వేళయింది వేకువ పొడుపుకు, వెచ్చని కిరణాల రాకకు. మరల వచ్చాడు కృష్ణుడు, మధుర లీలా మనోహరుడు. కొండపై ఉండే వానికి గుండె ఎంత మెత్తనో... నిండు చందురునికి చెంతే ఉండినందుకేమో! ఘనములగు నీ గుణములను... గానమాడి ఈ వనమంతా... నిత్య వసంతమై వికసించును, బృందావనమై విరసిల్లును . అందము చందములు పొందికగా గలవానికి మలయ చందనపు గంధము పూయగా... శ్వేత సౌదము ఆ దేహము, పసిడివర్ణమై మెరిసినది. ఆ ముదిత మనోహర మోమును చూసి పుష్పరాజములు సిగ్గుపడి, పూజా కుసుమములైనవి. కొండపై గిరిధరుడు కొలను కన్నులేసుకుని కవ్విస్తూ చూసాడు. అరవిరిసిన గోపిక కన్నులు అదిరేటి అదరములను, మునిపంటి బట్టి, పదములన్నీ పాట కట్టినా... చిత్తగించవా చిన్ని కన్నయ్యా! ఈ సుకుమార సుందరీమణి తన విరహ బాధలను ప్రణయ గాథలుగా... పరవశించి పాడే వేళ నీ మురళి గానములో బంధించి, కనుల వలవేసి మరలా కవ్విస్తున్నావా!? సూర్యుడు దెంచిపోయే వేళ శూన్యమైపోయినట్టు, సంధ్య వేళకు మాయమవుతావు, క్షణక్షణమును గోచరించే నీ సుందరమోమును వందఏళ్లకు చూపెడతావు. ఇన్నేళ్ల తరువాత మరలా రేపొస్తుంది, నీ మందార మోమును చూపెడుతుంది. ఇన్ని గడియల ఈ వేదనంతా మరలా గానమై వినబడుతుంది. నీ తలపుల జడివానలో స్ముర...
పసుపు గడపకు, ఎదురుచూపుల ఎరుపు రంగులద్ది, తళుకుతారల పవిట కప్పుకుని, తమరి కోసం చూస్తు ఉన్నాను. నీలిరంగు చీరపై నా నీలాల కురులు పరచి, నచ్చినవాడు దొరికాడని ఈ వెచ్చని రాతిరికి కబురులు చెబుతున్నాను. పసిడి బొమ్మగా మారి పలుకు తేనెల చిలుకనై కొత్త పలుకులు నేర్చుతున్నాను. కులుకు నగవుల బిగువులు, నుదుట కుంకుమ జిలుగులు.... నా అదురు బెదురు చూపులు, అన్నీ మీవే!. నా పెదవులపై ఒలికే ఈ మధువుల చినుకులు మీ అదరముల చేర్చే త్రోవున్నదేమో చెబుతారా?! మిమ్ము చూసిన నాటి నుంచి ఈనాటి వరకు, మీ చూపు జల్లిన సప్తవర్ణాల వానలో తడిసిపోతున్నాను. నా విశాల ప్రపంచానికి కొత్త వర్ణాల నద్దుకున్నాను. గతం తాలూకు నలుపు తెలుపుల రాతిరులు, నన్నిక గాయం చేయలేవు. మీ తీపి పలుకుల మబ్బుల తెరలు నా మనో ఆకాశమంతా పరుచుకున్నాయి. వెన్నెల్లో చిన్న పిల్లనై అల్లిబిల్లి తిరుగుతున్నాను. కళ్ళకపటమెరుగని మీ మనసు నాకు కమ్మని కథలు చెప్పింది. మీ మాటల్లోని నిజం, నా మనసు గాయాలపై మందు పూసింది. కళ్ళముందు మీరున్నట్టు కొత్తగా ఏదో రాయమంది. నా కళ్ళ ముందటి ఆ రూపుని నేను మరువనే లేదు. మసకగానే మోసుకొచ్చిన కొన్ని రూపురేఖలను మళ్లీ మళ్లీ తలుచుకుంటూ వెన్నెల పేరు పెట...