పగలంతా పరుగులు తీసి తాపత్రయపడ్డ మనసు సాయంత్రం కుదుట పడకుంది. రాత్రి జోల పాడి ప్రేమగా లాలించే ఒడి కరువైంది. ఈ మనసు పూర్వ చరిత్ర ఏమిటని దీని ఆచూకీ కనిపెడదామని బయలుదేరాను. చూసిన వాళ్లకి మరోలా అర్థమవుతుంది ఈ నవ్వు, కానీ ఆమె అంతరంగం ఏంటో ఆమెకే తెలుసు.
నేను అసలు లేనట్టే ఉన్నానా? నన్ను నేనే క్షమించుకొని బ్రతుకుతున్నానా? అద్దంలో నా చూపు నుండి నేనే తప్పించుకు తిరుగుతున్నానా? ఎన్నో కథలను చెప్పే నా కనులు, ఎంతో రాసిన నా చేతులు... ప్రేమ ముందు చులకన అయ్యాయా? చనువిచ్చి హృదయం, గతిలేక పడి ఉందా? బహు చచ్చుగా ఈడుస్తూ జీవితం సాగుతోందా?
జీవితపు వంకరదారుల్లో... పక్కుమని నవ్విన నా నవ్వుల శబ్దం ఇంకా వినబడుతూనే ఉంది. అయినా ఈ నవ్వులో మనసుకు సౌఖ్యం ఉందా? కొండల్లో ప్రతిధ్వనించే సంగీతంలా... మాటిమాటికి నా మాటలే చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. అమృత వాక్కులు కాదవి, ఆటవిక అంధకారంలో నలిగిపోయిన అర్ధంలేని ప్రశ్నలు. తలుచుకుంటే ఒళ్ళు జల్లుమనే మాటలు. ఆ ప్రశ్నల మధ్య నమ్రతగా నలిగిపోయిన అనుభవశాలిని నేను. ఇంకా ఇన్నేళ్ల తరువాత కూడా జీవితంలో ఆశ కోసం వెతుకుతూ ముందుకు సాగుతున్నాను. నా ఆత్మగౌరవం కోసం తపన పడటం ఇప్పుడు నా వంతు. వేటాడే చేతులు వెంటాడుతుంటే వాటి నుండి నన్ను నేను దాచుకుంటున్నాను.
ఇంతకాలం వృధా అయిన సమయం నా జీవితంలో నుంచి జారిపోయిన అదృష్టమే!. ఆ కాలం మళ్ళీ వస్తుందని, నా వైపు కళ్ళు తిప్పుతుందని ఎన్నాళ్లు కాచుకొని ఉన్న లాభం లేదు. లోకానికి వినపడకుండా హృదయం పడ్డ బాధంతా మాటలలో రాసుకుని కాగితాలలో దాచుకున్నది చాలు. మధుర భందనాలతో కట్టిముడేసుకున్న సంవత్సరాలు ఎన్ని? క్రూరమైన నవ్వుతో హృదయాన్ని చీల్చిన క్షణాలు ఎన్ని? రేపు ఎక్కడ కళ్ళు తెరుస్తానో... అని భయం వేస్తుంది. ఈ రాతిరిని ఇలానే నిద్ర పొమ్మని బతిమాలు తుంటాను.
కొంచెం అపవిత్ర దోషం, మరి కొంచెం అనుమాన దోషం అంతా కలగలిపి విషమయ్యాను. నా ప్రేమ నిర్మలమని తెలియజేసి అలసిపోయాను. ఒక్కసారి నా నవ్వే ముఖాన్ని, నిజంగా నవ్వే ముఖాన్ని, అద్దంలో చూడాలని ఆరాటపడుతున్నాను. కలలోనైనా మనసులోనైనా నిన్ను తప్ప మరల ఎవరిని తలుచుకోనేలేదని నీకు విన్నవించి విసిగిపోయాను. అప్పుడెప్పుడో కొట్టాల్సిన అలారం చప్పుడు గుండెలో ఇప్పుడు వినపడుతోంది. గడియారాన్ని తన్ని కాలం కంటే ముందు పరిగెత్తాలనుంది. ఏ మాలిన్యము అంటని నా కన్నులు ఎప్పుడూ నిజ బింబాలనే చూపించాయి. అవే నా లోకంలో వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను, బహుదూరపు స్వాతంత్య్రం వైపు బాహువులు చాచి వెళ్ళిపోతున్నాను.
ఆకాశమంత స్వేచ్ఛని ఏరి కోరి గాజు సీసాలో బంధించుకోకండి... అమ్మాయిలు. మీలా మీరు బ్రతకండి.
Happy women's day💃🏻
Thank you 🙂,
Bhagyamati ✍🏻.
👌👌👌
రిప్లయితొలగించండిThank you 😊
తొలగించండిఇది కేవలం కథ కాదు కానీ మీ జీవితం లో జరిగింది అనిపిస్తుంది నాకు.
రిప్లయితొలగించండి🙏
తొలగించండి