ఇంగ్లీష్ మందులకు భయపడే ప్రతి ఒక్కరూ వెళ్ళేది హోమియోపతి కే. ఎందుకంటే ఇక్కడ చేదు మాత్రలు, ఇంజక్షన్లు ఉండవు. తీయటి గోలీల తో జబ్బును నయం చేస్తారు. నాకు ఫార్మసూటికల్ కంపెనీ లో, మందులు తయారు చేసే విభాగంలో అనుభవం ఉంది. అయినా నేను ఇంగ్లీష్ మందుల జోలికి వెళ్లకుండా కషాయాల తో తగ్గించుకుంటాను. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మరి.
ఇంగ్లీష్ డాక్టర్
ఇప్పుడు నేను చెప్పబోయే హోమియోపతి డాక్టర్... శ్రీ పావులూరి కృష్ణ చౌదరి గారు, తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తి. ఆంధ్రాలో ఇప్పుడున్న హోమియోపతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రాకముందు మాటిది. ఈయన మన ఆంధ్రుల మొదటి హోమియోపతి డాక్టర్ గారు. ఆశ్చర్యం ఏమిటంటే... ముందు ఈయన కూడా అల్లోపతి డాక్టరే!.
బాల్యం
ఈయన తన చిన్ననాటి నుంచి గ్రంథాలయ ఉద్యమాలలో చురుకుగా పాల్గొనే వాడట. రోజు బుట్ట తీసుకొని ఇంటింటికి వెళ్లి పిడికెడు బియ్యం అడిగేవారట. నెలకొకసారి ఆ బియ్యాన్ని అమ్మి, ఆ డబ్బుతో పుస్తకాలు కొని గ్రంథాలయంలో ఉంచేవారట. అప్పట్లో పుస్తకాలు చదవాలి, జ్ఞానోపార్జన చేయాలి... అని ప్రజలలో ఎంత పట్టుదల ఉండేదో కదా!
ఈ డాక్టర్ గారు మెడిసిన్ పూర్తి చేశాక, గుంటూరు జిల్లా పొన్నూరులో ఆచార్య ఎన్జీ రంగా గారి చేతుల మీద అల్లోపతి ఆసుపత్రి స్థాపించారు. తరువాత ఆయనకి ఇసనోఫిలియా రావడం, ఇంగ్లీష్ మందులకు తగ్గకపోవడం, ఆయన స్నేహితుని తండ్రి హోమియోపతి డాక్టర్ గా ఉండడం, ఆయనను లండన్ లో హోమియోపతి చదివేలా చేశాయి. ఇండియాకి తిరిగి వచ్చాక గుంటూరులో హోమియోపతి క్లినిక్ స్థాపించి, చాలామంది సినీ నటులకి... సెలబ్రిటీ డాక్టర్ గా మారిపోయారు.
హోమియోపతికి ఎక్కువ ప్రాచుర్యం రావాలన్నా ఆలోచనతో హైదరాబాదులోని గవర్నమెంట్ హోమియోపతి కళాశాలలో 10 సంవత్సరాలకు పైగా ప్రిన్సిపల్ గా చేశారు. ఇదే సమయంలో భారత రాష్ట్రపతికి ఫిజీషియన్ గా, ఇంకెన్నో ప్రభుత్వ పదవుల్లో కొనసాగారు. ఈయన ఒక దశాబ్దంపైగా ఈనాడు మ్యాగజైన్లో హోమియో మెడిసిన్ గురించి వ్యాసాలు రాసి హోమియో వైద్య వృద్ధికి ఎంతగానో కృషి చేశారు.
అల్లోపతి డాక్టర్లు, హోమియోపతి వారిని ఇప్పటికీ డాక్టర్లుగా అంగీకరించరు, మరి అది వేరే విషయం. ఎవరి నమ్మకాలు వారివి.
✍️Bhagyamati.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి