ఒక కవి పనిలో ఉన్నాడు అంటే అతని కళ్ళు కిటికీ బయట ఉంటాయి. కలం కాగితం మీద ఉంటుంది. రాయడం స్టార్ట్ చేస్తే నా మాట నేనే వినను టైప్ లో ఏదో ఒకటి రాయడం మొదలు పెట్టాలి. అప్పుడే కొన్ని రోజుల తరువాత ఆ పిచ్చి రాతలు కవితలు అవుతాయి. కమ్మగా రాసేది కవి మనసులో సిరా కాదు, అతని మనసులో భావాల ధార.
అసలెందుకు రాయాలి?:
ఈ రాయడం వెనక ఎన్నో కథలుంటాయి. కమర్షియల్ గా ఆలోచిస్తే డబ్బు సంపాదించటానికి రాస్తుంటారు. నాలాంటి వారు రాయడం ఇష్టం కాబట్టి రాస్తుంటాము. ఇలా రాస్తూ ఎదుటివారిని శబ్ధం లేకుండా తిట్టొచ్చు, కొట్టొచ్చనట్లు. సమాజం లో విప్లవం మొదలవ్వాలి అంటే ముందుగా కవి కలం దానికి ఊతనిస్తుంది. సిరా రంగు ఏదైనా చదివిన వాడి గుండెకు ఎర్ర రంగు పులుముతుంది.
రాయడం మొదలు పెట్టిన వాళ్ళకి మనుషులతో పని ఉండదు. ఈరోజు ఏమి రాద్దాం? అనే ఆలోచన తప్ప. రాయకుంటే ఆ ఫీలింగ్ ! సీసాలో బూతం లా నన్ను బయట వేయి అని వేడుకుంటుంది. బయట పడేస్తే ఎవరైనా చదవని లేకపోని హమ్మయ్య అనిపిస్తుంది. మన లోకం లో మనం బ్రతకడానికి ఈ రాయడం అనేది నేనిచ్చే మంచి సలహా! ఉపయోగించుకోండి మిత్రులారా...
ఇస్పిరేషన్ కావాలి:
ప్రేమగా పెంచుకునే కుక్క గురించి రాయొచ్చు, మొక్క గురించి రాయొచ్చు. నాన్న గురించి రాయొచ్చు, వాన గురించి రాయొచ్చు. రాయడం మొదలు పెడితే ప్రతీదీ స్ఫూర్తి నిస్తుంది. ఈరోజు బస్ లో కనిపించిన అమ్మాయి గురించి రాయొచ్చు, ఆఫీస్ లో మనల్ని తిట్టిన బాస్ గురించి రాయొచ్చు. నీకు ఇష్టమైన హీరో గురించి రాయి, నీకు ఎగ్జామ్ లో జీరో ఎందుకు వచ్చిందో రాయి. పెన్నులో ఇంకు, పెన్ను ముందు పేపరు ఉంటే చాలు, తోచినవన్ని రాసేస్తే గుండె తేలిక అవుతుంది.
గొప్ప రచయితలు కావాలంటే?!
పరీక్షలు పాస్ అవ్వాలంటే బాగా ఎలా చదవాలో... అలానే గొప్పగా రాయాలంటే వేరే వారి రచనలు చదవడానికి సమయం గడపాలి. చదవడానికి నాకు సమయం లేదు అంటే రాయడానికి కూడా టైం లేదని ఊరుకోవడం ఉత్తమం.
మా యూనివర్సిటీ లైబ్రరీ లో నా బయోటెక్నాలజీ తో పాటు తెలుగు సాహిత్యం, ఇంకా రకరకాల బుక్స్ చదివేదాన్ని. అలా ఎక్కువ చదవడం మనకు కొత్త పదాలను నేర్పుతుంది. ఏ రచనకైన రెండు భాగాలుంటాయి. ఒకటి మన అలోచలను అన్నింటినీ రాయడం, రెండవది ఆ రాతను కమ్మగా రాయడం.
