మాత్రమే కనబడుతుంది. ఆ నవ్వు విని సిగ్గుపడి ముఖం ఎర్రబారిపోతుంది. ఎంతో ఎడబాటు నుంచి మనసును తేలిక పరిచే సంగీతం ఆ నవ్వు. ముఖాన్ని అరచేతుల్లో దాచుకొని అద్దానికి చూపె...