మన రచనలు చదివే వారి అభిరుచి కి తగ్గట్టుగా రాయాలి. వారితో సంభాషిస్తూ రచన సాగాలి. ఒకే వైపు నుండి ఏదో రాసుకుంటూ పోతే one side love లాగా ఉంటుంది. మొదటి పేరా, చివరి పేరా మన పరిచయం, సందేశం తో ఆకట్టు కోవాలి. మిగిలిన పేరాలలో పాఠకులతో సంభాషించడం నేర్చుకోవాలి. మన కలం తో చదివే వారి గుండెపై సవారీ చేయాలి. ఆగితే గుర్రం ఓడిపోతుంది కాబట్టి సందేశం ఇచ్చాకే ఆపాలి.
మంచి రచనలో ఎన్ని పదాలు ఉండాలి?
బ్లాగర్ లో బ్లాగ్స్ రాసేపుడు 1500 నుండి 3000 పదాలు రాయాలని గూగుల్ చెబుతుంది. అంత సోది చదివే ఓపిక జనాలకు ఉండదు. మైక్రో బ్లాగ్స్ అంటే 300 నుండి 800 పదాలు రాయడం. ఇవి మనం Tumblr, Medium, LinkedIn, Reddit అనే apps లో రాయొచ్చు. కొన్నిసార్లు ఇక్కడికి చాలు అని రాయడం ఆపుతాం. కొన్ని సార్లు తృప్తి లేక ఇంకో 2 పేరాలు రాస్తాం. రెండింటిలోనూ నిజం ఉంది. రాసే అంశం పై మనకి ఉన్న జ్ఞానం, ఉత్సుకత ఇలా మన చేత రాయిస్తాయి.
మనం రాసేది కథ అయినట్లయితే కారెక్టర్స్ ఎక్కువ పెట్టి ఎక్కువ పదాలు జోడించవచ్చు. రచన అయితే side heading పెట్టడం ద్వారా బ్రేక్స్ ఇస్తూ పదాలు జోడించవచ్చు. మట్టిలో పడ్డ మన అడుగుల ముద్రలా... మన పదాలు పాఠకుల గుండెలో ముద్రపడాలి. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన వేమన, సుమతి శతకాలు మనకి ఇంకా తియ్యగా వినిపిస్తాయి కదా, అలా.
కొన్ని సినిమా పాటలు కూడా అంతే, నేనెప్పుడో చిన్నపుడు చూసిన పాట, ఏ దివిలో మెరిసిన పారిజాతమో... అందంగా ఎవరైనా కళ్ళ ముందు వెళుతుంటే మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. ఆ పదాలు అంత మత్తుగా అందాన్ని వర్ణించడం వల్ల ఇప్పటికీ మనసు పాడుతోంది.
ప్రతి రచనలో ఒక రహస్యం దాగి ఉంటుంది. అది మన గురించి చెప్పే రచన అయినా... అవతలి వారికి చెప్పాలని రాసేదైనా. ఎన్ని పేరాలు రాసినా ఆకరులో ఇంకా ఏదో మిగిలిన నిశ్శబ్దంలో మనసు ఉండిపోవడం కవి మనసుకు సాధారణం. నాకు చాలా సార్లు అలానే అనిపిస్తోంది. ఈ రచనలు ఎలాంటివి అంటే... నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అని ప్రేమికుని కి చెప్పడం లాంటివి. తనివి తీరదు. ప్రేమ అయినా రచన అయినా జీవనది లాంటివి. అవి జల జలా కదలాలి, గల గలా పారాలి, సంద్రం లో కలిసే దాకా సాగుతూ పోవాలి.
సందేశం:
ఇందులో సందేశం ఏం లేదు మిత్రులారా! మీరు రాయండి, నేను చదువుతాను. నేను రాస్తాను, మీరు చదవండి.
ఉంటాను.
ఇట్లు,
మీ భాగ్యమతి✍️.
మీ వాట్సప్ నంబర్ పెట్టండి.. అలా రాసినవి మీకు పంపుతా.. మీరు చూడండి.. మీరు చూసి ఎడిట్ చేశాక అప్పుడు F.B లో పోస్ట్ చేస్తా..🤝🙏
రిప్లయితొలగించండి